ప్రభుత్వ స్కూళ్లలో నైట్‌ వాచ్‌మన్లు.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ | Night Watchmen In Andhra Pradesh Government Schools - Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్కూళ్లలో నైట్‌ వాచ్‌మన్లు.. విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ.. గౌరవ వేతనం ఎంతంటే?

Published Wed, Apr 19 2023 5:22 AM | Last Updated on Wed, Apr 19 2023 11:49 AM

Night watchmen in Andhra Pradesh government schools - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నాడు–నేడు కింద వేలాది కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం.. పాఠశాలల భద్రత, అక్కడి పరికరాలు, ఇతర సదుపాయాల పరిరక్షణ కోసం నైట్‌ వాచ్‌మన్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీరి నియామకానికి అనుసరించాల్సిన విధివిధానాలపై పాఠశాల విద్యాశాఖ మంగళవారం మార్గదర్శకాలను జారీచేసింది. వాచ్‌మన్లుగా నియమితులైన వారికి నెలకు రూ.6 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వనున్నారు.

అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరు­గు­పరచడానికి ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమాన్ని 2020–21 నుంచి మిషన్‌ మోడ్‌లో చేపట్టిన సంగతి తెలిసిందే. దశల వారీగా ఆయా పాఠశాలల్లో రన్నింగ్‌ వాటర్‌తో కూడిన టాయి­లెట్లు, తాగునీటి సరఫరా, పెద్ద, చిన్న మరమ్మతు­లు, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లతో విద్యుదీకరణ, విద్యా­ర్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్‌ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తం పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్, ప్రహరీ, కిచెన్‌ షెడ్‌లు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేయిస్తోంది.

ఫేజ్‌–1 కింద 15,715 పాఠశాలల్లో ఈ పనులు పూర్తవగా ఫేజ్‌–2 కింద 22,228 పాఠశాలల్లో పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన పాఠశాలలను ఫేజ్‌–3లో అభివృద్ధి చేస్తారు. ఇదేకాకుండా మరుగుదొడ్ల నిర్వహణ నిధిని ఏర్పాటు చేసి వాటి నిర్వహణ కోసం అన్ని పాఠశాలలకు పారిశుధ్య కార్మికులుగా ఆయాలను నియమించారు. మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు రసాయనాలు, సాధనాలను కూడా ప్రభుత్వం అందించింది. నాడు–నేడు ఫేజ్‌–2 కింద పాఠశాలల్లో ఈ మౌలిక సదుపాయాలతో పాటు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్‌ (ఐఎఫ్‌పీ)లు, స్మార్ట్‌ టీవీలు ఏర్పాటుచేస్తున్నారు.

నాడు–నేడు ఫేజ్‌–1 కింద పనులు పూర్తయిన స్కూళ్లలో కూడా వీటిని సమకూరుస్తున్నారు. పాఠశాలల్లో నేర్చుకున్న పాఠాలను ఇంటి వద్ద కూడా అభ్యాసం చేసేందుకు వీలుగా ఐఎఫ్‌పీలలోని కంటెంట్‌తో కూడిన ట్యాబులను రాష్ట్రంలోని అన్ని స్కూళ్ల 8వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. వీటికోసం ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ పరికరాలను, మౌలిక సదుపాయాల వస్తువులను రక్షించడం, భద్రంగా ఉండేలా చూడడం ఇప్పుడు ఎంతో ప్రాధాన్యంగా మారింది.

వీటితోపాటు పాఠశాలల ఆవరణలోకి సంఘవిద్రోహశక్తులు ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్‌ వాచ్‌మన్‌లను నియమించాలని ఆదేశాలిచ్చింది. మొత్తం స్కూళ్లలో ప్రస్తుతం గుర్తించిన 5,388 నాన్‌ రెసిడెన్షియల్‌ (నివాసేతర) ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్క వాచ్‌మన్‌ను నియమించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులు చర్యలు తీసుకోవాలని మధ్యాహ్న భోజన పథకం, స్కూల్‌ శానిటేషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ నిధిమీనా మెమో విడుదల చేశారు.

నైట్‌ వాచ్‌మన్‌ విధులు
► పాఠశాల మూసివేయడానికి ముందు సాయంత్రం పాఠశాలకు హాజరు కావాలి. 
► పని దినాల్లో మరుసటిరోజు పాఠశాల తెరిచే వరకు విధుల్లో ఉండాలి.  ఇతర రోజుల్లో కూడా విధుల్లో ఉండాలి. సంబంధిత ప్రధానోపాధ్యాయుని పర్యవేక్షణలో పనిచేయాలి. 
► రాత్రి కాపలాదారు విధుల్లో ప్రధానమైనది పాఠశాల ఆస్తి అయిన æభవనం/ప్రాంగణం, ఇతర వస్తువులు, పరికరాలకు రక్షకుడిగా పనిచేయాలి. 
► పాఠశాల ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా చూడాలి. 
► ఏవైనా అసాధారణ కార్యకలాపాలు జరిగినప్పుడు, అగ్నిప్రమాదం వంటివి ఏర్పడినప్పు­­డు, ఏదైనా అనుమానం వచ్చినప్పుడు సంబంధిత హెడ్‌ మాస్టర్‌కు, సమీప పోలీస్‌ స్టేషన్‌కు, అగ్నిమాపక విభాగానికి నివేదించాలి.  
► సాయంత్రం పాఠశాల గార్డెన్‌కు నీరు  పోయాలి. ఎప్పటికప్పుడు ఆర్వో ప్లాంట్‌ను శుభ్రం చేయాలి. 
► పాఠశాలకు సంబంధించిన మెటీరియల్‌ను తీసుకురావడం, వాటిని హెచ్‌ఎంకు అందించడం చేయాలి. 
► స్కూలుకు సంబంధించి హెచ్‌ఎం చెప్పే ఇతర పనులను చేయాలి.  
► నైట్‌ వాచ్‌మన్‌ పనిని హెడ్‌మాస్టర్, పేరెంట్స్‌ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. 
► 2023 మే 1వ తేదీనుంచి పాఠశాలల్లో వాచ్‌­మన్లను నియమించేలా చర్యలు తీసుకోవాలి. 
► నైట్‌ వాచ్‌మన్‌ రిజిస్ట్రేషన్‌ సంబంధిత హెడ్‌మాస్టర్‌ ఐఎంఎంఎస్‌ యాప్‌ ద్వారా 
చేపట్టాలి. 
► వాచ్‌మన్లను నియమించిన అనంతరం ఆ వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.

మార్గదర్శకాలు..
► పేరెంట్‌ కమిటీల ద్వారా పాఠశాలల్లో నైట్‌ వాచ్‌మన్‌ను నియమించాలి. 
► ఇప్పటికే నియమితులైన ఆయా/కుక్‌ కమ్‌ హె­ల్పర్‌ భర్తకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. 
► గ్రామం/వార్డులో మాజీ సైనికులకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలి. 
► వీరెవరూ అందుబాటులో లేకపోతే ఇతర వ్యక్తిని నియమించవచ్చు.  
► నైట్‌ వాచ్‌మన్‌ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక నివాసి అయి ఉండాలి. 
► ఆ వార్డులో అందుబాటులో లేకుంటే, సంబంధిత పట్టణ ప్రాంతాల నివాసిని ఎంపికచేయాలి. 
► వయసు 60 ఏళ్లలోపు ఉండాలి. 
► ఇప్పుడు గుర్తించిన 5,388 పాఠశాలలు కాకుండా ఇతర పాఠశాలల్లో నియమించకూడదు. 
► ఎంపికైన వారికి గౌరవ వేతనంగా నెలకు రూ.6 వేల చొప్పున టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ ఫండ్‌ నుంచి చెల్లించాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement