సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల వివాదంలో ప్రతిపక్షాలు అపోహలు సృష్టిస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సున్నితమైన అంశంపై విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయంటూ మండిపడ్డారు. బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ఇంటర్ ఫలితాల వెల్లడిలో టెక్నికల్ సమస్య వచ్చింది నిజమేనని అంగీకరించారు. ఇంటర్ బోర్డులో కొంతమంది అధికారుల మధ్య విభేదాల కారణంగానే గందరగోళం జరిగినట్లు తెలుస్తోందన్నారు. అయితే ఇందుకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. ఇంటర్ బోర్డు వ్యవహారం గురించి సీఎం కేసీఆర్ అధికారులతో మాట్లాడుతున్నారని.. బాధ్యులపై త్వరలోనే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పోషించినవే..
‘ గ్లోబరీనా, మాగ్నెటిక్ సంస్థలు కాంగ్రెస్ ప్రభుత్వం పోషించినవే. ఇంటర్ బోర్డు వ్యవహారంలో ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదు. రూ. 4 కోట్ల టెండర్‌ను వేల కోట్లు అని రేవంత్ ఎలా మాట్లాడుతారు. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన దొంగ ఆయన. రేవంత్ రెడ్డి ఒక రాజకీయ టెర్రరిస్ట్. అసలు గ్లోబరీనాకు ఐటీ శాఖకు సంబంధం ఏమిటి. 24 గంటల్లోగా రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలి అని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment