సాక్షి, అమరావతి: మునిసిపల్ స్కూళ్లకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ వ్యవహారాలను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తేనున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2,095 మునిసిపల్ స్కూళ్ల పర్యవేక్షణను పాఠశాల విద్యాశాఖకు కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, టీచర్ల సంఘాల ప్రతినిధులు గతంలో తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కోరారని చెప్పారు.
ఈ స్కూళ్లు ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో ఉన్నందున విద్యా వ్యవహారాలు, పాలనాపరమైన అంశాలపై విద్యాశాఖ సూచనలను అనుసరించి ముందుకు వెళ్లడంలో సమన్వయ లోపం ఏర్పడుతోందని వారు తన దృష్టికి తెచ్చారన్నారు. ఇటీవల ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఒకే విభాగం పర్యవేక్షణలో అన్ని స్కూళ్లు ఉండడమే మంచిదని భావించి అందుకు ఆమోదం తెలిపారన్నారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నట్లు చెప్పారు.
ఆస్తులన్నీ పురపాలక సంస్థల పరిధిలోనే
మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన ఆస్తులన్నీ పురపాలక సంస్థల పరిధిలోనే ఉంటాయని, కేవలం అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను మాత్రమే విద్యాశాఖ పర్యవేక్షిస్తుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియెట్ బోర్డు విలీనంపై మంత్రి స్పందిస్తూ దీనిపై జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పారు.
ప్రైవేట్ స్కూళ్లలో ఎల్‌కేజీ, యూకేజీ మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫౌండేషన్ విద్యను బలోపేతం చేసే దిశగా కొత్త విధానంపై చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దీనిపై పాఠశాలల మ్యాపింగ్, తరగతుల మెర్జింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. శాటిలైట్ స్కూల్స్ (ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2), ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు), ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1–5 తరగతులు), ప్రీ హైస్కూల్స్ (3 నుంచి 7 లేదా 8వ తరగతి), హైస్కూల్స్ (3 నుంచి 10 తరగతి), హైస్కూల్ ప్లస్ (3 నుంచి 12వ తరగతి) విధానంలో ఉండేలా కసరత్తు చేస్తున్నామన్నారు.
నాడు – నేడు ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే కాకుండా బోధనా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు తగినంత మంది టీచర్లను నియమించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు.
అక్రమాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు
ఈసారి పదో తరగతి పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించినట్లు మంత్రి బొత్స చెప్పారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఘటనల్లో 80 మందికి పైగా ప్రభుత్వ, ప్రయివేటు టీచర్లు, ఇతర సిబ్బందిపై కూడా కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై న్యాయస్థానం తీర్పును అనుసరించి చర్యలుంటాయన్నారు.
కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పరీక్షలలో అక్రమాలను ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్నారని, వ్యవస్థీకృత నేరంగా మారిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అలాంటి విద్యా సంస్థల గుర్తింపు రద్దు తప్పదన్నారు. ఇంటర్ అడ్మిషన్లను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు వీలుగా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జూలై 4నుంచి పాఠశాలలు ప్రారంభించాలని, అంతకు ముందు ఎక్కడైనా స్కూళ్లు తెరిచినట్లు ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
26 రోజుల్లోనే ఫలితాలు...
పదో తరగతి ఫలితాల విడుదలను శనివారం వాయిదా వేయడంపై కొందరు నేతలు బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేయడం సరికాదని మంత్రి బొత్స హితవు పలికారు. గతంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు చాలా ఆలస్యంగా విడుదలయ్యేవని గుర్తు చేస్తూ ఈసారి అతి తక్కువ సమయంలోనే ఫలితాలు ప్రకటించామని చెప్పారు.
2015లో 39 రోజులకు, 2016లో 33 రోజులు, 2017లో 35 రోజులు, 2018లో 31 రోజులు, 2019లో 31 రోజులకు ఫలితాలు వెల్లడించారని చెప్పారు. ఈసారి 26 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని తెలిపారు. ఫలితాలకు సంబంధించి ఏ విద్యా సంస్థ కూడా తప్పుదోవ పట్టించే ప్రకటనలు జారీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment