
మత్రుల నివాసాల ముందు ధర్నా చేస్తున్న దృశ్యం
బంజారాహిల్స్: వేలాదిమంది ఇంటర్ విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిన ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను వెంటనే తొలగించాలని, ఇంటర్మీడియట్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం మంత్రుల నివాసాలను ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ.. బోర్డులో ఉన్నతాధికారులకు సంబంధం ఉందని భావిస్తున్న ఎలాంటి పూర్వ అనుభవం లేని ఓ ప్రైవేట్ సంస్థకు ఫలితాల ప్రక్రియ కాంట్రాక్టు అప్పగించడం వెనక పలు అనుమానాలు ఉన్నాయన్నారు. కాంట్రాక్ట్ అప్పగించడంలో భాగం పంచుకున్న బడా నాయకులపై కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.
బోర్డు చేసిన తప్పిదానికి విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటే కార్యదర్శి మాత్రం తమ తప్పు ఏమీలేదన్నట్లు వ్యవహరిస్తున్నారని, బోర్డు కార్యదర్శితో పాటు ఈ ఘటనకు బాధ్యులైన అందర్నీ శిక్షించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచితంగా పేపర్ రివాల్యూవేషన్ చేసి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ముట్టడిలో ఏబీవీపీ గ్రేటర్ కార్యదర్శి శ్రీహరి, జాతీయ నాయకులు అయ్యప్ప, ప్రవీణ్‌రెడ్డి, ఎల్లాస్వామి, శ్రావణ్‌రెడ్డి, రమేష్, ఆనంద్, సురేష్, జీవన్, సుమన్, రాజేష్, శ్రీశైలం, బీరప్ప, మహేష్, శ్రీకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మంత్రుల నివాసాల ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోనికి చొచ్చుకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువరి మధ్యా వాగ్వాదంతో ఆ ప్రాంతం హోరెత్తింది. బంజారాహిల్స్ పోలీసులు విద్యార్థి నేతలను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో..
ఇంటర్ బోర్డు నిర్వాకాన్ని ఎత్తిచూపుతూ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాసాలను ముట్టడించారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్.కళింగరావు నేతృత్వంలో ఎస్సైలు బత్తు శ్రీను, కె.ఉదయ్, పి.డి. నాయుడు ఇక్కడ బందోబస్తు నిర్వహించారు.