25 మందికి ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు పొందే అవకాశం
సాక్షి, అమరావతి: సాంకేతిక కారణాలతో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు వచ్చినా చేరలేకపోయిన దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర ఇంటరీ్మడియట్ బోర్డు సకాలంతో స్పందించడంతో వారికి మేలు జరిగింది. రాష్ట్రంలో ఇంటర్ చదివే దివ్యాంగ విద్యార్థులు పరీక్షల్లో ఒక సబ్జెక్టు నుంచి మినహాయింపు ఉంది. దీంతో విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం భాషల్లో (లాంగ్వేజ్ పేపర్) రాయడం లేదు. దీంతో విద్యార్థులు నాలుగు సబ్జెక్టులకే పరీక్షలు రాస్తున్నారు.
అయితే, ఈ ఏడాది మద్రాస్ ఐఐటీ ప్రవేశాలకు ఐదు సబ్జెక్టుల విధానం తప్పనిసరి చేసింది. దీంతో ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోను ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు మద్రాస్ ఐఐటీతో పాటు పలు ఎన్‌ఐటీల్లోను సీట్లు సాధించారు. కానీ కౌన్సెలింగ్‌లో మార్కుల లిస్టును పరిశీలించిన అధికారులు ‘నాలుగు’ సబ్జెక్టులకే మార్కులుండటంతో వారి ప్రవేశాలను తిరస్కరించే పరిస్థితి తలెత్తింది.
దీంతో గత నెలలో పలువురు దివ్యాంగ విద్యార్థులు తాడేపల్లిలోని ఇంటర్ విద్యా మండలికి చేరుకుని న్యాయం చేయాలని అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన ఇంటర్ బోర్డు అధికారులు మద్రాస్ ఐఐటీ అధికారులను సంప్రదించి, ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సబ్జెక్టు వెసులుబాటును వివరించారు. అయితే, ప్రభుత్వం నుంచి జీవో ఇస్తే చేర్చుకుంటామని చెప్పడంతో ఇంటర్ బోర్డు అధికారులు మార్గాలను అన్వేíషించారు.
1992లో పదో తరగతి దివ్యాంగ విద్యార్థుల కోసం జారీ చేసిన జీవో నం.1161 ప్రకారం ఇంటర్ దివ్యాంగ విద్యార్థులకు మేలు చేయవచ్చని ప్రభుత్వానికి ఫైల్ పంపారు. నాలుగు పేపర్లలో వచ్చిన మార్కుల సరాసరి ఆధారంగా పరీక్ష రాయని సబ్జెక్టుకు మార్కులు కేటాయించవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ జీవో నం.255 ఇవ్వడంతో దాదాపు 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సీట్లు పొందే అవకాశం దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment