సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ అవకతవకల వ్యవహారంలో దోషులను శిక్షించే వరకు ఉద్యమం ఆపమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ స్పష్టం చేశారు. తాము రాజకీయాల కోసం ఈ ఉద్యమాన్ని చేయడం లేదని, ప్రజల మద్దతు ఉందని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పట్ల ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను గాలికి వదిలేసి, కుటుంబ సమేతంగా విహార యాత్రలకు వెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విహారయాత్రలకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వాటన్నింటిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని చేస్తున్న ఉద్యమాన్ని చులకన చేసి.. ఎగతాళి చేసే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, మంత్రి.. ఇంటర్ విద్యార్థుల్లో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేయడంలేదన్నారు. తెలంగాణ వచ్చాక కూడా బిడ్డలు బలవుతున్నారన్నారు. రేపు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తెప్పించుకొనే విధంగా కేంద్రాన్ని కోరుతామన్నారు. చనిపోయిన విద్యార్థుల జాబితాను కేంద్ర మంత్రికి ఇస్తామని తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అపాయింట్‌మెంట్ అడిగామని.. అపాయింట్‌మెంట్ ఇస్తే ఆయనను కలుస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment