సాక్షి, ఒంగోలు: పెద్ద హీరోలు, నిర్మాతల ధన దాహంతో తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ప్రేక్షకులపై అధిక భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా–అందరికీ అందుబాటులో సినిమా టికెట్లు’ అనే అంశం మీద ఒంగోలు వీకేబీ ఫంక్షన్ హాల్లో బుధవారం చర్చా వేదిక నిర్వహించారు.
ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సినీ పెద్దలు కొందరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లను లీజుకు తీసుకుని సాధారణ థియేటర్లకు సైతం మలీ్టప్లెక్స్ కలరింగ్ ఇచ్చి అడ్డగోలుగా రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటున్నారని ఆరోపించారు. షోలను నియంత్రించడం, ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం లాంటి ప్రభుత్వ నిర్ణయాలను ప్రేక్షకులు సంతోషంగా స్వాగతిస్తున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హర్షిస్తోందన్నారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. చిత్ర నిర్మాత సి.ప్రవీణ్‌కుమార్, సినీ ప్రదర్శకులు అయినాబత్తిన ఘనశ్యాం, షాజహాన్, ఎండీ సాహుల్, సూపర్‌బజార్ చైర్మన్ తాతా బద్రి, షౌకత్ ఆలీ, వరదా నాగేశ్వరరావు, పావులూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment