Disabled students
-
ఇంటర్ బోర్డు చొరవతో దివ్యాంగ విద్యార్థులకు మేలు
సాక్షి, అమరావతి: సాంకేతిక కారణాలతో ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు వచ్చినా చేరలేకపోయిన దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర ఇంటరీ్మడియట్ బోర్డు సకాలంతో స్పందించడంతో వారికి మేలు జరిగింది. రాష్ట్రంలో ఇంటర్ చదివే దివ్యాంగ విద్యార్థులు పరీక్షల్లో ఒక సబ్జెక్టు నుంచి మినహాయింపు ఉంది. దీంతో విద్యార్థులు ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం భాషల్లో (లాంగ్వేజ్ పేపర్) రాయడం లేదు. దీంతో విద్యార్థులు నాలుగు సబ్జెక్టులకే పరీక్షలు రాస్తున్నారు. అయితే, ఈ ఏడాది మద్రాస్ ఐఐటీ ప్రవేశాలకు ఐదు సబ్జెక్టుల విధానం తప్పనిసరి చేసింది. దీంతో ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడంతో పాటు జేఈఈ అడ్వాన్స్డ్లోను ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థులు మద్రాస్ ఐఐటీతో పాటు పలు ఎన్ఐటీల్లోను సీట్లు సాధించారు. కానీ కౌన్సెలింగ్‌లో మార్కుల లిస్టును పరిశీలించిన అధికారులు ‘నాలుగు’ సబ్జెక్టులకే మార్కులుండటంతో వారి ప్రవేశాలను తిరస్కరించే పరిస్థితి తలెత్తింది. దీంతో గత నెలలో పలువురు దివ్యాంగ విద్యార్థులు తాడేపల్లిలోని ఇంటర్ విద్యా మండలికి చేరుకుని న్యాయం చేయాలని అభ్యర్థించారు. దీనిపై వెంటనే స్పందించిన ఇంటర్ బోర్డు అధికారులు మద్రాస్ ఐఐటీ అధికారులను సంప్రదించి, ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు కల్పిస్తున్న సబ్జెక్టు వెసులుబాటును వివరించారు. అయితే, ప్రభుత్వం నుంచి జీవో ఇస్తే చేర్చుకుంటామని చెప్పడంతో ఇంటర్ బోర్డు అధికారులు మార్గాలను అన్వేíషించారు. 1992లో పదో తరగతి దివ్యాంగ విద్యార్థుల కోసం జారీ చేసిన జీవో నం.1161 ప్రకారం ఇంటర్ దివ్యాంగ విద్యార్థులకు మేలు చేయవచ్చని ప్రభుత్వానికి ఫైల్ పంపారు. నాలుగు పేపర్లలో వచ్చిన మార్కుల సరాసరి ఆధారంగా పరీక్ష రాయని సబ్జెక్టుకు మార్కులు కేటాయించవచ్చని పేర్కొన్నారు. దీనిపై ఇటీవల పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ జీవో నం.255 ఇవ్వడంతో దాదాపు 25 మంది దివ్యాంగ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు పొందే అవకాశం దక్కింది. -
దివ్యాంగ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: దివ్యాంగ విద్యార్థులకు మేలు చేసేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు అందుకుంటున్న ఉన్నత విద్యా సంస్థలు దివ్యాంగ విద్యార్థులకు ఐదు శాతానికి తగ్గకుండా సీట్లు కేటాయించింది. వీటిల్లో ప్రవేశం నిమిత్తం వారికి వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు కూడా ఇచ్చింది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మేర అంగవైకల్యం ఉన్న వారందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 44 శాతానికి తక్కువ కాకుండా అంగవైకల్యం ఉన్నట్లు నిర్థారణ అయిన వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టంచేసింది. ‘సుప్రీం’ మార్గదర్శకాల మేరకు.. దివ్యాంగులకు మేలు చేసేలా ఈ సంవత్సరం ఏప్రిల్ 20న దివ్యాంగుల హక్కులకు సంబంధించిన కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. సుప్రీంకోర్టు కూడా దివ్యాంగులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించే విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని గతంలోనే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తాజాగా దివ్యాంగుల కోసం రూపొందించిన నిబంధనల మేరకు ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఐదు శాతం సీట్లు కేటాయించడంతోపాటు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు సైతం ఇచ్చింది. ఇకపై ప్రతి సంవత్సరం ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరిపే సమయంలో దివ్యాంగులకు ఆ మేరకు సీట్ల కేటాయించి వయో పరిమితి సడలింపు కూడా ఇవ్వాల్సి వుంటుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఆయా శాఖల విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రవిచంద్ర ఆదేశించారు. దివ్యాంగుల సాధికారతకు కట్టుబడి ఉన్నాం రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారితకు జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అనుగుణంగానే ఇటీవలే వారి హక్కుల పరిరక్షణకు నిబంధనలు జారీచేశాం. రాష్ట్రస్థాయిలో దివ్యాంగులకు సలహా మండలి, జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా కమిటీలను ఏర్పాటుచేశాం. దివ్యాంగులు ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడానికి, సమాజంలో వారికి పూర్తి భాగస్వామ్యం కల్పించడానికి విద్యావకాశాలు మెరుగుపరచాలని సీఎం జగనన్న నమ్మారు. అందుకోసం ఇతరులతో సమానంగా అవకాశాలు కల్పించాలని భావించి అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఎయిడ్ పొందుతున్న ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారు. దివ్యాంగులు విద్యను పొందడంలో ఆలస్యమయ్యే అవకాశమున్న నేపథ్యంలో ప్రవేశాల్లో గరిష్ట వయో పరిమితిని ఐదేళ్లు సడలించింది. – కేవి ఉష శ్రీచరణ్, మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి -
అతడికి చేతులు లేవు కానీ.. రాయడం ఆపలేదు
లక్నో: తుషార్ విష్వకర్మకు పుట్టుకతోనే రెండు చేతులూ లేవు కానీ అతడికి తన ఇద్దరు సోదరులతో కలిసి బడికి వెళ్లి చదువుకోవాలని ఉండేది. కసితో కాళ్లతో రాయడం ప్రాక్టీస్ చేశాడు. రాయడం నేర్చుకుని స్కూల్లోనూ చేరాడు. అలా రాస్తూనే అన్ని తరగతులూ పాసయ్యాడు. వివరాల్లోకెళ్తే.. లక్నోకి చెందిన తుషార్ క్రియేటివ్ కాన్వెంట్లో 12వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం అతను సీబీఎస్ఈ విడుదల చేసిన ఫలితాల్లో 70 శాతం మార్కులతో పాసయ్యాడు. ఏ లోపం లేని ఎంతో మంది విద్యార్ధులు పాసైతే చాలు అనుకుంటుంటే తుషార్ మాత్రం 70 శాతం మార్కులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అంతే కాదు పరీక్షల సమయంలో ప్రభుత్వం అంగవైకల్యంతో బాధపడే విద్యార్ధులకు కల్పించే రైటర్ సహాయం తీసుకోవడం లేదా అధిక సమయం తీసుకోవడం వంటి బెనిఫిట్స్‌ను కూడా ఏనాడూ వినియోగించుకోలేదు. అడిగితే నేను అందరిలాంటి సాధారణ వ్యక్తినని అందుకే నేను అందరిలానే పరీక్ష రాస్తానని అంటున్నాడు తుషార్. తుషార్ మాట్లాడుతూ: చిన్నప్పుడు మా అన్నలు ఇద్దరూ స్కూల్‌కి వెళ్తుంటే నేనూ వారితో వెళ్తానని తల్లిదండ్రులను అడిగే వాడిననీ అన్నారు. అయితే తన లోపం వల్ల రాయడం ఇబ్బందిగా ఉండేదని అయితే తన అన్నల పుస్తకాల సాయంతో కాళ్లతో రాయడం ప్రాక్టీస్ చేసి తను దానిని అధిగమించడానికి తనకు ప్రతి రోజూ ఆరు గంటల సమయం పట్టేదని చెప్తున్నాడు. అలాగే తను ఈ స్థాయికి చేరుకునేలా ప్రోత్సహించిన తన తల్లిదండ్రులకు, అన్నలకు, ముఖ్యంగా టీచర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. -
దివ్యాంగ విద్యార్థికి ఇక్కట్లు
అల్లాదుర్గం (మెదక్): దివ్యాంగుడైన ఓ ఇంటర్ విద్యార్థి వార్షిక పరీక్షల్లో నష్టపోవల్సిన పరిస్థితి నెలకొంది. తండ్రి నిరక్ష్యరాస్యుడు, ఆ విద్యార్థికి కాళ్లు, చేతులు సరిగా పని చేయవు. సహాయకుడితో పరీక్షలు రాసే అనుమతి ఇవ్వాలని వేడుకున్నా.. అనుమతి లేదంటూ అధికారులు అతనితోనే పరీక్ష రాయించారు. బుధవారం మెదక్ జిల్లా అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. అల్లాదుర్గం మండలం వెంకట్రావ్పేట గ్రామానికి చెందిన బాల్‌రాజ్ స్థానిక జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బాల్‌రాజ్ చేతులు, కాళ్లు సరిగా పని చేయని దివ్యాంగుడు. బుధవారం ప్రారంభమైన తెలుగు పరీక్షను సహాయకుడితో రాస్తానని బాల్‌రాజ్ కళాశాల పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగినా.. బోర్డు అనుమతి లేదని కళాశాల అధికారులు నిరాకరించారు. రెగ్యులర్ విద్యార్థినే.. కాలేజీలో రెగ్యులర్‌గానే చదివానని, తాను దివ్యాంగు డినని అందరికీ తెలుసని, సహాయకుడికోసం అధికారులు బోర్డు అనుమతి కోసం ఎందుకు పంపలేదో తెలియదని బాల్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పరీక్ష రాస్తే సమయం సరిపోదని బాల్‌రాజ్ వాపోయాడు. తామే బోర్డు నుంచి అనుమతి తెచ్చుకోవాలని ఎప్పుడూ చెప్పలేదన్నారు. పదో తరగతిలో కూడా సహాయకుడితోనే పరీక్షలు రాసినట్లు వివరించాడు. ఈ విషయంపై పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రవీందర్‌ను వివరణ కోరగా, బోర్డు నుంచి విద్యార్థి అనుమతి తెచ్చుకోలేదని చెప్పారు. తమకు అతను సర్టిఫికెట్లు ఇవ్వలేదని, విద్యార్థే సహాయకుడికోసం అనుమతి తెచ్చుకోవాలని వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన సమయంలో అడిగితే తామేం చేస్తామన్నారు. ఇప్పటికైనా బోర్డుకు వెళితే అనుమతి వస్తుందని తెలిపారు. -
చెల్లుబాటు ఖాతాకే స్కాలర్షిప్
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీలో కొత్త సంస్కరణలను ఎస్సీ అభివృద్ధి శాఖ తీసుకొస్తోంది. స్కాలర్‌షిప్‌ల పంపిణీలో రివర్స్ ట్రాన్సాక్షన్ల సమస్యను అధిగమించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ ప్రకారం విద్యార్థుల ఖాతాలను పరిశీలించి చెల్లుబాటు ఖాతాలున్న వారికే ఉపకారవేతనాలు విడుదల చేయనున్నారు. ఖాతా సరైనది కాకుంటే.. ఒప్పందం ప్రకారం స్కాలర్షిప్ కోసం విద్యార్థులిచ్చిన ఖాతా సరైనదో కాదో ఎస్బీఐ అధికారులు తేల్చుతారు. బ్యాంకు ఖాతా నిర్వహిస్తున్నారా లేక నిర్వహణ లోపంతో ఖాతా స్తంభించిపోయిందా నిర్ధారిస్తారు. అలాంటి ఖాతాలన్నీ సేకరించి సంబంధిత కళాశాలలకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారమిచ్చి ఆయా విద్యార్థులకు తెలియజేస్తారు. ఇతర బ్యాంకు ఖాతాల నిర్వహణను ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారంతో తేల్చనున్నారు. ఈ మేరకు గత వారం ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్బీఐ, ఎన్పీసీఐ అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఏటా 10 శాతం రద్దు రాష్ట్రంలో సగటున 13 లక్షల మంది ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులు 12 లక్షలకు పైమాటే. అయితే సగటున 10 శాతం మంది తప్పుడు వివరాలు నమోదు చేయడం, లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఆ ఖాతాలు స్తంభిస్తున్నాయి. దీంతో వారికి ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నా ఆ మొత్తం తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమవుతోంది. దీంతో సంక్షేమాధికారులు వారి ఖాతా నంబర్లను మళ్లీ సేకరించి మళ్లీ బిల్లులు రూపొందించి వాటిని ఖజానా శాఖకు సమర్పించి విడుదల చేయడం ప్రహసనమవుతోంది. దీంతో ఖాతాల పరిశీలనపై పర్యవేక్షణ ఉంటే మేలని భావించిన అధికారులు ఎస్బీఐతో అవగాహన కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఖాతాల పరిశీలన పూర్తయితేనే సంక్షేమాధికారులు బిల్లులు రూపొందిస్తారని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ తెలిపారు. -
వారికోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయండి
♦ వికలాంగులకు ప్రతి జిల్లాలో కేంద్రం ఏర్పాటు చేయాలన్న బాంబే హైకోర్టు ♦ నిపుణులతో ఓ కమిటీ నియామిస్తూ ఉత్తర్వులు సాక్షి, ముంబై : వికలాంగ విద్యార్థులకు ప్రతి జిల్లాలో ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచించింది. ఇందుకోసం నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ ఎ.కె.మెనన్ వెల్లడించారు. కేం ఆస్పత్రి డాక్టర్లు, నాయర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ హరీశ్ శెట్టి, వైద్య-విద్య పరిశోధన అధికారులు, ప్రజా ఆరోగ్య విభాగ అధికారులు కమిటీలో సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీ సభ్యులు జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటుకు సాంకేతిక సహాయాన్ని అందజేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నాలుగే కేంద్రాలున్నాయి. అందులో ముంబైలో ఒకటి, పుణేలో ఒకటి ఉన్నాయి. రాష్ట్రంలో 37,358 మంది వైకల్యం కలిగిన విద్యార్థులు పాఠశాలల్లో చదువుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తేలింది. ఈ ప్రత్యేక కేంద్రాల వల్ల వికలాంగ విద్యార్థులకు సరిఫికెట్ల జారీ వంటి పనులు త్వరగా జరుగుతాయి. వైకల్యం ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరీక్షలు రాయడానికి ఎవరినైనా కేటాయించాలని హెచ్ఎస్సీ, ఎస్ఎస్సీ బోర్డులకు కోర్టు సూచించింది.