సెలబస్ : ఇంగ్లిష్ మీడియమ్ ఇల్లు
ఆవకాయా, గోంగూర, ముద్దపప్పూ, పూతరేకూ... గొబ్బిళ్లూ, ఉగాది పచ్చడీ... అట్లతద్దీ, అచ్చతెనుగూ... ఇవన్నీ మన ఆస్తులు. కేవలం మన తెలుగువారి ఆస్తిపాస్తులు. ఇవి మన సంస్కృతి, సంప్రదాయం. ఇంకా మన ఆచార వ్యవహారాలతో పాటూ పెనవేసుకుపోయిన సంపదలు. ఇవి క్రమంగా మన కంటికీ, ఇంటికీ... తెలుగు మనిషికీ, మనసుకీ దూరమైపోతుంటే పెల్లుబికిన వేదనలోంచీ, ఆత్మ సంవేదనలోంచీ పుట్టుకొచ్చిన కవిత ఇది. ఖండాంతరాలు దాటిపోయినా ఖండచాపుతాళం గతి మారనట్లే... తెలుగునాట, తమిళనాట... ఏ నాటనున్నా నాటరాగం ఆరోహణావరోహణలు మారనట్లే... మన తెలుగుతనమూ మారదు. మారకూడదు సుమ్మీ! ఏమంటారు?
తెలుగు సినీ గీత రచయితల్లో వనమాలిది ఓ ప్రత్యేకస్థానం. అయితే ఆయనలో గీత రచయితే కాదు... ఓ కవి కూడా ఉన్నారన్న విషయం చాలామందికి తెలియదు. వనమాలి కలం కొమ్మకి పూసిన కవితాసుమాల్లో ఇది ఒకటి...
అక్షరాభ్యాసం రోజే
ఓం నమః శివాయః ఓ మూలకి ఒదిగిపోతాయి!
ఉదయాన్నే పాకెట్ పాల పొదుగుల్ని
పిండుకునే ముంగిట్లో
సుప్రభాత గీతమేదీ వినిపించదు
ముత్యమంత ముగ్గయినా కనిపించదు
హుందాగా ఇంగ్లిష్ పేపర్ని తిరగేసే చేతులు
తెలుగు నాలికతో వార్తలు వల్లెవేస్తుంటాయి
గుక్కపట్టి ఏడ్చే పాపాయిని జోకొట్టడానికి
ఆ ఇంట్లో జో అచ్చుతానందలుండవు
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్లే
అక్కడ జోలపాటలవుతాయి!
పురిటిలోనే కేర్‌మనే పాపాయికి
డబ్బాపాలే ‘కేర్’ఆఫ్ అడ్రసవుతాయి
నాజూకు తల్లి హయాంలో
సిరులొలికే పసికందుకు సెరిలాకులే గోరుముద్దలౌతాయి!
బువ్వ తినే బుజ్జాయికి
నిత్యం టీవీతెరలే అమ్మ చూపే నిండుచందమామలు!
అక్కడ పిల్లలకీ, కుక్కపిల్లలకీ
ఒకే రకం ముద్దుపేర్లు!
ఇంటిపేరు అవధానులయినా
ఇప్పుడు మాత్రం అవసానదశే!
తలకట్టు విరిగిన అక్షరాలు
తలకిందులైన ‘తెల్గూ’ వాక్యాలు అక్కడ ఫ్యాషన్!
జీన్సూ, టీ షర్టుల్లో
ఎదిగిన కూతుర్ని చూసుకుని
మిడిసిపడే ‘మిడిమిడి’ల్ క్లాసులు
ఓణీల్నీ పరికీణీల్నీ ఓరకంటయినా చూడవు!
అక్కడ వాలుజడ ఒయ్యారాలు పోదు
నలనల్లని కాటుక కనుదోయి చేదు!
‘నిధి చాల సుఖమ’నే ఆ లోగిలి
త్యాగయ్య సన్నిధిని కోరదు
అదివో... అల్లదివో... అక్కడెక్కడో తిరిగే అన్నమయ్యని
ఆ గడపలోకి రానివ్వదు
అది అక్షరాలా తెలుగువారిల్లు
స్వాతంత్య్రం వచ్చినా అదింకా ‘తెల్ల’వారిల్లు!