
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇంటర్ బోర్డు వైఫల్యంతో నష్టపోయిన విద్యార్థులకు, ఆత్మహత్యలకు పాల్పడిన 27 మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోయినా కనీసం స్పందించని మంత్రి జగదీశ్‌రెడ్డివే చిల్లర రాజకీయాలని తీవ్రంగా విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థులకు న్యాయం చేయడంతోపాటు తప్పులకు కారణమైన గ్లోబరీనా సంస్థను తొలగించడం, ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్‌ను, మంత్రి జగదీశ్‌రెడ్డిని తప్పించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం వెనకేసుకొస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికీ 1000కి పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంత తీవ్ర సమస్యలు ఉంటే, రాజు మాత్రం తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లారని సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న లాస్య ఇంటికి మంత్రి తలసాని ఇల్లు కూతవేటు దూరమే అయినా ఆయన కనీసం పరామర్శకు కూడా వెళ్లలేకపోవడం శోచనీయమన్నారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ నివేదిక ప్రకారం వెనుకబడిన రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణ చాలా వెనుకబడి ఉందన్నారు.
టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం బీజేపీనే అని లక్ష్మణ్ పేర్కొన్నారు. మే 23 తర్వాత రాష్ట్రంలో రెండు పార్టీల విధానం వస్తుందన్నారు. కేంద్రంలో ఎవరి మద్దతు లేకుండా ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఉగ్రవాదం, నక్సలిజం, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని పేర్కొన్నారు. రక్షణ రంగానికి పెద్ద పీట వేశారని, మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించిగలిగిందన్నారు. కేంద్రంలో హంగ్ వస్తుందని, అందులోకి వెళ్లాలని కేసీఆర్ పగటి కలలుకంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు తాను ఓడిపోతానని తెలిసి ఏవేవో మాట్లాడుతున్నారని ఆయనో చచ్చిన పాముతో సమానమన్నారు. విద్యార్థుల మరణాలపై కేంద్ర హోంమంత్రి, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. దీనిపై జ్యుడీషియల్ విచారణ లేదా సీబీఐ విచారణ కోరుతామన్నారు. వర్సిటీల్లో సిబ్బంది లేకుండా, 60 శాతం ఖాళీలతో న్యాక్ గుర్తింపు ఎలా వస్తుందని, నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment