
తనూజ్
ఒంగోలు టౌన్: ‘‘అర్బన్ ప్రాంతాల్లోని మునిసిపల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాం. పాఠశాల స్థాయిలోనే ప్రతి విద్యార్థికి భవిష్యత్‌లో ఏం కావాలో ముందుగానే తెలుసుకుంటాం. దానికి అనుగుణంగా ప్రోత్సాహం అందిస్తాం. యాక్టివిటీ బేసిక్ లెర్నింగ్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తాం. సెట్ యువర్ గోల్ పేరుతో ఆ విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలిచేందుకు కృషి చేస్తామని’’ మునిసిపల్ పాఠశాలల ఫౌండేషన్ కోర్సు స్టేట్ కన్సల్టెంట్ వీ తనూజ్ వెల్లడించారు. ఒంగోలు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని పాఠశాలల్లో నో బ్యాగ్ డేను పరిశీలించేందుకు శుక్రవారం ఆయన ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 59 మునిసిపాలిటీల్లోని 1756 మునిసిపల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదువుతున్న లక్షా 36 వేల మంది విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. నెలలోని నాలుగు శుక్రవారాల్లో రెండు శుక్రవారాలను ఒకటి నుంచి మూడు తరగతుల వారికి, మిగిలిన రెండు శుక్రవారాలను నాలుగు, ఐదు తరగతుల వారికి నో బ్యాగ్ డే కింద ప్రకటించి ఆ రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో విద్యార్థులకు తెలియజేస్తారన్నారు. ఇందుకుగాను క్షేత్ర స్థాయిలో ఒక మునిసిపల్ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులను పరీక్షించిన అనంతరం నో బ్యాగ్ డే నాడు ప్రణాళికలు రూపొందిస్తారన్నారు.
ఆబ్జెక్టివ్ బే‹స్డ్ ఎగ్జామ్స్: మునిసిపల్ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు తనూజ్ పేర్కొన్నారు. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఈవీఎస్ తదితర సబ్జెక్టులకు సంబంధించి ఓఎంఆర్ షీట్‌లను అందించి బబ్లింగ్ విధానం ద్వారా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు మూడుసార్లు ఆబ్జెక్టివ్ బేస్డ్ ఎగ్జామ్స్ నిర్వహించామని, మంచి ఫలితాలు సాధించిన మునిసిపల్ పాఠశాలలకు ర్యాంకింగ్‌లు ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని 56 మునిసిపల్ పాఠశాలల్లోని విద్యార్థులకు అధునాతన పద్ధతుల్లో పాఠాలు చెప్పేందుకు డిజిటల్ బోర్డులు ఇచ్చారన్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి మూడు ప్రాథమిక పాఠశాలలు, 12 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోర్డుల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు బోధిస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లాల్లోని మునిసిపల్ పాఠశాలల్లో దాదాపు రూ.20 కోట్ల విలువైన బెంచిలు అందించినట్లు తెలిపారు.
10/10 టార్గెట్ 1500: రాష్ట్రంలోని మునిసిపల్ ఉన్నత పాఠశాలల్లో రానున్న మార్చి ఫలితాల్లో 1500 మంది విద్యార్థులకు తగ్గకుండా 10/10 జీపీఏ సాధించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తనూజ్ స్పష్టం చేశారు. 2015–2016లో కేవలం 11 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారని, 2016–2017 సంవత్సరంలో 49 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారని, ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన ఫలితాల్లో 308 మంది 10/10 జీపీఏ సాధించారన్నారు. వచ్చే మార్చిలో జరగనున్న పరీక్షల్లో 1500 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment