ఏపీలోనే ఏఎన్‌ఎంలు ఎక్కువ | ANMs are more in AP itself | Sakshi
Sakshi News home page

ఏపీలోనే ఏఎన్‌ఎంలు ఎక్కువ

Published Mon, Jun 12 2023 3:35 AM | Last Updated on Mon, Jun 12 2023 3:35 AM

ANMs are more in AP itself - Sakshi

రోగులకు వైద్యసేవల కల్పన, వారి సంరక్షణలో కీలకపాత్ర పోషించే నర్సుల అందుబాటు విషయంలో  ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అగ్రభాగాన ఉంది. క్షేత్రస్థాయిలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ముఖ్యపాత్ర పోషించే ఏఎన్‌ఎంలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కూడా మనదే కావడం గమనార్హం.

నర్సులు, ఏఎన్‌ఎం, జీఎన్‌ఎంల సంఖ్యలో సంబంధిత విద్యలో ఏపీ  ముందంజలో ఉందని ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ (ఐఎన్‌సీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి 2021–22 వార్షిక నివేదికను ఐఎన్‌సీ విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. నర్సులు, జీఎన్‌ఎం, ఏఎన్‌ఎంల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలు ముందున్నాయి.   – సాక్షి, అమరావతి 

ఏపీలో 1.39 లక్షల మంది ఏఎన్‌ఎంలు..
దేశవ్యాప్తంగా రిజిస్టర్డ్‌ ఏఎన్‌ఎంలు 9.82 లక్షల మంది ఉన్నారు. అయితే, ఏపీలోనే అత్యధికంగా 1.39 లక్షల మంది ఉన్నారు. రాజస్థాన్‌లో 1.10 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 75వేల మంది ఉన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కేవలం 10,219 మందితో 19వ స్థానంలో ఉంది. అయితే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా గ్రామ, వార్డు సచివాలయాలను నెలకొల్పి సచివాలయానికొక ఏఎన్‌ఎంను నియమించిన విషయం తెలిసిందే.

రిజిస్టర్డ్‌ నర్సులు దేశవ్యాప్తంగా 24.71 లక్షల మంది ఉన్నారు. తమిళనాడులో అత్యధికంగా 3.32 లక్షల మంది ఉండగా, కేరళలో 3.15 లక్షల మంది, మూడోస్థానంలో ఉన్న ఏపీలో 2.62 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ 53,314 మందితో 14వ స్థానంలో ఉంది. 

 కొత్త కోర్సులు.. సెమిస్టర్‌ విధానం
నర్సింగ్‌ విద్యలో కౌన్సిల్‌ అనేక మార్పులు చేసింది. వైద్య రంగంలో వస్తున్న ఆధునిక మార్పుల నేపథ్యంలో సిలబస్‌లో సవరణలు చేసింది. బీఎస్సీ నర్సింగ్‌ విద్యలో ఇప్పుడు సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరమే ఇది అమల్లోకి వచ్చింది. మరోవైపు.. డాక్టర్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ప్రోగ్రాంను, ఈ–లెర్నింగ్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. ఫౌండేషన్, కోర్, ఎలక్టివ్‌ కోర్సులు ప్రారంభించింది. గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో పేషెంట్‌ సెంటర్డ్‌ కేర్‌ను తీసుకొచ్చింది. ఇందులో రోగి వ్యక్తిగత ప్రాధాన్యతలు, అవసరాలను గుర్తించి సంపూర్ణమైన సేవలు అందించాల్సి ఉంటుంది.

నర్సింగ్‌ కౌన్సిల్‌ కొన్ని సూచనలు కూడా చేసింది. అవి.. 
హెల్త్‌కేర్‌ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. 
♦ రోగి విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. 
 వ్యక్తిగత పనితీరుతో రోగికి ఎలాంటి ప్రమాదం కలిగించకుండా వ్యవహరించాలి. 
స్కిల్‌ ల్యాబ్, క్లినికల్‌ లెర్నింగ్‌  పద్ధతులపై దృష్టి సారించాలి. 

నర్సింగ్‌ విద్యలోనూ టాప్‌–5లో..
ఇక నర్సింగ్‌ విద్యలోను ఏపీ దేశంలోని టాప్‌–5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. 2022 మార్చి నాటికి ప్రభుత్వ, ప్రైవేట్‌ నర్సింగ్‌ కాలేజీల్లో బీఎస్సీ నర్సింగ్‌ సీట్లకు సంబంధించి కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 19,860 సీట్లు ఉండగా, తమిళనాడులో 12వేలు, మధ్య­ప్రదేశ్‌లో 9వేలు, రాజస్థాన్‌లో 8,165 ఉన్నాయి.

ఏపీ 8,030 సీట్లతో ఐదో స్థానంలో ఉంది. తెలంగాణ 4,980 సీట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక ఏఎన్‌ఎం విద్యకు సంబంధించి 910 సీట్లతో ఏపీ దేశంలో 12వ స్థానంలో, 455 సీట్లతో తెలంగాణ 17వ స్థానంలో ఉంది. మరోవైపు.. జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ) సీట్లు తెలంగాణలో 3,962 ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 7,125 ఉన్నాయి. ఇవి దేశంలోనే అత్యధికంగా కర్ణాటకలో 24,731 సీట్లున్నాయి.

ఇక ఏఎన్‌ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 31 ఉండగా, తెలంగాణలో 16 మాత్రమే ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 545 స్కూళ్లు ఉన్నాయి. ఈ విషయంలో తెలంగాణ 18వ స్థానంలో ఉంది. జీఎన్‌ఎం స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో 163 ఉండగా, తెలంగాణలో 88 ఉన్నాయి. కర్ణాటకలో ఇవి అత్యధికంగా 520 ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement