సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి మొదలయ్యే పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీ వరకూ కొనసాగనున్నాయి. మొత్తం 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి మొత్తం 9,47,699 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్ బోర్డ్ వెల్లడించింది. పరీక్షల ఏర్పాట్లపై బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సబితాఇంద్రారెడ్డి సోమవారం సమీక్షించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి మాట్లాడారు. పరీక్షల కోసం తీసుకున్న జాగ్రత్తలు, విద్యార్థులకు ఇచ్చే సూచనలను పరీక్షల విభాగం డైరెక్టర్ జయప్రదాభాయ్ మీడియాకు వివరించారు.
పకడ్బందీ ఏర్పాట్లు: మంత్రి సబిత
ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి సమస్య తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. జిల్లా స్థాయి కమిటీ చైర్మన్లుగా కలెక్టర్లు పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా చూడాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు తాగునీరు, ఓఆర్‌ఎస్ అందుబాటులో ఉంచాలని సూచించారు.
విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు. సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
తక్షణమే స్పందిస్తాం: నవీన్ మిత్తల్
’’ఇంటర్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకువస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉంటాం. అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక యంత్రాంగం పని చేస్తోంది. ఎలాంటి మానసిక ఒత్తిడి అన్పించినా విద్యార్థులు కౌన్సెలింగ్ తీసుకోవాలి.. మనోధైర్యం ప్రతీ విద్యార్థికి అవసరం’’అని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ అన్నారు.
గంట ముందే పరీక్ష హాలుకు...
♦ విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్షహాలులోకి అనుమతిస్తారు. 9 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. విద్యార్థులు హాల్ టికెట్లపై పేరు, మీడియం ఇతర వివరాలను ముందే సరిచూసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే ప్రిన్సిపాల్ చేత సరిచేయించుకోవాలి. హాల్‌టికెట్లను ్టటbజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం లేకున్నా అనుమతిస్తారు.
♦ ఏ విధమైన ప్రింటింగ్, చేతిరాత మెటీరియల్, సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్ష హాలులోకి అనుమతించరు.
♦ జిల్లా పరీక్షల కమిటీ(డీఈసీ)ని ప్రతీ జిల్లాలో నియమించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి, నోడల్ అధికారి, ఇద్దరు ప్రిన్సిపాళ్లు, జూనియర్ లెక్చరర్ ఇందులో ఉంటారు. వీరితోపాటు జిల్లాస్థాయి హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు.
♦ రెవెన్యూ, విద్య, పోలీసు శాఖల నుంచి ఒకరు చొప్పున 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. పరీక్షాకేంద్రాల్లో 200 సిట్టింగ్ స్క్వాడ్స్ ఉంటాయి.
♦ జిల్లా కో–ఆర్డినేషన్ కమిటీలో అన్ని శాఖల అధికారులుంటారు. వారు ఆర్టీసీ, హెల్త్, విద్యుత్ సేవలు అందిస్తారు. అన్ని ప్రాంతాల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. పరీక్షకేంద్రాలకు సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేస్తారు. ప్రతీ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment