సాక్షి, అమరావతి: మన బడి నాడు– నేడు రెండో దశ పనులు వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీ పడొద్దని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన మన బడి నాడు–నేడు పనుల తీరుపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన బడి నాడు – నేడు రెండో దశ పనుల కింద 22,344 పాఠశాలలకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వగా, 20,757 స్కూళ్ల వివరాలను స్కూల్ ట్రాన్సఫర్మేషన్ మానిటరింగ్ సిస్టం (ఎస్టీఎంఎస్) వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు.
పది రోజుల్లో 100 శాతం పాఠశాలల్లో పనులు ప్రారంభించాలని చెప్పారు. ఇందుకు కావాల్సిన అనుమతులను కలెక్టర్లు వెంటనే మంజూరు చేయాలని ఆదేశించారు. 10,891 పాఠశాలలకు రూ.554 కోట్లు రివాల్వింగ్ ఫండ్ ఇచ్చామని, మిగిలిన వాటికీ నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం మంచి చేయాలనే ఆలోచనతోనే పాఠశాలల విలీనంపై నిర్ణయం తీసుకుందన్నారు.
ఈ విషయంలో ఎక్కడైనా సందేహాలు, సమస్యలు తలెత్తితే స్థానిక అధికారులు స్పందించి సత్యాసత్యాలు తెలుసుకొని, సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్లు, ఆర్డీవోలకు చెప్పారు. ఈ విషయంలో భేషజాలకు పోవద్దన్నారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు (ఇన్‌చార్జి) ఎస్.సురేష్ కుమార్, పాఠశాల విద్యా సలహాదారు ఎ.మురళి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సీఎన్ దీవెన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాడు నేడు పనుల నాణ్యతలో రాజీ పడొద్దు
Published Fri, Jul 15 2022 4:53 AM | Last Updated on Fri, Jul 15 2022 3:24 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment