గురుకుల టీచర్ల పోస్టులకు ప్రకటించిన సిలబస్‌నే పాఠశాలల్లో త్వరలో భర్తీ చేయనున్న టీచర్ పోస్టులకూ వర్తింపజేసే అవకాశం కనిపిస్తోంది.
- ‘గురుకుల’ పోస్టుల సిలబస్‌నే వర్తింపజేసే అవకాశం
- రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన అధికారుల కమిటీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ల పోస్టులకు ప్రకటించిన సిలబస్‌నే పాఠశాలల్లో త్వరలో భర్తీ చేయనున్న టీచర్ పోస్టులకూ వర్తింపజేసే అవకాశం కనిపిస్తోంది. గురుకులాల్లోని పోస్టులతో పాఠశాలల్లో ఉన్న సమాన స్థాయి పోస్టులకు గురుకుల పోస్టులకు పేర్కొన్న సిలబస్‌నే వర్తింపజేయడం మంచిదని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యా శాఖ అధికారుల కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను కూడా అందజేసినట్లు సమా చారం. ఉదాహరణకు గురుకులాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ) పోస్టుల తో పాఠశాలల్లో సమాన పోస్టు స్కూల్ అసిస్టెంట్. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టీజీటీలకు పేర్కొన్న సిలబస్‌నే అమలు చేసే అవకాశం ఉంది.
సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కూడా దాదాపు అదే స్థాయిలో ఉండే పీఈటీ వంటి పోస్టులకు పేర్కొన్న సిలబస్‌ను వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వీటికితోడు టెట్ వెయిటేజీ యథాతథంగా అమలు చేయనున్నారు. గత ఏడాది ఇంగ్లిష్ మీడియంను ఒకటో తరగతిలో ప్రారంభించిన ప్రభుత్వం ఈసారి రెండో తరగతిలో ఇంగ్లిష్ మీడియంను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు కూడా 150 మార్కులు ఉంటే ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్‌తోపాటు బేసిక్ ప్రొఫిషియెన్సీ ఇన్ ఇంగ్లిష్‌లో 50 మార్కులకు ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది.
పేపర్లవారీ విధానాన్ని టీఎస్‌పీఎస్సీ ఖరారు చేయనుంది. టీఎస్‌పీఎస్సీ గురుకులాల తరహాలో పరీక్షా విధానం ఖరారు చేసినా, మరేవిధంగా చేసినా, క్లాస్ రూమ్ డెమో ఉండాలని విద్యాశాఖ అధికారుల కమిటీ తమ నివేదికలో సిఫారసు చేసిన ట్లు తెలిసింది. క్లాస్ రూమ్ డెమో నిర్వహణ సాధ్యం కాదనే గురుకుల పోస్టుల్లో పెట్టలేదు. ప్రభుత్వ పాఠశాలల టీచర్ పోస్టుల భర్తీ క్రమంలో క్లాస్ రూమ్ డెమో నిర్వహణ సాధ్యమా? అన్నది టీఎస్‌పీఎస్సీ, ప్రభుత్వం తేల్చాల్సి ఉంది.