
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. కరోనా కారణంగా సెలవులు పొడిగించడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఇంటర్ బోర్డు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏప్రిల్‌లో జరిగే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించవచ్చని గతంలో పేర్కొంది.
తాజాగా ఈ గడువును ఫిబ్రవరి 4వ తేదీ వరకు పొడిగించారు. ప్రథమ సంవత్సరం ఆర్ట్స్, అండ్ సైన్స్ గ్రూపులకు, ద్వితీయ సంవత్సరం ఆర్ట్స్ గ్రూపులకు రూ.490, ద్వితీయ సంవత్సరం సైన్స్ గ్రూపులకు రూ.690 ఫీజును నిర్ణయించారు. ఒకేషనల్ కోర్సులకు ఫస్టియర్‌కు రూ.690, సెకండియర్‌కు రూ.840 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.