History books
-
ఒక్కో బుక్... ఒక్కో కిక్
లాక్ డౌన్ లో ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సమయాన్ని వినియోగించుకుంటున్నారు. యోగా, ధ్యానం, డాన్స్, కుకింగ్, బుక్స్... ఇవన్నీ శ్రియను బిజీగా ఉంచుతున్నాయట. ఈ లాక్ డౌన్లో చదివిన పుస్తకాల గురించి ఓ వీడియోను పంచుకున్నారామె. ఒక్కో బుక్ ఒక్కో కిక్ ఇచ్చిందంటున్నారీ బ్యూటీ. ఇటీవల తాను చదివిన పుస్తకాల గురించి శ్రియ మాట్లాడుతూ –‘‘విలియమ్ డాల్ రాసిన ‘అనార్కీ’ చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నాను. నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. చరిత్రకు సంబంధించిన విషయాలు భలే ఆసక్తికరంగా అనిపిస్తుంటాయి. దక్షిణ భారత దేశానికి సంబంధించిన చరిత్ర పుస్తకాలు వెతుకుతున్నాను. ‘గాడ్ ఫాదర్’ చిత్రదర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పొల రచించిన ‘లివ్ సినిమా అండ్ ఇట్స్ టెక్నిక్స్’ చదివాను. సినిమాలంటే ఇష్టం ఉన్నవాళ్లు, సినిమాల్లో పని చేసేవాళ్లు ఈ బుక్ కచ్చితంగా చదవాలి. చాలా స్ఫూర్తివంతంగా అనిపించింది. ఈ పుస్తకాన్ని ఆండ్రూ (శ్రియ భర్త) నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. రచయిత జో డిస్పెంజ్ ‘బికమింగ్ సూపర్ న్యాచురల్’లో మన మెదడు ఎలా పని చేస్తుందో భలే చెప్పాడు. ట్రెవోర్ నోహా రాసిన ‘బోర్న్ క్రై మ్’ సరదాగా సాగింది. ‘ఉమెన్ హూ రన్ విత్ ఉల్ఫ్వ్’ మన స్పిరిట్‌ని పెద్ద స్థాయిలో ఉంచుతుంది. యోగాకి సంబంధించి ‘కృష్ణమాచార్య : హిజ్ లైఫ్ అండ్ టీచింగ్స్’ చదివాను. విపాసనకు సంబంధించి కొన్ని పుస్తకాలు చదివాను. ఈ పుస్తకాలన్నీ మీరు కూడా చదివి ఆనందిస్తారని, నేర్చుకుంటారని అనుకుంటున్నాను. మీరు కూడా నాకేదైనా పుస్తకాలు సూచించండి. విషాదంగా ఉండే పుస్తకాలు మాత్రం వద్దు’’ అన్నారు శ్రియ. -
ధైర్యం చేసి రాశా
‘‘టిపు చనిపోయి 220 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వార్తల్లో ఉంటున్నాడు. బ్రిటిషర్స్ మనల్ని వదిలి 72 ఏళ్లు అవుతున్నా.. క్రూర నియంతగా, ఇస్లాం మతోన్మాదిగా సుల్తాన్ మీద వాళ్లు వేసిన ముద్ర చెరిగిపోలేదు. ఈ వలస సామ్రాజ్యపు విధి విధానాలను సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతుందో.. వాళ్ల కోణంలోని మన చరిత్రను తిరగ రాసుకోవాల్సిన అవసరమూ అంతే ఉంది! అలాంటి ప్రయత్నమే ఈ ‘టిపు సుల్తాన్’ పుస్తకం’’ అని అంటున్నారు పుస్తక రచయిత్రి యార్లగడ్డ నిర్మల. ఆమె హైదరాబాద్ వాసి. హిస్టరీ డిపార్ట్మెంట్లో రీడర్‌గా పనిచేసి రిటైరయ్యారు. ‘టిపు సుల్తాన్’ రచన సందర్భంగా ఆమె గురించి ఆమె మాటల్లోనే.. ‘‘పుస్తకాలు చదవడం నా దిన చర్యలో భాగం.. చిన్నప్పటి నుంచి. మా నాన్న (జయ రావు) నేర్పిన అలవాటు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి. అమ్మ (మేరీ) టీచర్. వాళ్లిద్దరూ ఎడ్యుకేటెడ్స్, ఉద్యోగస్తులవడం వల్ల మా ఇద్దరినీ (అక్క, నేను) బాగా చదివించారు. ఆడపిల్లలకు అంత చదువెందుకని ఏ రోజూ అనుకోలేదు. తెలుగు మీడియంలో చదివించి విడిగా ఇంగ్లిష్ నేర్పించారు.. సాహిత్యం ద్వారా. ఇంగ్లిష్ లిటరేచర్‌లోని పెద్ద పెద్ద రైటర్స్ అంతా మా చిన్నప్పుడే మాకు పరిచయం అయ్యారు. అంతేకాదు హాలీవుడ్ క్లాసిక్స్ అన్నీ చూపించారు మాకు. ఇంగ్లిష్ భాష ఇంప్రూవ్‌మెంట్‌కు అదెంతో హెల్ప్ అయింది. ఇంకో రకంగా కూడా మేం అదృష్టవంతులమని చెప్పాలి. మా ఇష్టాయిష్టాల మీద మా అమ్మానాన్న ఏనాడూ పెత్తనం చెలాయించలేదు. ఇంటర్లో నాకు మంచి పర్సెంటేజ్ వచ్చింది. అప్పట్లో మెడిసిన్, ఇంజనీరింగ్‌లకు ఇప్పట్లా ఎంట్రన్స్ లేదు. మంచి పర్సెంటేజ్ ఉంటే చాలు సీట్ వచ్చేది. అట్లా నాకు ఇంటర్లో వచ్చిన మార్క్స్‌తో ఈజీగా మెడిసిన్‌లో సీట్ వచ్చేది. మా బంధువులంతా కూడా మా పేరెంట్స్ మీద ప్రెషర్ పెట్టారు నన్ను మెడిసిన్ చదివించమని. కాని నాన్న నన్ను ఫోర్స్ చేయలేదు. డిగ్రీలో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్ తీసుకున్నా. ఎమ్మేలో హిస్టరీ తీసుకున్నా. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. అప్పుడే గ్రూప్ వన్ కూడా రాశా. 23 ఏళ్లకే గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యా. కాని ఆ ఉద్యోగం అంత గొప్పగా అనిపించలేదు.అప్పటికే ఎంఫిల్ కూడా రాసి ఉన్నా. దాంతో గ్రూప్ వన్‌కి గుడ్‌బై చెప్పా. అప్పుడు మాత్రం పేరెంట్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. ఎంఫిల్ కూడా ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యా. పీహెచ్డీ చేశా.. విజయనగర సామ్రాజ్యంలోని గుడుల మీద. ఆ థీసిస్‌ని పబ్లిష్ కూడా చేశా యూజీసీ గ్రాంట్స్‌తో. అమెరికా, యూరప్ కంట్రీస్లోని స్కాలర్స్ అందరూ నా థీసిస్‌ను రిఫరెన్స్‌గా తీసుకుంటూంటారు. యూజీసీ ఫెలో, ఏపీపీఎస్సీ క్యాండిడేట్ని. నన్ను గైడ్ చేసి, ఈ స్థాయిలో నిలబెట్టిన గైడ్.. ప్రొఫెసర్ పీసపాటి శ్రీరామ్ శర్మగారు. టిపు సుల్తాన్.. నిజాలు..! తెలుగు, ఇంగ్లిష్ సాహిత్యంతోపాటు చరిత్ర అన్నా చాలా ఇష్టం నాకు. చదువు థియరీ అయితే.. దానికి ప్రాక్టికల్స్ పర్యటన అని బలంగా నమ్మడమే కాదు ఆచరిస్తాను కూడా. అందుకే నా సేవింగ్స్ అన్నిటినీ పర్యటనకు వెచ్చించాను. సోలో ట్రావెలింగ్‌నే ఇష్టపడ్తా. పందొమ్మిదో శతాబ్దపు ఇంగ్లిష్ సాహిత్యాన్ని ప్రాక్టికల్‌గా ఎక్స్పీరియన్స్ చేసేందుకు యూరప్ వెళ్లాను. చరిత్రను అర్థం చేసుకోవడానికి ఆఫ్రికా దేశాలు తిరిగాను. చిత్రంగా అక్కడి ప్రతి మూల.. ప్రతి ప్రదేశంతో నాకు ఇదివరకే పరిచయం ఉన్నట్టనిపించింది. అదే సాహిత్యానికున్న గొప్పదనం. ప్రాంతాలనే కాదు మనం లేని కాలమాన పరిస్థితుల్లోకి మనల్ని తీసుకెళ్లి వాటితో మనల్ని మమేకం చేస్తుంది. అట్లాగే నేను చూసిన హాలీవుడ్ క్లాసిక్స్‌లోని ప్లేసెస్‌నీ చుట్టొచ్చాను. ‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లెస్’ అని బెర్నాడ్ షా సెలవిచ్చాడు కాని నేనైతే ‘నాలెడ్జ్ ఈజ్ హ్యాపీనెస్’ అనుకుంటాను. ఇదే సూత్రాన్ని నేను పనిచేసిన నాంపల్లి (హైదరాబాద్)లోని ఇందిరా ప్రియదర్శిని గవర్నమెంట్ డిగ్రీ మహిళా కాలేజ్ స్టూడెంట్స్ విషయంలోనూ అప్లయ్ చేశాను. నా పర్సనల్ ఇంటరెస్ట్‌తో యేడాదికి ఒకసారి ఆ పిల్లల్నీ స్టడీ టూర్‌కి తీసుకెళ్లేదాన్ని. అలా చరిత్ర చదివితే, ప్రపంచం చుడితే వచ్చిన జ్ఞానమే ఈరోజు టిపు సుల్తాన్ గురించి రాయడానికి తోడ్పడింది.టిపు సుల్తాన్ గురించి చాలా చదివాను. మరింతగా అర్థం చేసుకోవడానికి అనేకసార్లు మైసూర్ కూడా వెళ్లొచ్చాను. ఆ అనుభవం.. టిపు మీద వచ్చిన ఇంకా అనేక పుస్తకాలు.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చరిత్రకారులు ఆయన గురించి పలు సందర్భాల్లో ఇచ్చిన రిఫరెన్స్‌లు.. థీసిస్ మొదలైనవాటినన్నీ అధ్యయనం చేసి... విశ్లేషించి.. రెండేళ్లు శ్రమించి రాశాను. నాకు తెలుసు ఇప్పటి పరిస్థితుల్లో అది కాంట్రవర్షియల్ అని. కాని నిజం తెలియాలి కదా. అందుకే ధైర్యం చేశా. దానిమీద వచ్చే ఏ చర్చకైనా ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా. నిజానికి మన చరిత్రను కూలంకుషంగా చదివి.. నిశితంగా పరిశీలిస్తే.. ఈ నేలను ఏలిన ముస్లిం రాజులు తమ రాజ్య విస్తరణ కాంక్షనే బయటపెట్టుకున్నారు తప్ప సామాన్య ప్రజల విశ్వాసాలు, జీవన విధానాల జోలికి పోలేదు. పద్దెనిమిదో శతాబ్దంలో ఎందరో రాజులు పాలించారు. కాని టిపునే ఎందుకు వివాదాస్పదుడయ్యాడు? ఆ వివాదాల చారిత్రక నేపథ్యం ఏమిటి? మొదలైన అంశాల విశ్లేషణే నేను రాసిన ‘టిపు సుల్తాన్’. చిన్న మాట కాలం తెచ్చిన మార్పులను ఆహ్వానించాల్సిందే. అయితే విపరీతాలను నిలువరించాలంటే పాత టెక్నిక్స్‌ను ఉపయోగించాలి. ఆ పాత పద్ధతే పుస్తక పఠనం. ఇప్పుడు అవసరం. రీడింగ్ హాబీ సామాజిక స్పృహను కలిగిస్తుంది. భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం నేర్పిస్తుంది. ఇప్పుడు మన చదువులో సోషల్ సైన్సెస్ చోటు లేకుండా పోయింది కాబట్టి పుస్తక పఠనం కంపల్సరీ. అలాగే ఆడపిల్లలకు ఒక మాట. ధైర్యంగా ఉండాలి. సమస్యలుంటాయి. ఎదుర్కొనే స్థయిర్యాన్ని అలవర్చుకోవాలి. దీనికి చదువును మించిన ఆయుధం లేదు’’ అని చెప్తారు రైటర్, హిస్టారియన్ యార్లగడ్డ నిర్మల. – సరస్వతి రమ ఫొటో: మోహనాచారి ►నిర్మల అనేక కథలు, అనువాద కథలు రాశారు. ఇవన్నీ ప్రముఖ దినపత్రికలు, మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి. ప్రముఖ రచయిత డాక్టర్ విజయభారతితో కలిసి అంబేడ్కర్ పుస్తకానికీ పనిచేశారు నిర్మల. ఆమె రాసిన తాజా పుస్తకం ‘టిపు సుల్తాన్’ను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ. -
చరిత్రలో బోస్‌కు.. లాలాకు చోటివ్వండి
న్యూఢిల్లీ: చరిత్ర పుస్తకాల్లో ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధులందరికీ తగిన ప్రాధాన్యమిస్తూ చోటివ్వాలని చరిత్ర పుస్తకాలపై నిర్వహించిన ఓ వర్క్‌షాప్ డిమాండ్ చేసింది. ఇప్పటికే చరిత్ర పుస్తకాలల్లో జాతిపిత మహాత్మాగాంధీ, జవహార్ లాల్ నెహ్రూకు కావాల్సిన దానికన్నా ఎక్కువే చోటు ఉందని, ఇప్పుడైనా సుభాష్ చంద్రబోస్, లాలా లజపతి రాయ్‌వంటి ప్రముఖ స్వాతంత్ర్య పోరాటయోధులకు చోటివ్వాలని వారిని మరువకూడదని అభిప్రాయపడింది. ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో 'చరిత్ర పుస్తకాలపై సమీక్ష' అనే పేరిట ఐదు రోజుల వర్క్‌షాప్ జరిగింది. ప్రస్తుతం ఉన్న చరిత్ర పుస్తకాలు భావిభారత విద్యార్థులకు పరిశోధనల కోసం పెద్దగా ఉపయోగపడకపోవచ్చనే అభిప్రాయం ఇందులో పాల్గొన్నవారంతా వెలిబుచ్చారు. గాంధీ, నెహ్రూల గురించి ఆయా పుస్తకాల్లో కుప్పలుగా ఉందని అన్నారు. ఎప్పుడూ వారివే కాకుండా లాలా లజపతిరాయ్, గోపాల్ కృష్ణ గోఖలే, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్‌లాంటి వాళ్లు చాలా ముఖ్యమైనవారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) సభ్యుడు శరదిందు ముఖర్జీ అన్నారు. కాగా, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెలువరించేందుకు మాత్రం ఎన్సీఈఆర్టీ నిరాకరించింది. -
డిగ్రీ ‘చరిత్ర’లో మార్పులకు కమిటీ
దక్కన్ చరిత్ర, తెలంగాణ ఉద్యమంపై పాఠాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో డిగ్రీ స్థాయిలో ఉన్న చరిత్ర పుస్తకాల సిలబస్‌లో మార్పులు తెచ్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నిఫుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. డిగ్రీ చరిత్ర పాఠ్యాంశాల్లో మార్పులపై బుధవారం జరిగిన సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం, వివిధ వర్సిటీల చరిత్ర విభాగాల అధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిలబస్ మార్పుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ చైర్మన్‌గా కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా ఉస్మానియా, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్లు మనోహర్‌రావు, అర్జున్‌రావు, సుదర్శన్, వరలక్ష్మి, సదానందం, 8 మంది డిగ్రీ లెక్చరర్లు ఉంటారు. ఇవీ మార్పులు: దక్కన్ చరిత్రకు మార్పుల్లో పెద్ద పీట వేస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం, ప్రస్థానంపై పాఠ్యాంశాలు ఉంటాయి. అంతేకాక హుస్సేన్‌సాగర్, రామప్ప, లక్నవరం వంటి చెరువులు, వాటిని తవ్వించిన రాజులు, అప్పటి పాలన విధానం, వారి ప్రాధాన్యాలపై పాఠ్యాంశాలు ఉంటాయి. వాటితోపాటు కాకతీయులు, సమక్క-సారలమ్మ, నాటి పరిస్థితులపై పాఠాలుంటాయి.చాకలి ఐలమ్మ, కొమురం భీం వంటి తెలంగాణ యోధులు, 1969 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ఉద్యమం, అందులో వివిధ రంగాల పాత్ర, తెలంగాణ భాష, సంస్కృతిపై పాఠ్యాంశాలను పొందుపరచనున్నారు.