సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్‌లో ఇంకా సాంకేతిక తప్పిదాలు ఆగట్లేదు. రోజుకో రకమైన సమస్యలు బయటకు వస్తూనే ఉన్నాయి. వార్షిక పరీక్షల ఫలితాల్లో సాంకేతిక తప్పిదాలతో విద్యార్థుల మార్కుల జాబితాల్లో అనేక తప్పులు ఇచ్చిన ఇంటర్ బోర్డు.. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లలోనూ సాఫ్ట్‌వేర్ సంస్థ పొరపాట్లు చేసింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఒకే సబ్జెక్టులో పరీక్ష రాసే ఒకే విద్యార్థికి రెండు వేర్వేరు నంబర్లతో హాల్‌టికెట్లు జనరేట్ చేసి పంపారు. దీంతో ఆ విద్యార్థి గందరగోళంలో పడ్డారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన న్యావనంది వినోద్ గతంలో కెమిస్ట్రీలో ఫెయిల్ అయ్యాడు. ప్రస్తుతం ఆ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈనెల 12న ఆ పరీక్ష ఉంది. అయితే ఆ విద్యార్థికి ఒకే సబ్జెక్టుకు రెండు హాల్‌టికెట్లు పంపించారు. 2 వేర్వేరు హాల్‌టికెట్ల నంబర్లతో వేర్వేరు పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 1936316671 నంబర్‌తో ఒక హాల్‌టికెట్, 1936316509 నంబర్‌తో మరో హాల్‌టికెట్ పంపించారు. దీంతో ఏ హాల్‌టికెట్‌తో ఎక్కడ పరీక్ష రాయాలో అర్థం కాని స్థితిలో ఆ విద్యార్థి ఉన్నాడు. మరికొంత మంది విద్యార్థుల హాల్‌టికెట్లలో ఫొటోలు లేకుండా, ఇంకొంత మంది విద్యార్థులు హాల్‌టికెట్లలో ఫొటో లు ఉండి వివరాలు లేకుండా వచ్చినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో బోర్డు హెల్ప్‌లైన్‌కు (040–24600110) ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదని, ఒక వేళ కలిసినా ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలకు అందని వొకేషనల్ మెటీరియల్
ఇంటర్మీడియట్ వొకేషనల్ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ గురువారం రాత్రి వరకు జిల్లాలకు అందలేదు. శుక్రవారం ఉదయం 7 గంట లకు చీఫ్ సూపరింటెండెంట్లు తమ సిబ్బంది ఒకరిని డీఐఈవో/ఆర్‌ఐవో కార్యాలయాల దగ్గరికి పంపించి వొకేషనల్ కోర్సుల పరీక్షలకు సంబంధించిన డీ–ఫారమ్స్ తీసుకెళ్లాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయితే బోర్డు ఆదేశాలు బాగానే ఉన్నా.. డీఐఈవో/ఆర్జేడీ కార్యాలయాలకు తమ కాలేజీల నుంచి వెళ్లాలంటే మూడు నాలుగు గంటలపాటు ప్రయాణం చేయాల్సినంత దూరంలో ఉన్న కాలేజీలు ఉన్నాయి. అలాంటి కాలేజీల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. మరోవైపు హాల్ టికెట్లలో తప్పులు దొర్లితే చీఫ్ సూపరిం టెండెంట్లు డీఐఈవోల దగ్గరకు వెళ్లి కరెక్షన్ చేయించుకోవాలని బోర్డు ఆదేశాలు జారీచేసింది. అయితే వాటిల్లో హాల్‌టికెట్లు కరెక్షన్ చేస్తారు కానీ మాన్యువల్ బార్ కోడ్ షీట్లు వాడాల్సి ఉంటుంది. సాధారణంగా జెనరేట్ అయిన హాల్‌టికెట్ ప్రకారమే ఓఎంఆర్ బార్‌కోడ్ షీట్లను ముద్రించి పంపిస్తారు. హాల్‌టికెట్లలో కరెక్షన్ చేసినా, ముందుగా జెనరేట్ చేసి పంపిన ఓఎంఆర్ బార్‌కోడ్ షీట్లలో మార్పు చేసే వీలుండదు. అప్పుడు మాన్యువల్ బార్‌కోడ్ షీట్లను వినియోగిస్తారు. దీంతో పేపర్ వ్యాల్యుయేషన్ సమయంలో సమస్యలు వస్తాయి.
డౌన్‌లోడ్ కాని జవాబు పత్రాలు
రీవెరిఫికేషన్ జవాబు పత్రాలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు, హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు బోర్డు వెబ్‌సైట్‌ను సంప్రదిస్తే అదీ పని చేయట్లేదు. వెబ్‌సైట్ ఓపెన్ కాకపోవడంతో వేల మంది విద్యార్థులు గురువారం తీవ్ర ఇబ్బందులు పడాల్సివచ్చింది. శుక్రవారం నుంచే పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరిస్థితుల్లో హాల్‌టికెట్లలో తప్పులు దొర్లడం, హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment