సాక్షి, అమరావతి: దివ్యాంగ విద్యార్థులకు మేలు చేసేలా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు అందుకుంటున్న ఉన్నత విద్యా సంస్థలు దివ్యాంగ విద్యార్థులకు ఐదు శాతానికి తగ్గకుండా సీట్లు కేటాయించింది. వీటిల్లో ప్రవేశం నిమిత్తం వారికి వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు కూడా ఇచ్చింది.
ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మేర అంగవైకల్యం ఉన్న వారందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 44 శాతానికి తక్కువ కాకుండా అంగవైకల్యం ఉన్నట్లు నిర్థారణ అయిన వారికి ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టంచేసింది.
‘సుప్రీం’ మార్గదర్శకాల మేరకు..
దివ్యాంగులకు మేలు చేసేలా ఈ సంవత్సరం ఏప్రిల్ 20న దివ్యాంగుల హక్కులకు సంబంధించిన కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. సుప్రీంకోర్టు కూడా దివ్యాంగులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించే విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని గతంలోనే స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తాజాగా దివ్యాంగుల కోసం రూపొందించిన నిబంధనల మేరకు ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఐదు శాతం సీట్లు కేటాయించడంతోపాటు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు సైతం ఇచ్చింది.
ఇకపై ప్రతి సంవత్సరం ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు జరిపే సమయంలో దివ్యాంగులకు ఆ మేరకు సీట్ల కేటాయించి వయో పరిమితి సడలింపు కూడా ఇవ్వాల్సి వుంటుంది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఆయా శాఖల విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్లు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని రవిచంద్ర ఆదేశించారు.
దివ్యాంగుల సాధికారతకు కట్టుబడి ఉన్నాం
రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారితకు జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకు అనుగుణంగానే ఇటీవలే వారి హక్కుల పరిరక్షణకు నిబంధనలు జారీచేశాం. రాష్ట్రస్థాయిలో దివ్యాంగులకు సలహా మండలి, జిల్లాల్లో కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా కమిటీలను ఏర్పాటుచేశాం. దివ్యాంగులు ఆత్మగౌరవంతో స్వతంత్రంగా జీవించడానికి, సమాజంలో వారికి పూర్తి భాగస్వామ్యం కల్పించడానికి విద్యావకాశాలు మెరుగుపరచాలని సీఎం జగనన్న నమ్మారు.
అందుకోసం ఇతరులతో సమానంగా అవకాశాలు కల్పించాలని భావించి అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఎయిడ్ పొందుతున్న ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించారు. దివ్యాంగులు విద్యను పొందడంలో ఆలస్యమయ్యే అవకాశమున్న నేపథ్యంలో ప్రవేశాల్లో గరిష్ట వయో పరిమితిని ఐదేళ్లు సడలించింది.
– కేవి ఉష శ్రీచరణ్, మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి
Comments
Please login to add a commentAdd a comment