రమాదేవి (ఫైల్)
మేడిపల్లి: పరీక్షాహాల్‌లో ఇన్విజిలేటర్ మందలించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీ చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థిని రమాదేవి (17) కళాశాల హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా.. కర్నూల్ జిల్లా, బల్మూరు మండలం చెంచుగూడ గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ నిమ్మల రాములు కుమార్తె రమాదేవి మేడ్చల్ జిల్లా ఫీర్జాదిగూడలోని శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతోంది.
ప్రీ ఫైనల్ పరీక్షల్లో భాగంగా సోమవారం బోటనీ పరీక్ష రాస్తున్న సమయంలో ఇన్విజిలేటర్ రమాదేవిని మందలించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పరీక్ష పూర్తికాగానే కళాశాల హాస్టల్ మూడవ అంతస్తులోని తన గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు ఆమెను కిందకు దింపి వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిననట్లు డాక్టర్లు నిర్థారించారు.
విద్యార్థి సంఘాల ఆందోళన
విషయం తెలియగానే ఏఐఎస్‌ఎఫ్, ఎంఆర్‌పీఎస్, ఎస్ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. కళాశాలలో ఒత్తిడి, వేధింపుల వల్లనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ఆందోళనకారులను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. రమాదేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఫీజు కోసమే వేధించారు..!
బల్మూర్: గత వారం తన కూతురిని ఫీజు కోసం పదేపదే అడిగారని, వేరుశనగ పంట డబ్బులు చేతికొచ్చిన తర్వాత చెల్లిస్తామని చెప్పామని నిమ్మల రాములు చెప్పారు. అయినా వినకుండా పదేపదే ఫీజు చెల్లించాలని తోటి విద్యార్థుల ముందు అవమానించడంతో భరించలేక ఆత్మహత్య చేసుకుందని ఆయన ఆరోపిస్తున్నారు. తన కుమార్తె మృతదేహన్ని కళాశాల యాజమాన్యం గాంధీ ఆస్పత్రికి తరలించి అక్కడ అడ్రస్ లేకుండాపోయిందని మండిపడ్డారు. విద్యార్థిని మృతితో చెంచుగూడెంలో విషాదం ఏర్పడింది. రాములు గ్రామంలో తనకున్న ఎకరా భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment