municipal schools
-
రోస్టర్ ప్రకటించకుండా పదోన్నతులా?
సాక్షి, అమరావతి: రోస్టర్ ప్రకటించకుండా పురపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండురోజుల క్రితం శుక్రవారం గుర్తింపు పొందిన కొన్ని ఉపాధ్యాయ సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం విద్యాశాఖ వెల్లడించింది.అప్పటి సమావేశంలో మున్సిపల్ టీచర్ సంఘాలు గానీ, వారి ప్రతినిధులు గానీ లేకుండా తీసుకున్న నిర్ణయం మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించింది. సోమవారమే సీనియారిటీ లిస్టు ప్రకటించడంతో పాటు అభ్యంతరాల స్వీకరణకు అవకాశమిచి్చంది. అయితే దాదాపు ఆరేళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన మున్సిపల్ టీచర్ల పదోన్నతులపై సర్విస్ రూల్స్, కోర్టు తీర్పులు పరిశీలించకుండా ఈ నిర్ణయం తీసుకోవడంపై టీచర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చట్టాలకు లోబడే సర్విస్ రూల్స్.. రాష్ట్రంలోని 123 యూఎల్బీల్లో 2,115 మున్సిపల్ పాఠశాలలున్నాయి. వీటిల్లో సుమారు 14 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరికి 2018లో మున్సిపల్‌శాఖ పరిధిలోనే పదోన్నతులు కల్పించారు. పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలు చేసిన విధానాలనే మున్సిపల్ స్కూళ్లలోనూ అమలు చేస్తున్నారు. అయితే, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ మాత్రం మున్సిపల్ చట్టాలకు లోబడే ఉన్నాయి. విద్యా సంబంధమైన అంశాల్లో రెండు విభాగాల స్కూళ్లల్లో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రెండేళ్ల క్రితం విద్యాశాఖ జీవో నం.84 జారీ చేసింది.దీని ప్రకారం అకడమిక్, పరిపాలనా పరమైన అంశాలను పాఠశాల విద్యాశాఖకు బదలాయించారు. దీనిపై మున్సిపల్ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీరి విషయంలో హైకోర్టు తుది తీర్పునకు లోబడే పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రస్తుతం ఇచ్చే పదోన్నతులు విద్యాశాఖ చట్టాల ప్రకారం ఇస్తున్నారా లేక మున్సిపల్ చట్టాల ప్రకారం కలి్పస్తున్నారా అనేది తేలాల్సి ఉంది. పాఠశాల విద్యాశాఖ అక్టోబర్ 26 తేదీతో సోమవారం షెడ్యూల్ ప్రకటించింది. కాగా, మున్సిపల్ టీచర్ల పదోన్నతులకు పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన షెడ్యూల్ అభ్యంతరకరంగా ఉందని, చివరిగా ఇచి్చన పదోన్నతుల్లో ఏ పోస్టుకు ఏ రోస్టర్ పాయింట్ వద్ద ఆగిందో వెల్లడించలేదని రాష్ట్ర మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎస్.రామకృష్ణ అన్నారు. రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారో కూడా తెలియదన్నారు.విద్యాశాఖ ప్రకటించిన పదోన్నతుల షెడ్యూల్ ఇదీ..⇒ 28–10–2024 సీనియారిటీ తాత్కాలిక జాబితా ప్రకటన ⇒ 28 నుంచి నవంబర్ 1 వరకు అభ్యంతరాల స్వీకరణ ⇒ 4న సీనియారిటీ తుది జాబితా విడుదల ⇒ 6న గ్రేడ్–2 హెచ్ఎంల కౌన్సెలింగ్ ⇒ 8న స్కూల్ అసిస్టెంట్ల కౌన్సెలింగ్ -
AP: పాఠశాల విద్యాశాఖకు మున్సిపల్ స్కూళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలను పాఠశాల విద్యా శాఖకు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఈ మేరకు జీవో 84 ను విడుదల చేశారు. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసు విషయాలతో సహా పాఠశాలల పరిపాలన బాధ్యతలను ఇకపై పాఠశాల విద్యా శాఖ చేపడుతుంది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని జిల్లా, మండల పరిషత్ స్కూళ్లు, టీచర్ల బాధ్యతలు అప్పగించిన విధంగానే మున్సిపల్ స్కూళ్లనూ విద్యాశాఖకు అప్పగించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో జెడ్పీ, ఎంపీపీ టీచర్ల సర్వీసుల (ఏకీకృత సర్వీసులు) విలీన ప్రతిపాదన కోర్టు విచారణలో ఉన్న నేపథ్యంలో మున్సిపల్ టీచర్ల విషయంలోనూ పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక సర్వీసు రూల్సును జారీచేయనుంది. విద్యా శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేవరకు ఈ స్కూళ్లలోని బోధనేతర సిబ్బంది యధాతథంగా కొనసాగుతారు. స్వీపర్లు, ఇతర కంటింజెంటీ సిబ్బందిని పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తీసుకుంటుంది. పాఠశాలల స్థిర, చరాస్తులపై పూర్తి యాజమాన్య హక్కులు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకే ఉంటాయని జీవోలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లæ స్కూళ్లలో 13,948 టీచర్ పోస్టులుండగా 12,006 మంది పనిచేస్తున్నారు. 1,942 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2000 సంవత్సరం వరకు ఈ పాఠశాలల్లో నియామక ప్రక్రియను మున్సిపల్ విభాగమే చూసేది. తరువాత విద్యాశాఖ పరిధిలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)లకు అప్పగించారు. ఇతర విభాగాల టీచర్ల మాదిరిగానే మున్సిపల్ టీచర్లు కూడా 010 పద్దు ద్వారా వేతనాలు అందుకుంటున్నారు. 11 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని స్కూళ్ల పర్యవేక్షణకు విద్యాధికారుల పోస్టులను ఏర్పాటుచేసి సీనియర్ హెడ్మాస్టర్లను తాత్కాలిక ప్రాతిపదికన వాటిలో నియమించారు. మున్సిపాలిటీలలోని స్కూళ్ల అకడమిక్ వ్యవహారాలను చూసేందుకు తాత్కాలికంగా సీనియర్ ఉపాద్యాయులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ స్కూళ్ల పర్యవేక్షణకు ఓ ప్రత్యేక విధానం ఉంది. ఈ విధానం మున్సిపల్ స్కూళ్లలో లేకపోవడంతో పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. పైగా ప్రజలకు మౌలిక సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలను అమలులో నిరంతరం మునిగిపోయే మున్సిపాలిటీలు కీలకమైన విద్యా వ్యవహారాలపై దృష్టి సారించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ స్కూళ్ల పర్యవేక్షణ, నిర్వహణను విద్యా శాఖకు బదలాయించారు. దీని వల్ల మున్సిపల్ టీచర్ల సీనియారిటీకి, పదోన్నతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. పైగా ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీపీ ఉపాధ్యాయులకు వర్తించే (నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఎఫ్, పదోన్నతులు, బదిలీలు వంటివి) అన్ని ప్రయోజనాలూ మున్పిపల్ టీచర్లకూ అందుతాయని వివరించింది. దీనివల్ల మున్సిపల్ టీచర్లకు ఇప్పటికంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని పేర్కొంది. సర్వీసు అంశాలకు రక్షణ కల్పిస్తూ వీటి పర్యవేక్షణను కూడా ఇకపై పాఠశాల విద్యాశాఖ చూస్తుంది. ఉపాధ్యాయుల్లో బోధన నైపుణ్యాన్ని పెంపొందిచేలా ఏర్పాట్లు చేస్తుంది. ప్రభుత్వ తాజా నిర్ణయం టీచర్లకు, విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. -
ఒకే గొడుగు కిందకు పాఠశాల విద్య
సాక్షి, అమరావతి: మునిసిపల్ స్కూళ్లకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్, అకడమిక్ వ్యవహారాలను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తేనున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం టెన్త్ పరీక్షా ఫలితాల విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2,095 మునిసిపల్ స్కూళ్ల పర్యవేక్షణను పాఠశాల విద్యాశాఖకు కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, టీచర్ల సంఘాల ప్రతినిధులు గతంలో తాను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కోరారని చెప్పారు. ఈ స్కూళ్లు ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో ఉన్నందున విద్యా వ్యవహారాలు, పాలనాపరమైన అంశాలపై విద్యాశాఖ సూచనలను అనుసరించి ముందుకు వెళ్లడంలో సమన్వయ లోపం ఏర్పడుతోందని వారు తన దృష్టికి తెచ్చారన్నారు. ఇటీవల ఈ అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఒకే విభాగం పర్యవేక్షణలో అన్ని స్కూళ్లు ఉండడమే మంచిదని భావించి అందుకు ఆమోదం తెలిపారన్నారు. త్వరలోనే దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నట్లు చెప్పారు. ఆస్తులన్నీ పురపాలక సంస్థల పరిధిలోనే మున్సిపల్ స్కూళ్లకు సంబంధించిన ఆస్తులన్నీ పురపాలక సంస్థల పరిధిలోనే ఉంటాయని, కేవలం అకడమిక్, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను మాత్రమే విద్యాశాఖ పర్యవేక్షిస్తుందని మంత్రి బొత్స స్పష్టం చేశారు. పాఠశాల విద్యాశాఖలో ఇంటర్మీడియెట్ బోర్డు విలీనంపై మంత్రి స్పందిస్తూ దీనిపై జాతీయ నూతన విద్యావిధానాన్ని అనుసరించి ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రైవేట్ స్కూళ్లలో ఎల్కేజీ, యూకేజీ మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఫౌండేషన్ విద్యను బలోపేతం చేసే దిశగా కొత్త విధానంపై చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. దీనిపై పాఠశాలల మ్యాపింగ్, తరగతుల మెర్జింగ్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. శాటిలైట్ స్కూల్స్ (ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2), ఫౌండేషన్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు), ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1–5 తరగతులు), ప్రీ హైస్కూల్స్ (3 నుంచి 7 లేదా 8వ తరగతి), హైస్కూల్స్ (3 నుంచి 10 తరగతి), హైస్కూల్ ప్లస్ (3 నుంచి 12వ తరగతి) విధానంలో ఉండేలా కసరత్తు చేస్తున్నామన్నారు. నాడు – నేడు ద్వారా స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడమే కాకుండా బోధనా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు తగినంత మంది టీచర్లను నియమించడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. అక్రమాలకు పాల్పడే సంస్థలపై కఠిన చర్యలు ఈసారి పదో తరగతి పరీక్షలను ఎంతో పకడ్బందీగా నిర్వహించినట్లు మంత్రి బొత్స చెప్పారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఘటనల్లో 80 మందికి పైగా ప్రభుత్వ, ప్రయివేటు టీచర్లు, ఇతర సిబ్బందిపై కూడా కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ అంశంపై న్యాయస్థానం తీర్పును అనుసరించి చర్యలుంటాయన్నారు. కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం పరీక్షలలో అక్రమాలను ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్నారని, వ్యవస్థీకృత నేరంగా మారిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. అలాంటి విద్యా సంస్థల గుర్తింపు రద్దు తప్పదన్నారు. ఇంటర్ అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించేందుకు వీలుగా న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జూలై 4నుంచి పాఠశాలలు ప్రారంభించాలని, అంతకు ముందు ఎక్కడైనా స్కూళ్లు తెరిచినట్లు ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. 26 రోజుల్లోనే ఫలితాలు... పదో తరగతి ఫలితాల విడుదలను శనివారం వాయిదా వేయడంపై కొందరు నేతలు బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేయడం సరికాదని మంత్రి బొత్స హితవు పలికారు. గతంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు చాలా ఆలస్యంగా విడుదలయ్యేవని గుర్తు చేస్తూ ఈసారి అతి తక్కువ సమయంలోనే ఫలితాలు ప్రకటించామని చెప్పారు. 2015లో 39 రోజులకు, 2016లో 33 రోజులు, 2017లో 35 రోజులు, 2018లో 31 రోజులు, 2019లో 31 రోజులకు ఫలితాలు వెల్లడించారని చెప్పారు. ఈసారి 26 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించామని తెలిపారు. ఫలితాలకు సంబంధించి ఏ విద్యా సంస్థ కూడా తప్పుదోవ పట్టించే ప్రకటనలు జారీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. -
భార్య స్థానంలో విధులకు హాజరై దొరికిపోయిన టీచర్
అనంతపురం: మేడం రోజూ స్కూల్కెళ్లి పాఠాలు చెప్పడం ఇబ్బందనుకున్నారో లేక మరేదైనా కారణమో తెలీదు కాని ఆమె స్థానంలో భర్త హాజరయ్యారు. తనూ ఓ పాఠశాలలో టీచర్ అయినప్పటికీ అక్కడ విధులకు డుమ్మా కొట్టి..భార్య ‘విధుల’ను నిర్వర్తించారు. ఈ విషయం ఎంఈఓ తనిఖీలో బయటపడడంతో ఆమెను సస్పెండ్ చేయడంతో పాటు అయ్యవారిపైనా చర్యలకు సిఫారసు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రమేష్ కదిరి పట్టణంలోని రాణీనగర్ మునిసిపల్ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడి (స్కూల్ అసిస్టెంట్)గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఆర్.అరుణాదేవి ఓడీచెరువు మండలం టి.కుంట్లపల్లి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ). అరుణాదేవి ఈ నెల 7 నుంచి 9 వరకు సెలవుపై వెళ్లారు. పదో తేదీ (శుక్రవారం) విధులకు హాజరుకావాల్సి ఉండేది. ఆమె వస్తారనే ఉద్దేశంతో ఆరోజు హెచ్ఎం సునీత సెలవు పెట్టారు. కానీ అరుణాదేవి స్థానంలో భర్త రమేష్ విధులకు హాజరయ్యారు. ఈ విషయం ఎంఈఓ చెన్నక్రిష్ణ ఆకస్మిక తనిఖీలో బయటపడింది. ఆయన డీఈఓకు నివేదిక పంపడంతో అరుణాదేవిని సస్పెండ్ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఆమె భర్తపైనా చర్యలు తీసుకోవాలని కదిరి మునిసిపల్ కార్యాలయానికి సిఫారసు చేశారు. మరో ఇద్దరిపైనా.. ►ఓడీచెరువు మండలం గోళ్లవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ జి.గణేష్ ఏకోపాధ్యాయుడిగా ఉన్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే గురు, శుక్రవారం పాఠశాలకు డుమ్మా కొట్టారు. దీంతో విద్యార్థులందరూ ఇళ్ల వద్దే ఉండిపోయారు. ఈ విషయంపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఎంఈఓ పాఠశాలను తనిఖీ చేయగా .. నిజమేనని తేలింది. దీంతో ఎంఈఓ సిఫారసు మేరకు ఎస్జీటీ గణేష్‌ను సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులిచ్చారు. ►హిందూపురం మండలం కొట్నూరు ప్రాథమిక పాఠశాల హెచ్ఎం కె.నర్సిరెడ్డిని కూడా డీఈఓ సస్పెండ్ చేశారు. ఆయన విద్యార్థులకు పాఠాలు సక్రమంగా చెప్పడం లేదని ఎంఈఓ గంగప్ప ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. -
సీబీఎస్ఈకి 1,092 స్కూళ్లు ఎంపిక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) విధానాన్ని అమలు చేసేందుకు విద్యా శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. పాఠశాల విద్యలో సమూల సంస్కరణలు తెస్తున్న నేపథ్యంలో సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యా వ్యవస్థలో ముఖ్యంగా మూల్యాంకన విధానంలో పూర్తి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దే ఉద్దేశంతో సీబీఎస్ఈ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందుకు ముందుగా సీబీఎస్ఈకి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా సుముఖత వ్యక్తపరిచింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న 1,092 పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి దశ కింద వీటిలో సీబీఎస్ఈ అమలుకు నిర్ణయించింది. 2024–25 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలు రాసేలా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఏడో తరగతి నుంచి అమలు చేయాలని ముందు నిర్ణయించారు. అయితే సీబీఎస్ఈ అఫిలియేషన్ ప్రక్రియ కొనసాగుతుండడం, ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడచిపోతుండడంతో వచ్చే ఏడాది నుంచి అంటే ఎనిమిదో తరగతి నుంచి సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. కేజీబీవీలకు అగ్రస్థానం తొలి విడతగా సీబీఎస్ఈ విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వంలోని 10 విభాగాల యాజమాన్యాల పరిధిలో ఉన్న వివిధ స్కూళ్లను ఎంపిక చేశారు. వీటిలో నిరుపేద, అనాధ బాలికలు విద్యనభ్యసిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆ తర్వాత ఏపీ మోడల్ స్కూళ్లు, వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే గురుకుల స్కూళ్లు, మున్సిపల్ స్కూళ్లు, జెడ్పీ, ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేశారు. అత్యధికంగా అనంతపురం జిల్లాలో.. సీబీఎస్ఈ విధానం తొలి విడత అమలుకు సంబంధించి ఎంపిక చేసిన స్కూళ్లలో అత్యధికం అనంతపురం జిల్లాలో ఉన్నాయి. ఈ జిల్లాలో 137 స్కూళ్లను ఎంపిక చేయగా రెండో స్థానంలో కర్నూలు (128) మూడో స్థానంలో ప్రకాశం (94) ఉన్నాయి. -
మునిసిపల్ స్కూళ్లలో ఆన్లైన్ బోధన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మునిసిపల్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు బోధించాలని పురపాలకశాఖ నిర్ణయించింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు నష్టపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సంకల్పించింది. రాష్ట్రంలో 59 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 2,110 మునిసిపల్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2 లక్షలమంది విద్యార్థులున్నారు. వీరికి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు చెప్పేందుకు జూమ్ లైసెన్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లకు పురపాలకశాఖ కమిషనర్–డైరెక్టర్ ఎం.ఎం.నాయక్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. పదో తరగతి విద్యార్థులకు విజయవంతంగా ఆన్లైన్ తరగతులు రాష్ట్రంలో ఐదు పట్టణ స్థానిక సంస్థల్లో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఆన్లైన్ తరగతులు విజయవంతమయ్యాయి. విజయవాడ, తిరుపతి, ఒంగోలు నగరాలు, శ్రీకాళహస్తి, నరసాపురం మునిసిపాలిటీల్లో పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌లో ఆన్లైన్ తరగతులు నిర్వహించారు. అనంతరం ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో పదో తరగతి విద్యార్థులకు అమలు చేయడంతో 33 వేలమంది విద్యార్థులు లబ్ధిపొందారు. దీంతో అన్ని మునిసిపల్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించేందుకు జూమ్ లైసెన్సులు కొనుగోలు చేయమని పురపాలకశాఖ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించింది. మొదటి దశలో ఏడాదిపాటు లైసెన్సుల కొనుగోలుకు మునిసిపాలిటీల సాధారణ నిధులు వినియోగిస్తారు. విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైనన్ని లైసెన్సులను కొనుగోలు చేస్తారు. ప్రతి పాఠశాల కనీసం 5 జూమ్ లైసెన్సులు, మొబైల్ స్టాండ్, బోర్డులు కొనుగోలు చేస్తుంది. వీటి కొనుగోళ్ల ప్రతిపాదనలను ఈ నెల 28లోగా నివేదించాలని, జూన్ 30 నాటికి కొనుగోలు చేయాలని పురపాలకశాఖ సూచించింది. తరువాత ముందుగా బ్రిడ్జ్ కోర్సులు, అనంతరం సిలబస్‌ను అనుసరించి తరగతులు నిర్వహిస్తారు. ఆన్లైన్ తరగతుల నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, మునిసిపల్ స్థాయిల్లో ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేసింది. మునిసిపాలిటీ స్థాయి సెల్లో మునిసిపల్ మేనేజర్, సీనియర్ ప్రధానోపాధ్యాయుడు, విద్యా సూపర్వైజర్లు, వార్డు విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈ–లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్–డైరెక్టర్ ఎం.ఎం.నాయక్ ‘సాక్షి’కి తెలిపారు. -
మునిసిపల్ స్కూళ్లలో 'ఇ–లెర్నింగ్'
సాక్షి, అమరావతి: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్రంలో మునిసిపల్ పాఠశాలలు ముందడుగు వేస్తున్నాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ పదోతరగతి విద్యార్థులను పూర్తిస్థాయిలో పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఇ–లెర్నింగ్ బాట పట్టాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ క్లాసులు చేపట్టడం ఇదే తొలిసారి. ముందుగా 5 మునిసిపాలిటీల్లో పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు బుధవారం ప్రారంభించారు. వచ్చే వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 125 మునిసిపాలిటీల్లోనూ అమలు చేయనున్నారు. తద్వారా 32 వేలమంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. అత్యుత్తమ ఫలితాలే లక్ష్యంగా.. మరో నెలరోజుల్లో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా పరిస్థితులతో పాఠశాలలకు సెలవులు ఇవ్వాల్సి వచ్చింది. కానీ మునిసిపల్ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులు నష్టపోకుండా ఉండాలని పురపాలకశాఖ భావించింది. అందుకే ఇ–లెర్నింగ్ విధానంలో వారిని పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం నెలరోజులపాటు ఆన్లైన్ క్లాసుల నిర్వహణ ప్రణాళికను రూపొందించింది. ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం అన్ని సబ్జెక్ట్ నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు ముందుగా తయారుచేసిన టీఎల్ఎం వీడియోలు, పీపీటీలను ఆన్లైన్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచి బోధిస్తారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తారు. పదోతరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నపత్రం మోడల్లోనే విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం విజయవాడ, ఒంగోలు, శ్రీకాళహస్తి, తిరుపతి, నరసాపూర్ నగరాలు, పట్టణాల్లో ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు. సబ్జెక్టులవారీగా నిపుణులు ఆన్లైన్ క్లాసులు నిర్వహించి విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. వారికి ప్రేరణనివ్వడం, చేతిరాత పరిశీలించడం, పరీక్షల్లో వివిధ అంశాలపై సకాలంలో సమాధానాలను రాసే విధానాన్ని పర్యవేక్షించారు. తొలిరోజు సమస్యలేమీ ఎదురుకాలేదు. మరో నాలుగు రోజులపాటు వీరికి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారు. వచ్చే వారం నుంచి రాష్ట్రంలోని 125 మునిసిపాలిటీల్లోని 32 వేలమంది పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించనున్నారు. సందేహాలు నివృత్తి అవుతున్నాయి పదోతరగతి పరీక్షలు నెలరోజులు ఉన్నాయి. స్కూల్‌కు వెళ్లలేకపోతున్నామని ఎంతో కంగారుపడ్డాను. ఇప్పుడా ఆందోళన తీరింది. ఆన్లైన్ క్లాసులు మాకు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. పదోతరగతి పరీక్షలకు సంబంధించిన సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తున్నారు. – మురపాక జ్యోత్స్న, పదోతరగతి విద్యార్థిని, నరసాపురం మునిసిపల్ పాఠశాల కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా.. ఆన్లైన్ క్లాసులు అంటే కార్పొరేట్ పాఠశాలలకే పరిమితం అన్న భావనను తొలగిస్తున్నాం. మునిసిపల్ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాం. – డి.కృష్ణవేణి, స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్), విజయవాడ. ఇప్పుడు ధైర్యంగా ఉంది మా పిల్లలు పదోతరగతి పరీక్షల కోసం ఎలా చదువుతారో అనే భయం ఉండేది. కానీ ఆన్లైన్ క్లాసులు మొదలు పెట్టడంతో మా భయం పోయింది. ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలన్న నిర్ణయం ఎంతో ఊరటనిస్తోంది. – ఎస్.మాధురి, విద్యార్థిని తల్లి, తిరుపతి అత్యుత్తమ ఫలితాలే ధ్యేయం కరోనా పరిస్థితులతో మా విద్యార్థులు నష్టపోకూడదు. అందుకే మునిసిపల్ విద్యాశాఖ ఆన్లైన్ తరగతుల ప్రణాళిక రూపొందించింది. పదోతరగతి పరీక్షలకు మా విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేస్తాం. – మిద్దే శ్రీనివాసరావు, స్కూల్ అసిస్టెంట్ (ఫిజిక్స్), గుడివాడ. -
విమానం నడిపిన విద్యార్థులు
తెనాలి: విమానం ఎక్కడమే చాలా మంది సామాన్యులకు కల లాంటిది. కానీ తెనాలి మున్సిపల్ స్కూల్ విద్యార్థులకు విమానంలో విహరించడమే కాదు.. ఏకంగా దాన్ని నడిపే అవకాశం కూడా లభించింది. వివరాలు.. గుంటూరు జిల్లా తెనాలి మారీసుపేటలోని చెంచు రామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎన్సీసీ క్యాడెట్లు పి.గంగాభవాని(9వ తరగతి), షేక్ నజీర్ అహ్మద్ (10వ తరగతి) శుక్రవారం సాయంత్రం గన్నవరం ఎయిర్‌పోర్టు బ్యారెల్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో భాగంగా ఎన్సీసీ అధికారి పులి భాస్కరరావుతో కలిసి శిక్షణ విమానాన్ని పరిశీలించారు. 8వ ఆంధ్రా కమాండింగ్ అధికారి, పైలెట్ అయిన పంకజ్ గుప్తా వారికి అన్ని అంశాలనూ క్షుణ్నంగా వివరించారు. విద్యార్థుల ఆసక్తిని గమనించి రెండు సీట్ల విమానంలో తాను పక్కనే కూర్చొని.. ఆ ఇద్దరితో చెరోసారి విమానాన్ని నడిపించారు. ఒక్కొక్కరు 20 నిమిషాల చొప్పున గాల్లో తేలిపోయారు. గన్నవరం ఎయిర్‌పోర్టు బ్యారెల్‌లో ఎన్సీసీ అధికారి పులి భాస్కరరావుతో నజీర్ అహ్మద్, గంగాభవాని శిక్షణలో భాగంగా.. యుద్ధ విమానం ఎలా పనిచేస్తుంది? ఏయే విమానాలుంటాయి? తదితర అంశాలపై ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ ఇస్తుంటారు. విజయవాడలోని 8వ ఆంధ్రా ఎయిర్ స్క్వాడ్రన్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఆంధ్రలో ఎయిర్‌వింగ్ పరిధిలో 13 హైసూ్కళ్లుంటే, గుంటూరు జిల్లాలో 3 ఉన్నాయి. అందులో తెనాలి మునిసిపల్ స్కూలు ఒకటి. ఇక్కడి క్యాడెట్లకు అధికారులు యుద్ధ విమానాల గురించి బోధిస్తారు. ప్రాక్టికల్స్‌లో భాగంగా గన్నవరం ఎయిర్‌పోర్టు బ్యారెల్‌లో ప్రత్యక్షంగా విమానాన్ని చూపించి.. దాని గురించి వివరిస్తారు. ఈ క్రమంలో ఆంధ్రా కమాండింగ్ అధికారి, విమానం పైలెట్ అయిన పంకజ్ గుప్తా.. తెనాలి విద్యార్థుల ఆసక్తిని గమనించి.. శిక్షణ విమానాన్ని స్వయంగా నడిపే అవకాశం కల్పించారు. విమానం ఎక్కడమే గొప్ప అనుకునే రోజుల్లో, హైస్కూలు స్థాయిలోనే శిక్షణ విమానాన్ని నడపటం సంతోషంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు. -
మరింత స్మార్ట్‌గా..
స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తూ పేద విద్యార్థులకు సరికొత్త విద్యాబోధన అందిస్తున్న మహా విశాఖ నగర పాలక సంస్థ.. మరిన్ని స్కూళ్లలో సేవలు విస్తృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, డిజిటల్ ల్యాబ్‌లు, ప్రొజెక్షన్ యూనిట్లు.. ఇలా స్మార్ట్ పాఠశాలలుగా అభివృద్ధి చేసేందుకు రూ.28.77 కోట్లతో పనులు చేపట్టింది. లాక్డౌన్ కారణంగా పనులు ఆలస్యం కావడంతో.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పేద విద్యార్థులకు స్మార్ట్ పాఠాలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం : మున్సిపల్ బడి అంటే.. దుంపల బడి అనే ఆలోచన నుంచి.. డిజిటల్ బడి అనేలా తీర్చిదిద్దుతున్నారు మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు అందే ప్రతి సౌకర్యం పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందాలనే లక్ష్యంతో జీవీఎంసీ వినూత్నంగా ఆలోచనలు చేస్తోంది. విద్యార్థుల్లో ఆవిష్కరణ, పరిశోధన నైపుణ్యం, సామర్థ్యం పెరగాలనే లక్ష్యంతో ప్రాథమిక స్థాయిలోనే వారికి సాంకేతికతను పరిచయం చేయాలని జీవీఎంసీ నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగానే స్మార్ట్ క్లాసులను 2017 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించింది. మొదటి 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకూ డిజిటల్ క్లాస్ రూమ్‌లు, స్మార్ట్ క్లాస్‌లు పరిచయం చేసిన జీవీఎంసీ ఇప్పుడు ఒకటి నుంచి 8 వరకూ స్మార్ట్ క్లాస్లనూ, 10వ తరగతి వరకూ డిజిటల్ తరగతులను బోధిస్తోంది. దీని ద్వారా పిల్లల్లో నేర్చుకోవాలనే తపన, పాఠ్యాంశాలపై అవగాహన, ఆసక్తి, ఉత్సాహం పెరుగుతోంది. మూడు విభాగాలుగా తరగతులు స్మార్ట్ క్లాస్ రూమ్ అనేది మూడూ విభాగాలుగా అమలు చేస్తున్నారు. మొదటిది ప్రతి క్లాస్‌కు డిజిటల్ బోర్డును అమర్చుతారు. ఈ డిజిటల్ బోర్డును టీచర్స్ వినియోగించి.. పాఠాలను బోధిస్తారు. ఇలా బోధించడం వల్ల విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయి. గణితం, సైన్స్ డయాగ్రామ్స్ విద్యార్థులు స్పష్టంగా 3డిలో వివరిస్తే ఆసక్తిగా ఉంటుంది. రెండో దశలో విద్యార్థులకు క్రోమ్ బుక్స్ (మినీ ల్యాప్టాప్స్) ఇచ్చి వారికి కంప్యూటర్ పరిజ్ఞానం నేర్పుతారు. ఇందులో ప్రత్యేకం గూగుల్ క్లాస్ రూమ్. ఇది విద్యా రంగంలో డిజిటల్ క్లాస్‌లకు ముఖ్య భూమిక పోషిస్తోంది. దీని గురించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు నేర్పిస్తారు. మూడో దశలో గూగుల్ క్లాస్ రూమ్ గురించి నేర్చుకున్న తరువాత ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్లైన్లో హోమ్ వర్క్స్ ఇవ్వడం, పరీక్షలు నిర్వహిస్తారు. వారు చేసిన హోమ్ వర్క్స్, పరీక్షలకు ఫలితాలను వెంటనే వెల్లడవుతాయి. ఇలా చేయడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సమయం ఆదాతో పాటు, బుక్స్‌లో లేని విషయాలను సైతం తెలుసుకునే అవకాశం ఏర్పడుతోంది. స్మార్ట్ ల్యాబ్‌లు.. డిజిటల్ క్లాసులు విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు చెప్పడమే కాదు.. ఆన్లైన్లోనే పరీక్షలూ నిర్వహించేలా 2019–20 విద్యా సంవత్సరంలో యూనిట్ పరీక్షలు పైలట్‌గా చేపట్టి సఫలీకృతులయ్యారు. ఆన్లైన్ ద్వారా రివిజన్ ఎగ్జామ్స్ సైతం నిర్వహించారు. ఇలా ప్రతి అడుగూ స్మార్ట్‌గా వేస్తున్న జీవీఎంసీ మిగిలిన స్కూళ్లలోనూ ప్రాజెక్టు విస్తరిస్తోంది. రూ.28.27 కోట్లతో స్మార్ట్ స్కూళ్లు పనులు చేపడుతోంది. హైస్కూళ్లలో స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, ప్రొజెక్షన్ యూనిట్లుతో పాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో పనులు ఆలస్యమయ్యాయి. వీటన్నింటినీ ఈ విద్యా సంవత్సరంలో పూర్తి చేసి, 2021–22 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జీవీఎంసీ ప్రయత్నిస్తోంది. జీవీఎంసీ పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్‌లో నాలెడ్జ్ యంత్ర (కెయాన్) అప్లికేషన్ ద్వారా క్లాస్ వివరించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో కెయాన్ వినియోగిస్తున్నారు. కంప్యూటర్‌కు ప్రొజెక్టర్ అనుసంధానించి. ప్రొజెక్టర్ ఆన్ చేసి ఇంటెల్ స్పేస్ అనే స్మార్ట్ బోర్డును ఉపాధ్యాయులు వినియోగిస్తున్నారు. సుద్ద ముక్క లేకుండానే బోర్డుపై క్లాసులు చెప్పే సౌకర్యం ఉంది. అదే విధంగా ల్యాబ్‌లో కెయాన్తో పాటు 40 క్రోమ్‌బుక్స్‌ను విద్యార్థులకు ఇస్తారు. ఈ క్రోమ్బుక్స్లోనే పెన్ను పుస్తకాలతో సంబంధం లేకుండా విద్యార్థులు నోట్స్ ప్రిపేర్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. చురుగ్గా స్మార్ట్ స్కూళ్ల పనులు జీవీఎంసీ విద్యార్థుల్లోనూ, ఉపాధ్యాయుల్లోనూ స్మార్ట్ క్లాసులు మంచి మార్పులు తీసుకొచ్చింది. డిజిటల్ క్లాస్ రూమ్స్ వల్ల విద్యార్థులు రివిజన్ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సైన్స్ వీడియోస్ ద్వారా విద్యార్థులకు పాఠాలపై పూర్తి అవగాహన కలుగుతోంది. స్మార్ట్ క్లాస్ రూమ్స్ వల్ల పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులకు మంచి సహకారం లభిస్తోంది. పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా అమలు చేస్తున్న స్మార్ట్ క్లాసులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. దీనికి తోడు విద్యార్థుల్ని ఆన్లైన్ ఎగ్జామ్స్‌ను ఎదుర్కొనేలా సంసిద్ధుల్ని చేస్తే భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షల్నీ సులువుగా అందిపుచ్చుకోగలరు. అందుకే పరీక్షలు కూడా ఆన్లైన్లో నిర్వహించే విషయంపై కసరత్తు చేస్తున్నాం. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
సెట్ యువర్ గోల్
ఒంగోలు టౌన్: ‘‘అర్బన్ ప్రాంతాల్లోని మునిసిపల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. పాఠశాల స్థాయిలోనే ప్రతి విద్యార్థికి భవిష్యత్‌లో ఏం కావాలో ముందుగానే తెలుసుకుంటాం. దానికి అనుగుణంగా ప్రోత్సాహం అందిస్తాం. యాక్టివిటీ బేసిక్ లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తాం. సెట్ యువర్ గోల్ పేరుతో ఆ విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తామని’’ మునిసిపల్ పాఠశాలల ఫౌండేషన్ కోర్సు స్టేట్ కన్సల్టెంట్ వీ తనూజ్ వెల్లడించారు. ఒంగోలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో నో బ్యాగ్ డేను పరిశీలించేందుకు శుక్రవారం ఆయన ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 59 మునిసిపాలిటీల్లోని 1756 మునిసిపల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న లక్షా 36 వేల మంది విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నెలలోని నాలుగు శుక్రవారాల్లో రెండు శుక్రవారాలను ఒకటి నుంచి మూడు తరగతుల వారికి, మిగిలిన రెండు శుక్రవారాలను నాలుగు, ఐదు తరగతుల వారికి నో బ్యాగ్ డే కింద ప్రకటించి ఆ రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో విద్యార్థులకు తెలియజేస్తారన్నారు. ఇందుకుగాను క్షేత్ర స్థాయిలో ఒక మునిసిపల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులను పరీక్షించిన అనంతరం నో బ్యాగ్ డే నాడు ప్రణాళికలు రూపొందిస్తారన్నారు. ఆబ్జెక్టివ్ బే‹స్డ్ ఎగ్జామ్స్: మునిసిపల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు తనూజ్ పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఈవీఎస్ తదితర సబ్జెక్టులకు సంబంధించి ఓఎంఆర్ షీట్లను అందించి బబ్లింగ్ విధానం ద్వారా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు మూడుసార్లు ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్స్ నిర్వహించామని, మంచి ఫలితాలు సాధించిన మునిసిపల్ పాఠశాలలకు ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 56 మునిసిపల్ పాఠశాలల్లోని విద్యార్థులకు అధునాతన పద్ధతుల్లో పాఠాలు చెప్పేందుకు డిజిటల్ బోర్డులు ఇచ్చారన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి మూడు ప్రాథమిక పాఠశాలలు, 12 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోర్డుల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లోని మునిసిపల్ పాఠశాలల్లో దాదాపు రూ.20 కోట్ల విలువైన బెంచిలు అందించినట్లు తెలిపారు. 10/10 టార్గెట్ 1500: రాష్ట్రంలోని మునిసిపల్ ఉన్నత పాఠశాలల్లో రానున్న మార్చి ఫలితాల్లో 1500 మంది విద్యార్థులకు తగ్గకుండా 10/10 జీపీఏ సాధించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తనూజ్ స్పష్టం చేశారు. 2015–2016లో కేవలం 11 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారని, 2016–2017 సంవత్సరంలో 49 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారని, ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన ఫలితాల్లో 308 మంది 10/10 జీపీఏ సాధించారన్నారు. వచ్చే మార్చిలో జరగనున్న పరీక్షల్లో 1500 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు. -
విచిత్ర చదువులు... వింతైన పరీక్షలు
ఏ విద్యా సంస్థలోనైనా విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రభుత్వం విడుదల చేసిన మెటీరియల్, పుస్తకాలను పరిశీలించి అవసరమయితే వాటిపై శిక్షణ తీసుకుని పిల్లలకు బోధించాకే కదా... కానీ పుస్తకాలు, మెటీరియల్ పాఠశాలలకు ఇవ్వకుండానే బొబ్బిలిలోని పురపాలక పాఠశాలల్లో ఐఐటీ కోర్సులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ర్యాంకులు ఇస్తున్నారు. వీటిని రాష్ట్ర స్థాయిలో అప్లోడ్ చేస్తున్నారు. అసలు ఈ ర్యాంకులేమిటో... ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో... విద్యార్థులకే తెలియడం లేదు. ఇదీ మునిసిపాలిటీల్లో అనుసరిస్తున్న విద్యా విధానం. బొబ్బిలి: పురపాలక సంఘాల పరిధిలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు ఇటీవల ప్రారంభించారు. ఈ కోర్సులకు సంబంధించిన మెటీరియల్ అందకపోయినా పిల్లలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గురువారం రెండో స్పెల్‌లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి పరీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులకు పరీక్షలు జరుగుతున్నాయి. మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం ఎత్తివేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆయా పాఠశాలల్లో విద్యార్థులను ఉన్నత ప్రయోజకుల్ని చేస్తామని ఐఐటీ ఫౌండేషన్ కోర్సులను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రతీ పాఠశాలలోనూ సాధారణ తరగతులు ప్రారంభించే గంట ముందు, ముగిసిన తరువాత ఓ గంట పాటు శిక్షణ పొందేందుకు ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఈ ఐఐటీ కోర్సుల్లో చేర్పించింది. జిల్లాలో 1688మంది ఎంపిక జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 1688 మంది విద్యార్థులను ఐఐటీ కోర్సుల్లో చేర్పించారు. పార్వతీపురంలోని మూడు పాఠశాలలకు చెందిన 405 మంది, బొబ్బిలిలో రెండు పాఠశాలలకు చెందిన 317, సాలూరులోని రెండు పాఠశాలలకు చెందిన 423, విజయనరంలో మూడు పాఠశాలలకు చెందిన 543 మంది విద్యార్థులు ఈ కోర్సులో చేరారు. వీరికి రోజూ ఉదయం 8.30 గంటల నుంచి, 9.30 వరకూ సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకూ బిట్లు ప్రాక్టీసు చేయడం, అడ్వాన్స్డ్ కోర్సులను చెప్పడం, కెరీర్ ఫౌండేషన్ సిలబస్‌ను అవలోకనం చేయడం వంటివి చేయాలి. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు 10 నుంచి 20 మంది బోధకులను ఎంపిక చేసి వారికి గంటకు రూ. 250ల చొప్పున చెల్లించి ఉన్నత ప్రమాణాలు బోధించాల్సి ఉంది. దీనికి సంబంధించి విడతల వారీగా మెటీరియల్, పుస్తకాలు ఇవ్వాలి. కానీ బొబ్బిలిలోని రెండు పురపాలక పాఠశాలల్లోనూ ఈ మెటీరియల్ ఇవ్వలేదు. పరీక్షలు మాత్రం నిర్వహించేశారు. గురువారం సాయంత్రం రెల్లివీధిలోని పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాల, గొల్లపల్లిలోని వేణుగోపాల ఉన్నత పాఠశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్టు కో–ఆర్డినేటర్, హెచ్ఎంలు స్వయంగా విలేకర్లకు తెలిపారు. ఇవీ కారణాలు... పాఠశాలలకు మెటీరియల్, పుస్తకాలు ఇవ్వకుండా పరీక్షలు నిర్వహించడానికి కారణం ఏమిటని ఆరా తీస్తే మున్సిపల్ చైర్పర్సన్ అందుబాటులో లేరని కో–ఆర్డినేటర్ ఎ.శ్రీనివాసరావు తెలిపారు. అలాగే తాను కూడా గుంటూరులో జరిగిన సమావేశానికి వెళ్లాల్సి వచ్చిందని, శుక్రవారం లేదా శనివారం పుస్తకాలను ఆయా పాఠశాలలకు ఇచ్చేస్తామని చెప్పుకొచ్చారు. జూలైలో ప్రారంభించిన ఈ శిక్షణకు సంబంధించి ఇప్పటికి రెండు స్పెల్స్‌లో పుస్తకాలు రావాల్సి ఉండగా ప్రారంభంలో ఒక స్పెల్ పుస్తకాలు ఇచ్చారు. ఇప్పుడు రెండో స్పెల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి మూడో స్పెల్ కూడా తరగతులు ప్రారంభమయ్యే సమయం వచ్చేసిందని స్థానికులు చెబుతున్నారు. -
కార్పొరేట్‌కు దీటుగా ఫలితాలు సాధించాలి
నెల్లూరు సిటీ: కెరీర్ ఫౌండేషన్ కోర్సుల్లో చేరి కార్పొరేట్‌కు దీటుగా విద్యార్థులు ఫలితాలను సాధించాలని మేయర్ అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. వెంగళరావునగర్‌లోని నగరపాలక ఉన్నత పాఠశాలను గురువారం పరిశీలించారు. త్రిపుల్ ఐటీకి పాఠశాల నుంచి ఎంపికైన విద్యార్థి భానుప్రసాద్‌కు రూ.ఐదు వేలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 415 మంది విద్యార్థులకు గానూ 13 మందే ఉపాధ్యాయులు ఉన్నారని, త్వరలో విద్యావలంటీర్లను నియమించనున్నట్లు చెప్పారు. కార్పొరేటర్లు పెంచలనాయుడు, రాజానాయుడు, పిట్టి సత్యనాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
ముంబై స్కూళ్లలో భగవద్గీత బోధన
ముంబై: ముంబై మున్సిపల్ స్కూళ్లలో ఇకపై భగవద్గీత బోధించనున్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడానికి, వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి, వారిని ఆధ్యాత్మికతవైపు నడిపించడానికి భగవద్గీత ఎంతో ఉపకరిస్తుందని గ్రేటర్ ముంబై మున్సిపల్ అధికారి ఒకరు పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా పిల్లల్లో విఙ్నానం అభివృద్ధి చెందుతుందని, తద్వారా వారి నిర్ణయాత్మక శక్తి పెరుగుతుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ కృష్ణ సొసైటీ (ఇస్కాన్) నిర్వహించిన 'గీతా ఛాంపియన్స్ లీగ్' కార్యక్రమంలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మన పిల్లలే మన భవిష్యత్తు అని ఆయన తెలిపారు. మనం వారిలోని నైపుణ్యాలను పెంపొందించాలి. టీవీ, సినిమా, ఇంటర్నెట్ లు పిల్లలను హింస, అపరిశుభ్రతవైపు నడిపిస్తాయి. అంతేకాకుండా వాటివల్ల పిల్లల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయని ఇస్కాన్‌కు చెందిన రాధాగోపీనాథ్ దేవాలయ ఆధ్యాత్మిక గురువు రాధానాథ్ స్వామి తెలిపారు. -
వసతులు కనుమరుగు
బాలికోన్నత పాఠశాలల్లో దీనస్థితి నిబంధనల మేరకు ఒక్కటీ లేదు! వారంతా కౌమార దశలో ఉన్న విద్యార్థినులు. తెరచాటు తప్పనిసరి. శుభ్రతకు పెద్దపీటవేయాలి. నిరంతర నీటి సరఫరా(రన్నింగ్ వాటర్) ఉండాల్సిందే. నిబంధనల మేరకు బాలికోన్నత పాఠశాలల్లో సగటున ప్రతి 20 మంది విద్యార్థినులకు ఒక యూనిట్(మూత్రశాల, మరుగుదొడ్డు) చొప్పున మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. జిల్లాలోని బాలికోన్నత పాఠశాలల్లో ఎక్కడా ఈ స్థాయిలో వసతులున్న దాఖలాల్లేవన్నది నిర్వివాదాంశం. దీంతో గంటల తరబడి ఉగ్గపట్టి ఉండడంతో యూరినల్, గైనిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 24 వేల మంది విద్యార్థినుల దీన పరిస్థితిదీ. ల్లాలో అన్ని యాజమాన్యాల్లో కలిపి 63 బాలికోన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 13 జిల్లా పరిషత్ అధీనంలో ఉన్నాయి. గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, రెసిడెన్షియల్ కేటగిరీల్లో నిబంధనల మేరకు కాకపోయినా.. కొన్ని చోట్ల విద్యార్థినుల సంఖ్య పెద్దగా లేకపోవడంతో.. ఉన్న కాస సౌకర్యాలు కొద్దోగొప్పోసరిపోతున్నాయి. అనకాపల్లిలోని రెండు మున్సిపల్ స్కూళ్లతోపాటు, 13 జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మాత్రం పరిస్థి దయనీయంగా ఉంది. 13 జెడ్పీ బాలికోన్నత పాఠశాలల్లో 5956 మంది విద్యార్థినులున్నారు. వీరికి నిబంధనల మేరకు 290 మరుగుదొడ్లు కావాలి. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి(40:1) ప్రకారం చూసుకున్నా.. 150 మరుగుదొడ్లు తప్పనిసరి. అయితే వీటిలో 50కి మించి లేవు. చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట హైస్కూళ్లలో కొత్తగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, నిరంతర నీటి సరఫరా సౌకర్యం ఉండటంతో కాస్త ఇబ్బందులు తొలిగాయి. నక్కపల్లి, కోటవురట్ల, క్వీన్‌మేరీస్, వి.మాడుగుల తదితర హైస్కూల్లోనైతే ఉన్న కొద్దిపాటి మరుగుదొడ్లలోనే టీచర్లు, విద్యార్థినులు సర్దుకుపోవాల్సిన దుస్థితి. కొన్ని చోట్ల టీచర్లు తమ మరుగుదొడ్లకు తా ళాలు వేసుకోవడంతో.. విద్యార్థులు ఆరుబ యటికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనల మేరకు పాఠశాల నిర్వహణ ని దుల నుంచి మరుగుదొడ్లు శుభ్రపరిచేందుకు పనివాళ్లను నియమించాలి. అయితే జిల్లాలో ఏ పాఠశాలలోనూ ఈ పరిస్థితి కానరావట్లేదు. -
బకాయిల బడి!
సాక్షి, ముంబై: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా కార్పొరేషన్ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెబుతున్న బీఎంసీ అధికారులు, ఆచరణలో విఫలమవుతున్నారు. కొత్త హంగుల సంగతి దేవుడెరుగు... పాఠశాలల్లో ఆరేళ్ల కిందటే కల్పించిన సదుపాయాల నిర్వహణపై ఏమాత్రం శ్రద్ధ పెట్టకపోవడంతో అవి కూడా కనుమరుగువుతున్నాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలో మొత్తం 1,074 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4.36 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 2006-07 విద్యాసంవత్సరంలో పిల్లల సౌకర్యార్థం ఈ పాఠశాలలకు ల్యాండ్ లైన్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల గురించి, వారి తల్లిదండ్రులకు ఏదైనా సమాచారం ఇవ్వడానికి ఫోన్ ఉపయోగపడుతుందని, అలాగే పిల్లల్లో విజ్ఞానం పెంపొం దించడానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని అప్పట్లో బీఎంసీ అధికారులు ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. అయితే ఫోన్, ఇంటర్నెట్ బిల్లులు చెల్లిం చేందుకు బీఎంసీ ఎటువంటి నిధులు కేటాయించలేదు. దాంతో వాటి బిల్లుల బకాయిలు పేరుకుపోవడంతో కొన్నాళ్లకు సుమారు 90 శాతం పాఠశాలల్లో టెలిఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లను తొల గించారు. దీంతో అత్యవసర సమయాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారర చేరవేసేందుకు తమ సొంత మొబైల్ ఫోన్‌ను ఉపయోగించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఇలా రోజుకు వంద ఫోన్లు చేయాల్సిరావడంతో తమకు ఆర్థికంగా భారం పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేదంటే విద్యార్థుల ఇళ్లకు వెళ్లాల్సి వస్తోందని వడాలాలో ఉన్న నద్కర్నిరోడ్ మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రద్ధాజాదవ్ పేర్కొన్నారు. ఈ విషయమై డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ (విద్య) సునీల్ ధామ్నే మాట్లాడుతూ.. కార్పొరేషన్ పాఠశాలలు ఫోన్, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించనందునే చాలా పాఠశాలల్లో కనెక్షన్లు తొలగించారని తెలిపారు. అయితే ఫోన్ బిల్లుల బకాయిల చెల్లింపునకు బీఎంసీ నిర్ణయించిందని ధామ్నే వివరించారు. అన్ని పాఠశాలలకు చెందిన బిల్లు బకాయిల వివరాలను వార్డుల వారీగా తమకు అందజేయాలని కోరినట్లు చెప్పారు. అలాగే ఆయా పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్లను కూడా పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. -
భవిష్యత్లోనియమితులయ్యే టీచర్లూ అనర్హులే