సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సమర్థంగా నిర్వహించారు. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన పరీక్షల్లో కేవలం 75 మాల్‌ప్రాక్టీస్ కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఇంటర్ బోర్డు చరిత్రలో ఇంత తక్కువ నమోదవ్వడం ఇదే తొలిసారి. 2023–24కు రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి మొదటి సంవత్సరం 5,17,617 మంది, రెండో సంవత్సరం 5,35,056 మంది.. మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు.
వీరిలో పరీక్షలకు 9,99,698 మంది హాజరు కాగా, 52,900 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 75 మందిపై మాల్‌ప్రాక్టీస్ కింద కేసులు నమోదు చేశారు. కాగా ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు ఏప్రిల్ 4 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత రెండో వారంలో ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నారు.
ఆన్‌లైన్ విధానంతో తొలగిపోయిన ఇబ్బందులు..
ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియెట్ కమిషనరేట్ అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఫీజు చెల్లింపు, నామినల్ రోల్స్ నమోదు నుంచి పరీక్ష కేంద్రాల వరకు అన్ని దశల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. విద్యార్థులకు తలెత్తే సమస్యల పరిష్కారానికి ఆయా కళాశాలల్లోనే చర్యలు తీసుకుంది.
గతంలో పరీక్ష ఫీజును చలాన్ రూపంలో చెల్లిస్తే, వాటిని పరిశీలించి మదింపు చేసేందుకు బోర్డుకు చాలా సమయం పట్టేది. ఈ ఏడాది ఆన్‌లైన్ విధానంతో గత ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. అలాగే ప్రాక్టికల్స్ పరీక్షలు పూర్తయిన వెంటనే అక్కడికక్కడే మార్కులను బోర్డు వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. మార్కుల విషయంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
ప్రధాన పరీక్షలు జరిగిన 1,559 సెంటర్లలో ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22 వేల కెమెరాలను వినియోగించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బోర్డు కార్యాలయం నుంచి పరీక్షల సరళిని పర్యవేక్షించేందుకు జిల్లాకో అధికారిని కమిషనర్ సౌరబ్ గౌర్ నియమించారు. కేంద్రాల నుంచి పరీక్ష పత్రాలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రశ్నపత్రాలకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్’ కోడ్‌ను
జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment