సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డులో పాలనాపరమైన సంస్కరణలు మొదలయ్యాయి. గత కొన్నేళ్ళుగా ఇంటర్ బోర్డు కార్యదర్శి చేతుల్లో ఉన్న అధికారాలను వికేంద్రీకరించారు. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషనర్ నవీన్ మిత్తల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ఏ పనికైనా ఇప్పటి వరకూ హైదరాబాద్ బోర్డ్‌కు రావాల్సిన పరిస్థితి ఉండేది.
ఇక నుంచి జిల్లా పరిధిలోనే అవసరమైన పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా మల్టీజోన్–1, మల్టీజోన్– 2కు ప్రాంతీయ కార్యాలయాలున్నాయి. కాలేజీ ప్రిన్సిపల్స్ అన్ని రకాల సెలవులు ఇక నుంచి మల్టీజోన్ ఆర్‌జేడీ పరిధిలోనే పరిష్కరించుకోవచ్చు. సర్వీసు క్రమబ ద్ధీకరణ, సీనియారిటీ జాబితాలను మల్టీ జోన్ పరిధిలోకే తెచ్చారు. ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత పొందే ప్రయోజనాలకు సంబంధించిన దస్త్రాలు కూడా ఈ పరిధిలోకే చేర్చారు. అలాగే ప్రిన్సిపల్స్, జిల్లా ఒకేషనల్ ఆఫీసర్స్, ఇతర జిల్లా అధికారులకు తమ పరిధిలో అవసరమైన అధికారాలు బదలాయించారు. ఉద్యోగుల సర్వీసులకు సంబంధించి నిర్ణయాధి కారాన్ని ఇచ్చారు.
బయో మెట్రిక్ – ఈ ఆఫీస్
ఉద్యోగులు వేళకు రావడం లేదని, వచ్చినా ఫైళ్ళను చూడటం లేదనీ, కేవలం వ్యక్తిగత ప్రయోజనం ఉండే ఫైళ్ళనే ముట్టుకుంటున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులు అందేవి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డ్‌లో ఉద్యోగుల పారదర్శకతను పెంచుతూ అన్ని స్థాయిల్లోనూ బయోమెట్రిక్‌ను అమలు చేస్తున్నట్టు నవీన్ మిత్తల్ తెలిపారు. బయోమెట్రిక్ వల్ల జవాబుదారీతనం పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇక ఇంటర్ బోర్డులో అనుమతులు, ఉద్యోగులకు సంబంధించిన ఫైళ్ళు నెలల తరబడి పరిశీలనకు నోచుకోవడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ–ఫైలింగ్ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ఫైలింగ్ ద్వారా వ్యక్తులతో సంబంధం లేకుండానే ఆన్లైన్ ద్వారా ఫైళ్ళు వెళ్ళడం, పరిశీలన, అనుమ తులు ఇవ్వడం సాధ్యమని అధికారులు చెబుతున్నారు. ఇంటర్ విద్య కమిషనర్ సంస్కరణలను తెలంగాణ విద్య పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ మాచర్ల రామకృష్ణగౌడ్ స్వాగతించారు. అవినీతి పరుల ఆటకట్టేందుకు ఈ సంస్కరణలు దోహదపడతాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment