ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం  | All prepared for inter exams | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం 

Published Wed, Feb 21 2024 5:54 AM | Last Updated on Wed, Feb 21 2024 5:54 AM

All prepared for inter exams - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 1 నుంచి 20 వరకు నిర్వహించనున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలకు ఇంటర్‌ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ పరీక్షల హాల్‌టికెట్లను బుధవారం నుంచి జారీ చేయనుంది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పరీక్షలు జరిగే గదుల్లో అధికారులు సీసీ కెమెరాలను అమర్చారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి హాజరును ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోనున్నారు.

పరీక్ష పేపర్లకు క్యూఆర్‌ కోడ్‌ను జోడించారు. పేపర్‌ను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్‌ చేసినా వెంటనే తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రం ప్రాంగణంలోకి ఫోన్లను అనుమతించరు. పేపర్లను భద్రపరిచే పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఈసారి ఇంటర్‌ బోర్డు అందించే ప్రత్యేకమైన బేసిక్‌ ఫోన్‌ను మాత్రమే వినియోగించనున్నారు.

ఇది కేవలం బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే మెసేజ్‌లను చూసేందుకే ఉపయోగపడుతుంది. తిరిగి సమాచారం ఇచ్చేందుకు, ఫోన్‌ చేసేందుకు సాధ్యపడదు. పైగా ఈ ఫోన్‌ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది.

ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు
ఈసారి ఇంటర్‌ బోర్డు పబ్లిక్‌ పరీక్షలకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ ఏడాది  ఫీజు చెల్లింపు నుంచి ప్రాక్టికల్స్‌ మార్కుల నమోదు వరకు అన్ని అంశాలను ఆన్‌లైన్‌లోకి మార్చింది. దీంతో విద్యార్థులు,  కళాశాలల యాజమాన్యాలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి.  ప్రాక్టికల్స్‌ పూర్తయిన వెంటనే మార్కులను  ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇందుకోసం  ఇంటర్‌ బోర్డు ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్‌ రెండుసార్లు ఆన్‌లైన్‌లో మార్కులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంది. ఈ నెల 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్స్‌ పరీక్షలు మంగళవారం ముగిశాయి. దీంతో అధికారులు రాత పరీక్షలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం విజయవాడలోని రెండు  సెంటర్లలో హాల్‌టికెట్ల జారీ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు.

2022–23 విద్యా సంవత్సరంలో  ఇంటర్‌ రెండేళ్లు కలిపి 8,13,033 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది మొత్తం 10,52,221 మంది పరీక్ష ఫీజు చెల్లించారు. ఇందులో మొదటి  సంవత్సరం 4,73,058 మంది, రెండో  సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement