కళాశాల హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
సూర్యాపేట జిల్లాలో ఘటన
చిలుకూరు: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్ కుమారుడు బీమన వినయ్ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చేరాడు.
10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్.. ఇంటర్‌లో ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు.
హాస్టల్ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్ అక్కడున్న ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment