సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో గందరగోళంపై సోమవారం (29న) ఇంటర్‌బోర్డు ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ ప్రకటించాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఇతర రాజకీయపార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వర్గాలవారు కలసి రావాలని పిలుపునిచ్చాయి. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, వారికి తాము అండగా ఉంటామని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశాయి. శనివారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో భేటీ అనంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.
23 మంది మరణం హృదయవిదారకం
ఇంటర్ బోర్డు తప్పులకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం హృదయ విదారకరమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఎదిగిన పిల్లలు రాలిపోయి, ఎద నిండా ఆవేదనతో తల్లిదండ్రులున్నారని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మొత్తం మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఒక కంపెనీ ప్రయోజనాల పరిరక్షణకే ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ సంస్థ మొదటి నుంచి తప్పులు చేస్తున్నా వెనకేసుకు వచ్చారని విమర్శించారు. తప్పులపై కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మొదటి నుంచి హెచ్చరిస్తున్నా బోర్డు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇంటర్ కార్యదర్శికి సమస్యలన్నీ తెలుసని, విద్యార్థులు ఫెయిలైతే డ్రైవర్లు కావచ్చని, దుకాణాల్లో పని చేసుకోవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కూడా ఉచితంగా విద్యార్థులకు వాల్యూయేషన్ చేస్తామన్నారే తప్ప ఈ సమస్యపై సమగ్ర సమీక్ష నిర్వహించలేదన్నారు. తమకు ఎమ్మెల్యేల సంఖ్య లేకపోయినా సమాజం పట్ల నిబద్ధత ఉందని, ఏదిఏమైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామన్నారు.
నిద్ర నటించే సర్కార్‌ను తట్టి లేపేందుకే
ఈ వ్యవహారంపై నిద్ర నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు ధర్నా నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిఫారసుతోనే పరీక్షల నిర్వహణలో అనుభవంలేని గ్లోబరీనా సంస్థకు టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ఈ సంస్థకు పరీక్షా ఫలితాల బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. ప్రతి అంశంపై ట్విట్టర్‌లో స్పందించే కేటీఆర్ ఇంటర్ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిం చారు. విద్యార్థులు రోడ్డున పడితే టీఆర్‌ఎస్ మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ ఫ్యూడల్ మైండ్‌సెట్‌తో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
కేబినెట్ బాధ్యత వహించాలి: రమణ
ఇంటర్ బోర్డు తప్పులకు సీఎం కేసీఆర్, కేబినెట్ బాధ్యత వహించాలని, మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై విపక్షపార్టీలుగా గవర్నర్‌ను కలిస్తే నామమాత్రంగా స్పందించారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేటీఆర్ మాత్రం ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ నిర్బంధాన్ని ఛేదిస్తాం: చాడ
సీఎం కేసీఆర్ ప్రయోగించే నిర్బంధాన్ని, పోలీస్ వ్యవస్థను ఛేదించి 29న ధర్నా నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. తొంభై మార్కులు వచ్చిన అమ్మాయికి ఇంటర్‌బోర్డు సున్నా మార్కులు వేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి... ఇలాగే జరుగుతాయి అని చెప్తారా? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటామని, జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు.
విద్యార్థులారా... ఆత్మహత్యలకు పాల్పడవద్దు
Published Sun, Apr 28 2019 1:28 AM | Last Updated on Sun, Apr 28 2019 1:28 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment