ఓ మాంచి లంచ్‌బాక్స్
బ్రేక్ బెల్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాపం పిల్లలు రోజూ బండెడు పుస్తకాలు, తరగని సిలబస్‌తో కుస్తీ పడుతుంటారు. దానికి అవసరమైన ఎనర్జీ అందించాలంటే వారికి మంచి పోషకవిలువలున్న భోజనం అవసరం. అందుకు మంచి లంచ్‌బాక్స్ కావాలి మరి!
లంచ్‌బాక్స్ ఎలా ఉండాలి..? ఆహారం తాజాగా ఉండాలి... ఉదయం ఎప్పుడో బాక్స్‌లో పెట్టిన ఫుడ్ పిల్లలు తినేవరకు పాడవకుండా ఫ్రెష్‌గా ఉంటుందో లేదో తల్లిదండ్రులు తెలుసుకోవాలి. అలాంటి మెటీరియల్‌తో తయారైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. సాధారణంగా పిల్లలు వాళ్లకు నచ్చిన కార్టూన్ బొమ్మలు ఉన్నాయనో, రంగు నచ్చిందనో కొనమని అడుగుతారు. కానీ పేరెంట్స్ మాత్రం కొనుగోలు చేసే ముందు అందులో నాణ్యతను దృష్టిలో పెట్టుకోవాలి. లంచ్‌బాక్స్‌లోని ప్రతి భాగం శుభ్రపర్చేందుకు వీలుగా ఉందో లేదో చెక్‌చేసుకోవాలి. లేదంటే అందులో బ్యాక్టీరియా చేరి అనారోగ్యానికి దారితీసే ప్రమాదం ఉంది.
ఎన్ని విభాగాలుగా ఉంది..? కేవలం ఒక డబ్బా మాదిరి కాకుండా బాక్స్ లోపల పలు రకాలుగా విభజించి ఉంటే వీలైనన్ని ఐటమ్‌లను పిల్లలకు అందించడానికి అవకాశం ఉంటుంది. భోజనంతో పాటు సలాడ్స్, పండ్లు లాంటివి లంచ్‌బాక్స్‌లో పెట్టడానికి వీలున్న వాటిని ఎంపిక చేసుకోవాలి. సైజ్..? మరీ పెద్దదిగాను, మరీ చిన్నదిగానూ కాకుండా మీడియం సైజ్ ఉన్నవి అయితే పిల్లలు తీసుకెళ్లడానికి అనువుగా ఉంటాయి. వారి స్కూల్ బ్యాగ్‌లో కూడా ఎక్కువ స్పేస్ ఆక్రమించకుండా ఉంటుంది.
ప్లాస్టిక్ బాక్స్‌లు వద్దు.. వేడి వస్తువులను ప్లాస్టిక్ బాక్స్‌లలో పెడితే ఆ వేడికి అందులోని రసాయనాలు ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. ఇది క్యాన్సర్‌కు దారి తీస్తుందని ఇటీవలి తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఇతర ఆరోగ్య కారణాల రీత్యా కూడా ప్లాస్టిక్ బాక్స్‌ల వాడకం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
వీటిని ట్రై చేద్దామా?
కూల్ బాక్స్‌లు.. పెట్టిన ఆహార పదార్థాలను ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంచడం వీటి ప్రత్యేకత. దానికి మీరు చేయాల్సిందిల్లా వీటిని ముందు రోజు రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆతర్వాత ఇందులో ఫుడ్‌ను ఉంచితే ఎప్పుడు తిన్నా సువాసనలు కూడా పోకుండా అప్పుడే వండిన పదార్థాలంత ఫ్రెష్‌గా ఉంటాయట.
ఫ్యాషన్ బాక్స్‌లు.. చూసేందుకు ఫ్యాషన్ బ్యాగ్‌లాగా కనిపించే లంచ్ బాక్స్‌లు ఇప్పుడు కొత్తగా మార్కెట్లో సందడి చేస్తున్నాయి. స్కూల్ పిల్లలతో పాటు కాలేజీ యువతను కూడా ఇవి ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. వీటిలో ఆహారం తాజాగా ఉండటమే కాకుండా, వీటిని శుభ్రం చేయడం కూడా తేలిక. మంచి ఆకర్షణీయ రంగుల్లో లభిస్తున్న వీటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది.
యుమ్‌బాక్స్ పానినో.. దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఒక సంస్థ ఉత్పత్తి చేస్తోంది. గత ఏడాది కాలంగా ఆన్‌లైన్‌లో దీని విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ బాక్స్ మొత్తం ఆరు భాగాలుగా విభజించి ఉంటుంది. వాటిలో ఒక భాగం కొంచెం పెద్దదిగా ఉండి, మిగిలిన ఐదు విభాగాలు చిన్నగా ఉంటాయి. చాలా తక్కువ బరువుండటంతో పాటు ఒక ఐటమ్‌తో మరో ఐటమ్ కలిసిపోకుండా ఉండేలా ఇందులో ప్రత్యేక ఏర్పాటు ఉంది.
గో గ్రీన్ లంచ్‌బాక్స్.. ఇందులో ఎక్కువ ఆహార పదార్థాలు పట్టే ఖాళీ ఉండటం వల్ల పెద్ద తరగతులు, కాలేజీ విద్యార్థులకు సైతం ఉపయోగకరంగా ఉంటుంది. చిన్నారులు సులువుగా ఓపెన్ చేసుకోవడంతో పాటు లీకేజ్ సమస్య లేకుండా దీన్ని రూపొందించారు. ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న వెరైటీ లంచ్‌బాక్స్‌లలో ఇదీ ఒకటి. - కర్రి వాసుదేవరెడ్డి