అల్లాదుర్గం పరీక్ష హాల్‌లో సహాయకుడి కోసం ఎదురుచూస్తున్న బాల్‌రాజ్
అల్లాదుర్గం (మెదక్): దివ్యాంగుడైన ఓ ఇంటర్ విద్యార్థి వార్షిక పరీక్షల్లో నష్టపోవల్సిన పరిస్థితి నెలకొంది. తండ్రి నిరక్ష్యరాస్యుడు, ఆ విద్యార్థికి కాళ్లు, చేతులు సరిగా పని చేయవు. సహాయకుడితో పరీక్షలు రాసే అనుమతి ఇవ్వాలని వేడుకున్నా.. అనుమతి లేదంటూ అధికారులు అతనితోనే పరీక్ష రాయించారు. బుధవారం మెదక్ జిల్లా అల్లాదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. అల్లాదుర్గం మండలం వెంకట్‌రావ్‌పేట గ్రామానికి చెందిన బాల్‌రాజ్ స్థానిక జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బాల్‌రాజ్ చేతులు, కాళ్లు సరిగా పని చేయని దివ్యాంగుడు. బుధవారం ప్రారంభమైన తెలుగు పరీక్షను సహాయకుడితో రాస్తానని బాల్‌రాజ్ కళాశాల పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్‌ను అడిగినా.. బోర్డు అనుమతి లేదని కళాశాల అధికారులు నిరాకరించారు.
రెగ్యులర్ విద్యార్థినే..
కాలేజీలో రెగ్యులర్‌గానే చదివానని, తాను దివ్యాంగు డినని అందరికీ తెలుసని, సహాయకుడికోసం అధికారులు బోర్డు అనుమతి కోసం ఎందుకు పంపలేదో తెలియదని బాల్‌రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పరీక్ష రాస్తే సమయం సరిపోదని బాల్‌రాజ్ వాపోయాడు. తామే బోర్డు నుంచి అనుమతి తెచ్చుకోవాలని ఎప్పుడూ చెప్పలేదన్నారు. పదో తరగతిలో కూడా సహాయకుడితోనే పరీక్షలు రాసినట్లు వివరించాడు. ఈ విషయంపై పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రవీందర్‌ను వివరణ కోరగా, బోర్డు నుంచి విద్యార్థి అనుమతి తెచ్చుకోలేదని చెప్పారు. తమకు అతను సర్టిఫికెట్లు ఇవ్వలేదని, విద్యార్థే సహాయకుడికోసం అనుమతి తెచ్చుకోవాలని వెల్లడించారు. పరీక్ష ప్రారంభమైన సమయంలో అడిగితే తామేం చేస్తామన్నారు. ఇప్పటికైనా బోర్డుకు వెళితే అనుమతి వస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment