kethireddy jagadishwar reddy
-
మన సినిమాలకు నార్త్‌లోనే ఎక్కువ కలెక్షన్స్.. అది మర్చిపోవద్దు!
దక్షిణాది, ఉత్తరాది అంటూ సినిమా ఇండస్ట్రీలో భేదాలు చూపడం సరికాదంటున్నాడు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి. సినిమా పట్ల వివక్ష చూపడం సరికాదని సూచించారు. తాజాగా ఈయన మాట్లాడుతూ..మనం ఎక్కువ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాం. దక్షిణాది సినిమాలకు ఉత్తర భారత దేశంలోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి. ఉదాహరణకు ఇటీవల రిలీజ్ అయ్యిన పుష్ప 2 దక్షిణాది కంటె ఉత్తరాదిలోనే ఎక్కువ వసూళ్లు రాబట్టింది.భారతదేశంలో అత్యధిక థియేటర్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. దేశంలో మొత్తం 6,877 థియేటర్లు ఉండగా, అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక థియేటర్లు 1,097 ఉన్నాయి. ఏపీ తర్వాత తమిళనాడులో 943, కర్ణాటకలో 719, మహారాష్ట్రలో 703, తెలంగాణలో 485 థియేటర్లు ఉన్నాయి.టాప్ 5లో నాలుగు దక్షిణాది రాష్ట్రాలకే చోటు దక్కడం విశేషం. దక్షిణాదిలో దాదాపు 3,700 థియేటర్లు ఉన్నప్పటికీ ..రెవెన్యూ పరంగా 3,200 థియేటర్స్ ఉన్న ఉత్తరాదిన ఎక్కువ గా వసూళ్లు వచ్చాయి. ఇది మనం గమనించాలి.సినిమా పరిశ్రమ అంటేనే ప్రేక్షకులకు వినోదం పంచడం. దక్షిణాది, ఉత్తరాది అంటూ వేరు వేరుగా చూడకూడదు. సౌత్, నార్త్ సినిమాలన్నీ భారతీయ చిత్ర పరిశ్రమలో భాగమని గుర్తించాలి అని కోరారు -
ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా టికెట్ రేట్లపై నిర్ణయం తీసుకోవాలి: కేతిరెడ్డి
హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ వివాదం చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పరోక్షంగా అల్లు అర్జున్‌పై విమర్శలు చేశారు. తాను సీఎంగా ఉన్నంతవరకు ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉందని ఖరాఖండీగా చెప్పారు. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే తెలంగాణ ఫిల్మ్ ఛాంజర్ స్వాగతించగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కూడా స్వాగతించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.ఏ సినిమాలకు బెనిఫిట్ షో ఉండవని ముఖ్యమంత్రి ప్రకటన చేయడం హర్షాదాయకం. ఈ నిర్ణయంపై సగటు ప్రేక్షకులు, పరిశ్రమను నమ్ముకున్న ఎందరో తమ సంతోషం వ్యక్తపరిచారు. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ కూడా ఈ నిర్ణయం ఎంతో సంతోషం కలిగించింది. ఇన్నేళ్లు అధికారంలోని ప్రభుత్వాలు పెంచిన ధరల వల్ల థియేటర్లుకు వచ్చే ప్రేక్షకులు తగ్గారు. ఇప్పుడు ఈ నిర్ణయం వలన సగటు ప్రేక్షకుడు సినిమా థియేటర్లకు కుటుంబ సభ్యులతో సంతోషంగా వస్తారు.అలానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకొని చలనచిత్ర పరిశ్రమ ఉనికిని కాపాడాలి. ఒక కుటుంబం.. సినిమా అనే వినోదాన్ని సగటు ధరలను చెల్లించి చూసే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతి సినిమాకు రేట్స్ పెంచే విధానానికి స్వస్తి పలకాలి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేలా కొన్ని మార్గదర్శకాలు నిర్ధేశించుటకు.. నిపుణుల కమిటీని నియమిచి అ తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కేతిరెడ్డి కోరారు. -
జానీ మాస్టర్‌కి అవకాశాలు ఇవ్వొద్దు : కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వైధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిదే. బాధితురాలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అనంతరం ఆ కేసును నార్సింగి పోలీసులకు అప్పగించారు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చెపట్టారు. ప్రస్తుతం జానీ వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫిలిం ఛాంబర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వివాదంపై స్పందించారు. జానీ మాస్టర్‌పై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: త్రివిక్రమ్‌పై ఆరోపణలు.. పూనమ్ షాకింగ్ ట్వీట్)తాజాగా ‘తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కూడా ఈ వివాదంపై స్పందిస్తూ.. జానీ మాస్టర్‌కి ప్రకటించిన జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డును విచారణ ముగిసేవరకు ఆపాలని కమిటీకి విజ్ఞప్తి చేశారు. ఇలాంటివి జరిగినప్పుడు స్పందించడం మాత్రమే కాకుండా..శాశ్వత పరిష్కారం దిశగా చిత్ర పరిశ్రమ పెద్దలు అడుగులు వేయాలని కోరారు. (చదవండి: జానీ మాస్టర్ వివాదంపై ఫిలిం ఛాంబర్ ఏం చెబుతుందంటే..?)షూటింగ్ జరిగే ప్రదేశాలలో సీసీ టీవీలు ఏర్పాటు చేసి..ఇలాంటి వేధింపు ఉండకుండా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు లైగింక వేధింపు కేసు తేలేవరకు జానీ మాస్టర్‌కు చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదని నిర్మాతలను కోరారు. డాన్స్ మాస్టర్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జానీ మాస్టర్ని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని ఫిలిం ఛాంబర్‌కు విజ్ఞప్తి చేశారు. -
బిగ్‌బాస్ షోలో ఏముందో తెలుసుకుంటాం
సాక్షి, అమరావతి : బిగ్‌బాస్ రియాలిటీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు అందులో ఏముందో తెలుసుకునేందుకు తామూ రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని హైకోర్టు తెలిపింది. ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా ఈ షో ప్రసారమవుతోందని పిటిషనర్ ఆరోపిస్తున్నందున, ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేర కు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అశ్లీల, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తున్న బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో, ఇటీవల దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఇటీవల నెగెటివ్ ప్రచారం (నిర్వాహకులే ప్రచారం కోసం వివాదం సృష్టించడం) చేసుకోవడం ఎక్కువైందని, ఈ వ్యాజ్యం కూడా అందులో భాగమే అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. అలాంటిదేమీ లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి చెప్పారు. ఎలాంటి సెన్సార్షిప్ లేకుండా బిగ్‌బాస్ షో ప్రసారం అవుతోందన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిశీలించాలని కోరారు. ఈ పోటీలో పాల్గొనే మహిళలకు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు తాము కూడా రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. -
తిరుత్తణి ఆలయంలో కేతిరెడ్డి పూజలు
సాక్షి, చెన్నై: పది నెలల పాలనలోనే.. పదేళ్ల ప్రగతి ముఖ్యమంత్రి అనే నినాదంతో సీఎం స్టాలిన్ పరిపాలనను కీర్తిస్తూ తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి తిరుత్తణి సుబ్రమణ్య స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి బంగారు రథాన్ని లాగారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టారు. వెంకటేశ్ నాయుడు, భూపతి, దేవయ్య లింగయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం తమిళనాడును అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి నిరంతర కృషి చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో తమిళనాడు రాష్టం రాబోయే కాలంలో దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కలిసి.. తమిళనాడులో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో 40కి 40 స్థానాల్లో స్టాలిన్‌ను గెలిపించాలన్నారు. సీఎం స్టాలిన్‌ను దేశానికి ప్రధానిని చేసి దక్షిణాది నాయకత్వంలో దేశాన్ని ముందుకు తీసుకొనే ప్రయత్నం చేయాలని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఆకాంక్షించారు. -
తెలుగు వారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
సాక్షి, చెన్నై: తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పాలనను కీర్తిస్తూ ‘10 నెలల్లో పది సంవత్సరాల ప్రగతి’ పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చెన్నైలోని పూనమల్లే హైరోడ్డులోని పుల్లారెడ్డిపురంలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో తమిళనాడును ముందుకు తీసుకెళ్లేందుకు నిరంతర కృషి చేస్తున్నారని ప్రశంసించారు. దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో తమిళనాడు రాష్టం అగ్రగామిగా నిలుస్తోందన్నారు. కొంతకాలంగా తమిళనాడులో నివసిస్తూ తమిళులుగా మమేకమైన తెలుగు వారిని కొన్ని పార్టీలు, పత్రికలు, సోషల్ మీడియా కేంద్రంగా పని చేసే ఛానళ్ళు ద్వేషించడం మాత్రమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. శేషాచలం అడవుల్లో కలప దొంగల్ని ఎన్కౌంటర్ చేస్తే చెన్నైలో ఆంధ్ర సంఘం మీద దాడి చేయించారని, ఇలాంటివి పునరావృతం కాకుండా తెలుగు వారిని కాపాడుటకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చర్యలు తీసుకోవాలని కోరారు. -
బిగ్‌బాస్ లాంటి షోలతో యువత పెడదారి పడుతోంది: హైకోర్టు
సాక్షి, అమరావతి: బిగ్‌బాస్ వంటి చెత్త రియాలిటీ షోల వల్ల యువత పెడదారి పడుతోందని ఏపీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి షోలతో సమాజంలో ప్రమాదకర పోకడలు పెరిగిపోతున్నాయంది. ఇలాంటి వాటిని ఎవరూ అడ్డుకోవడం లేదని, సమాజం ఎటుపోతోందో అర్థం కావడం లేదని అభిప్రాయపడింది. బిగ్‌బాస్ షోను నిలిపేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై వచ్చేనెల 2న విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి సెన్సార్షిప్ లేకుండా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలు యువతను తప్పుదోవపట్టిస్తున్నాయని, ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. (క్లిక్: పట్టణాల్లో ఫిర్యాదులపై ప్రత్యేక వ్యవస్థ!) జగదీశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి శుక్రవారం జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘మంచి వ్యాజ్యం దాఖలు చేశారు. బిగ్‌బాస్ లాంటి చెత్త షోల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయి. యువత పెడదోవ పడుతోంది. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అసభ్యత, అశ్లీలతను పెంచేస్తున్నాయి. అనర్థాలకు దారితీసే ఈ కార్యక్రమాల వల్ల సమాజం పాడవుతుందన్న విషయాన్ని అందరూ గుర్తెరగాలి’ అని వ్యాఖ్యానించింది. (క్లిక్: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు) -
మూవీ టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయం మంచిదే: టీఎఫ్‌పీసీ అధ్యక్షుడు
సాక్షి, ఒంగోలు: పెద్ద హీరోలు, నిర్మాతల ధన దాహంతో తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ప్రేక్షకులపై అధిక భారాన్ని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా–అందరికీ అందుబాటులో సినిమా టికెట్లు’ అనే అంశం మీద ఒంగోలు వీకేబీ ఫంక్షన్ హాల్లో బుధవారం చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సినీ పెద్దలు కొందరు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనేక థియేటర్లను లీజుకు తీసుకుని సాధారణ థియేటర్లకు సైతం మలీ్టప్లెక్స్ కలరింగ్ ఇచ్చి అడ్డగోలుగా రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటున్నారని ఆరోపించారు. షోలను నియంత్రించడం, ఆన్లైన్లో టికెట్ల విక్రయం లాంటి ప్రభుత్వ నిర్ణయాలను ప్రేక్షకులు సంతోషంగా స్వాగతిస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలను తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హర్షిస్తోందన్నారు. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనను పలువురు ప్రముఖులు ఘనంగా సత్కరించారు. చిత్ర నిర్మాత సి.ప్రవీణ్‌కుమార్, సినీ ప్రదర్శకులు అయినాబత్తిన ఘనశ్యాం, షాజహాన్, ఎండీ సాహుల్, సూపర్‌బజార్ చైర్మన్ తాతా బద్రి, షౌకత్ ఆలీ, వరదా నాగేశ్వరరావు, పావులూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అఖండ బెనిఫిట్ షోల పేరుతో దోపిడీ
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురానున్న ఆన్లైన్ టిక్కెట్ విధానం కంటే ముందు విడుదలవుతున్న సినిమా ద్వారా టికెట్లను అధిక ధరలకు అమ్మి ప్రేక్షకులను దోపిడీ చేయుచున్నారని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెనిఫిట్ షోలంటూ ఉండవని.. ఒకే ఒక బెనిఫిట్ షో మాత్రమే ఉంటుందని తెలిపారు. కానీ ప్రస్తుతం ఏపీలో చారిటీ పేరుతో ఉదయం 6 గంటలకు, 9 గంటలకు బెనిఫిట్ షోలు వేస్తూ వాటిని రూ.600 అమ్ముతున్నారని చెప్పారు. చాలా రోజులుగా చిన్న నిర్మాతలు, కార్మికులు పడుతున్న కష్టాలను గ్రహించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఆన్లైన్ టిక్కెట్ విధానం, రోజుకు 4 ఆటల ప్రదర్శన చిత్ర పరిశ్రమ బాగు కొరకు, ప్రజలు సినిమా టిక్కెట్స్ కొనుగోలులో దోపిడీ కాకుండా ఉండటం కోసం ప్రవేశ పెట్టారని తెలిపారు. డిసెంబర్ 2న విడుదలయ్యే ‘అఖండ’ సినిమాను ప్రత్యేక ప్రదర్శనతో పాటు.. ఉదయం 6 గంటలకు, 9 గంటలకు ప్రదర్శనకు టికెట్స్ స్వచ్ఛంద సంస్థల పేరుతో పోస్టర్స్ ముద్రించి టిక్కెట్స్ కావలసినవారు సంప్రదించవల్సిన నంబర్లని తెలియచేస్తూ వాట్సప్ గ్రూపులలో పెట్టి అమ్మతున్నట్లు ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటనే చర్యలు తీసుకొని ఆ సినిమా థియేటర్ టికెట్లను రెవెన్యూ, హోం శాఖ ద్వారా బుకింగ్స్‌లో అమ్మేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. -
సీఎం జగన్‌కు నిర్మాత కేతిరెడ్డి ధన్యవాదాలు
సాక్షి, అమరావతి: గత కొన్ని ఏళ్లుగా పరిశ్రమలోని ఇష్టం వచ్చిన రేట్లకు సినిమా టిక్కెట్లు అమ్మడాన్ని చిన్న నిర్మాతలు వ్యతిరేకిస్తూ వస్తున్నారని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. అసెంబ్లీలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవవరించినందుకు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వలు చిన్న నిర్మాతల కోర్కెలను పెడచెవిన పెట్టడం జరిగిందని.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన స్లాబ్ సిస్టమ్‌ను రద్దు చేశారని తెలిపారు. ఇప్పుడు ఆయన తనయుడు సీఎం జగన్ సినిమా చూసే ప్రేక్షకులకు గతంలో సినిమా పెనుభారంగా ఉందన్న విషయాన్ని గుర్తించి ఆన్లైన్ ద్వారా టిక్కెట్స్ అమ్మకాలను తీసుకువచ్చారని అన్నారు. అదేవిధంగా 4 ఆటలు మించి ప్రదర్శన చేయకుండా ఉండేందుకు సినిమాటోగ్రఫీ యాక్టును సవరించి అసెంబ్లీలో ప్రవేశ పెట్టడం చిన్న సినిమా నిర్మాతలు, పరిశ్రమకు ఓ వరమని పేర్కొన్నారు. సినిమాలో ఉన్న సెలబ్రిటీల కంటే తనకు ప్రజలే ముఖ్యమని ఈ చట్టం ద్వారా తెలియచేయడం సీఎం జగన్ పరిపాలనా దక్షతకు నిదర్శనమని చెప్పారు. ఇటు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు.. అటు నిర్మాతలు ఈ నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కొంతమంది ప్రయోజనల కోసం కాకుండా ఈ నిర్ణయంతో కోట్లాది సినీ ప్రేక్షకులకు సీఎం జగన్ ఓ ఆణిముత్యం అయ్యారని చెప్పారు. తిరిగి తెలుగు సినీ పరిశ్రమ వైభవంగా ముందుకు సాగుతుందని, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చట్ట సవరణ చేసి పరిశ్రమ అభివృద్ధికి దోహదపడాలని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఓ ప్రకటనలో కోరారు. -
ఆన్లైన్ టికెట్ విధానాన్ని స్వాగతించాలి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ సినిమా టికెట్ విధానాన్ని ప్రతిపక్షాలు, సినీ ఇండస్ట్రీ స్వాగతించాలని, ప్రజల మేలు కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడు, తమిళనాడు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు. వినోదం పేరుతో ప్రజలను దోపిడీకి గురిచేయడం ఎంతవరకు న్యాయమని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. సినిమా టికెట్లు విచ్చలవిడిగా అమ్మే దోపిడీని అరికట్టకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు కచ్చితంగా వచ్చేదని వెల్లడించారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల్లో పెట్టిపోతే.. సీఎం వైఎస్ జగన్ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. -
ప్రజారోగ్యాన్ని రాష్ట్రాలకు వదిలేయడం సరికాదు: కేతిరెడ్డి
చెన్నై: దేశంలో జాతీయ విపత్కర పరిస్థితి ఏర్పడిన సందర్భంలో ప్రజారోగ్యం పట్ల శ్రద్ధవహించాల్సిన కేంద్రం కరోనా నియంత్రణను రాష్ట్రాలకు అప్పగించడం ఎంతవరకు సరైనదని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్ది ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 'స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ మన దేశంలో విద్య, వైద్య రంగాలలో ఇప్పటికీ పరిస్థితులు మెరుగుపడలేదు. ప్రస్తుత ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్న ప్రభుత్వాలుగాని, ప్రజారోగ్యం, విద్య పట్ల శ్రద్ధ వహించి ఉంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడి ఉండేవి కావు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి మరణాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది. పౌరులు కూడా అప్రమత్తంగా ఉంటూ, కోవిడ్ నిబంధనలను పాటించి ప్రభుత్వానికి అండగా ఉండాలి. కరోనా తీవ్రతను బట్టి అవసరమైతే లాక్‌డౌన్‌ను విధించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. సినీ పరిశ్రమలోని అగ్రనటులందరు కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఆ దిశగా టీవీ మాధ్యమాలు, ప్రింట్, యూట్యూబ్‌లలో ప్రకటనలు ఇస్తూ ప్రజలకు భరోసా కల్పించి తమ వంతు బాధ్యతను నిర్వహించాలి. ఇటువంటి పరిస్థితుల్లో సినీ రంగానికి చెందిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతుసాయంగా నిలవాలని' కేతిరెడ్డి కోరారు. -
జగన్ నిర్ణయం బాగుంది
-
తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్: హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్ 3 తెలుగు రియాలిటీ షోపై దాఖలైన వ్యాజ్యాన్ని తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. బ్రాడ్‌కాస్టింగ్ నిబంధనలకు విరుద్ధంగా బిగ్‌బాస్ షో ప్రసారమవుతోందని, సినిమాలను ఎలాగైతే సెన్సార్ చేస్తారో.. అదేవిధంగా ఈ టీవీ షోను కూడా సెన్సార్ చేసి.. ప్రసారం చేయాలని నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ షో ద్వారా పిల్లలను, యువతను చెడుమార్గంలోకి తీసుకెళ్లే అవకాశముందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఈ రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ ఎంపిక సందర్భంగా మహిళలను లైంగికంగా వేధిస్తున్నారని, కాబట్టి బిగ్‌బాస్ షోను వెంటనే నిలిపేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ షో హోస్ట్ నాగార్జున, స్టార్ మా చానెల్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం కామర్స్, జిల్లా కలెక్టర్, డీజీపీ, హైదరాబాద్ సీపీ, తదితరులను తన పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. సోమవారం ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. -
నా దృష్టిలో సినిమాలూ రాజకీయాలూ ఒక్కటే
లక్ష్మీస్ వీరగ్రంథం, శశిలలిత... ఈ మధ్య చర్చల్లో నిలిచిన చిత్రాల్లో ఈ రెండూ ఉన్నాయి. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ విడుదలకు రెడీ అవుతోంది. ‘శశిలలిత’ షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. ఈ రెండు చిత్రాలకూ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి దర్శక–నిర్మాత. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ‘శశిలలిత’ చిత్రం రూపొందనుంది. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెప్పిన విశేషాలు. ► రెండు వివాదాస్పద సినిమాలను నిర్మించాలనుకున్నప్పుడు ఆయా వర్గాలకు చెందిన వ్యక్తుల నుంచి మీకు బెదిరింపులు ఉండవా? భారత రాజ్యాంగంలోని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, కొన్ని సుప్రీం కోర్టు జడ్జిమెంట్స్ని ఆధారం చేసుకుని ఈ చిత్రకథలను తయారు చేసుకున్నాం. మాకు ఎవరూ శత్రువులు లేరు. ఒకవేళ ఎవరైనా మమ్మల్ని శత్రువులు అనుకుంటే వాళ్లను చట్టపరంగా ఎదుర్కొంటాం. ఆ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. ► మీరు చేసే సినిమాల్లో కొన్ని విడుదల కావు. సినిమాలను ప్రారంభిస్తారు.. కానీ విడుదల చేయరనీ, కేవలం ప్రకటనల వరకే పరిమితం అవుతారని చాలామందికి మీ మీద ఓ అభిప్రాయం ఉంది.. నేను గతంలో రజనీకాంత్, మహేశ్‌బాబు కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని ప్రయత్నించింది నిజమే. కానీ, అది ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. పెద్ద కాంబినేషన్లు కదా.. మనం అనుకున్నవన్నీ సమయానికి జరగవు. అలాగే మనం చేసే ప్రయత్నాలన్నీ జరగాలని లేదు కదా. ► ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ చిత్రాన్ని ముందు మీరే నిర్మించి, తర్వాత వేరే నిర్మాతకు ఇవ్వడానికి కారణం? ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే సినిమాని నావంతు బాధ్యతగా నిర్మించాను. అయితే బెంగళూరుకు చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీనిర్మాత నా వద్ద నుంచి ఆ ప్రాజెక్టుని సొంతం చేసుకున్నారు. ఆ సినిమాకి ఇప్పుడు నేను కేవలం దర్శకుణ్ణి మాత్రమే. ఇక సినిమా విడుదల చేయడమంటారా ఆయన ఇష్టానికే వదిలేశా. ఇప్పుడు అది నా చేతుల్లో లేదు. ► సినిమా రంగంలో ఉంటూనే తమిళనాడులో తెలుగు భాష వికాసానికి పోరాడారు. మీకు ప్రజాసేవ అంటే ఇష్టమా? సినిమా అంటే ఇష్టమా? సినిమాల, రాజకీయాల దృక్పథం ఒక్కటే. సినిమాల్లో డబ్బు పోయినా, రాజకీయాల్లో డబ్బు ఖర్చు అయినా సంతృప్తి చెందుతాం. ఎందుకంటే ప్రజలకు దగ్గరవుతాం. కాబట్టి ఈ రెండు రంగాలు దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తాను. ► మీ రాజకీయ పయనంలో మీకు నచ్చిన నాయకుడు? ‘తాను గెలిచే వరకు.. తాను ఓడిపోలేదు’ అని అనుకున్నవాడే నాయకుడు. నిరంతరం లక్ష్యం దిశగా పోరాటాలు సాగించడం వంటి గొప్ప రాజకీయ లక్షణాలను స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారు, వారి కుమారుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిగారిలో చూశాను. కేసీఆర్గారిలోనూ ఈ లక్షణాలు ఉన్నాయి. రాజకీయాల్లో వారే నాకు మార్గదర్శకులు, స్ఫూర్తి. రాజశేఖర రెడ్డిగారు 25 సంవత్సరాల పోరాటం తర్వాత జయాన్ని పొందారు. అదే విధంగా వారి కుమారుడు జగన్‌గారు పదేళ్ల పోరాటం తర్వాత అద్భుతమైన విజయం అందుకున్నారు. అందుకే నిత్యం పోరాడే వారంటే నాకు ఇష్టం. -
రజత్‌కుమార్‌ను కలిసిన కేతిరెడ్డి
హైదరాబాద్ : తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు మరియు సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ను కలిశారు. మధ్యం తాగి ఓటు వేయకుండా నివారించుటకు బ్రీత్ ఎనలైజర్లను ఏర్పాటు చేయాలని అందుకు తెలుగు రాష్ట్రమైన తెలంగాణనుంచి శ్రీకారం చుట్టాలని వినతి పత్రాన్ని సమర్పించారు. ఆ వినతి పత్రానికి స్పందించిన ఎన్నికల ప్రధాన అధికారి కేతిరెడ్డి ప్రయత్నాన్ని హర్షించారు.ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళతానని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికే మీరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు కాబట్టి కోర్టుద్వారా ఆదేశాలు వస్తే మీ ప్రయత్నం సఫలమవుతుందని అన్నారు. రజత్‌కుమార్‌ను కలసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలలో బ్రీత్ ఎనలైజర్ పరికరాలను ఏర్పాటు చేసి దేశంలోనే ఒక ఆదర్శవంతమైన ఎన్నికల విధానానికి తెలంగాణ శ్రీకారం చుట్టాలని తాను కోరినట్లు చెప్పారు. మధ్య రహిత ఎన్నికల కొరకు న్యాయ పోరాటంతోపాటు ధర్మపోరాటం కూడా తాను చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కమిషన విధంగానే మిగతా రాష్ట్రాల ఎన్నికల అధికారులను త్వరలోనే కలుస్తానని చెప్పారు. ఓటువేసే ఓటరు మధ్యం సేవించి ఓటు హక్కును వినియోగించుకోకుండా చూడాలని తాను సుప్రీం కోర్టును ఆశ్రయించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశానన్నారు. దేశ భవిష్యత్తు ప్రస్తుతం మత్తులో ఉందని, దానిని నివారించే బాధ్యత పౌరులకు ఉందని అందుకు సమర శంఖారావం పూరించి మద్యరహిత భారత నిర్మాణం కొరకు మనందరం కృషి చేయాలని కేతిరెడ్డి పిలుపునిచ్చారు. -
‘మద్యం తాగితే ఓటు వేయనీయొద్దు’
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం సేవించిన వారు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఓటర్లను అనేక ప్రలోభాలకు గురి చేస్తుంటాయని, అందులో మద్యం పంపిణీ ప్రధానమైందని పిల్లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా దిద్దుబాటుకు అడ్డంకి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ముంచుకొస్తున్నా ఓటర్ల జాబితాలో తప్పుల దిద్దుబాటుకు అడ్డంకులు తొలగడం లేదు. ముందస్తు ఎన్నికల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా గత నెల 12న ప్రచురించిన తుది జాబితాలో సాంకేతిక లోపాలతో 1.16 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు పునరావృతమైన విషయం తెలిసిందే. ఈ పేర్లను ఇంతవరకు తొలగించలేకపోయారు. తుది జాబితాను ప్రకటించిన తర్వాత మళ్లీ మార్పులు చేర్పులు జరపడానికి నిబంధనలు అంగీకరించకపోవడంతో పునరావృతమైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్ కుమార్ గత నెల రెండో వారం చివరల్లో సీఈసీకి లేఖ రాశారు. సీఈసీ నుంచి ఇంతవరకు స్పందన లభించకపోవడంతో సీఈ ఓ కార్యాలయ వర్గాలు ఆందోళనకు గురవుతున్నారు. ఇంకా ఓటు హక్కు పొందని వారి నుంచి ఈ నెల 9 వరకు స్వీకరించనున్న దరఖాస్తులను పరిష్కరించి 20 నాటికి రెండో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించేందుకు కసరత్తు జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే.. తుది జాబితాలో పునరావృతమైన పేర్లను తొలగించి రెండో అనుబంధ జాబితాను ప్రచురిస్తామని రజత్ కుమార్ ఇప్పటికే ప్రకటన చేశారు. ఇందుకు సీఈసీ నుంచి స్పందన రాకపోవడంతో తాజాగా ఆయన మరోసారి లేఖ రాశారు. -
‘శ్రీవారి సేవలు ఆన్లైన్ కాదు.. అంతా క్యాష్ లైనే’
సాక్షి, తిరుమల : శ్రీవారి ఆలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి టీటీడీ పాలకమండలిపై విమర్శలు గుప్పించారు. లేని అధికారాన్ని చలాయిస్తున్న పాలకమండలి సభ్యుల తీరువల్ల సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ సేవలు పేరుకు మాత్రమే ఉన్నాయనీ, అంతా క్యాష్‌లైన్ వ్యవహారాలేనని ఆరోపించారు. పాలకమండలి సభ్యులకు కోటా విధానం ఉండడంతో ఆర్జిత సేవ టికెట్లు బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయని ఆరోపించారు. టీటీడీ పాలకమండలి సభ్యులకు ప్రోటోకాల్ విధానం రద్దుచేసి.. వారి కుంటుంబ సభ్యులకు మాత్రమే దర్శనాలు కల్పించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీవేంకటేశ్వరుడి కటాక్షం వల్లనే తన ప్రాణాలు నిలిచాయని చెప్పుకునే చంద్రబాబు తిరుమల కొండపై జరుగుతున్న అక్రమాలపై సీబీఐ దర్యాప్తు కోరాలని అన్నారు. కనీసం రిటైర్డ్ జడ్జితోనయినా విచారణ జరిపించాలని అన్నారు. ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులపై టీటీడీ బోర్డు అనాగరికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. శ్రీకృష్ణ దేవరాలయ కాలంలో మాదిరిగా దర్శనం చేసుకుంటున్న భక్తులను నెట్టివేస్తున్నారని వాపోయారు. ఆపదమొక్కులవాడు.. శ్రీవేంకటేశ్వరుడు తమని ఆదుకుంటాడని భక్తులు కొండకు వస్తుంటే.. దేవుడి నగలు, వజ్రాభరణాలు పోయాయనే ప్రచారం ఇబ్బంది కలిగిస్తోందని అన్నారు. సమాచార హక్కు చట్ట పరిధిలోకి శ్రీవారి ఆలయాన్ని తీసుకురావాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. -
‘రజనీ ప్రకంపనలు ఖాయం’
సాక్షి, చెన్నై: తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ ప్రకంపనలు సృష్టించటడం ఖాయమని ఆ రాష్ట్ర తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. రజనీ రాజకీయ ప్రవేశంపై కేతిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. నూతన రాజకీయ ఒరవడికి రజనీకాంత్ కారణం కాగలరన్నారు. జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళాలను సృష్టించిన బీజేపీకి రజనీ రాజకీయ ప్రవేశం గొడ్డలి పెట్టని తెలిపారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం రజనీ రాజకీయ పార్టీ విజయావకాశాలు తక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. రజనీ స్థాపించిన ఆధ్యాత్మిక పార్టీ నినాదంతో ఆధ్యాత్మికతకి , హిందూయిజనికి ఉన్న తేడాను విమర్శకులు గమనించాలన్నారు. జయలలిత పరిపాలనను ఆదర్శంగా తీసుకొని మెరుగైన పాలనను అందించే నాయకుడి కోసం తమిళనాట ప్రజలు కోరుకుంటున్నారని, అలాంటి పాలనను రజనీ అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తమిళనాడులో ప్రస్తుతమున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రజనీ అడుగులు వేస్తే తప్పక విజయం సాధిస్తారన్నారు. సినీ ప్రముఖులు రాజకీయాల్లో వచ్చినపుడు.. వారు నటించిన చిత్రాల ప్రభావం ఎంతో కొంత ప్రజాకర్షణకు కారణం అవుతాయన్నారు. ఈ క్రమంలో రజనీ తాజా చిత్రం ‘కాల’ కూడా తన రాజకీయ అరంగేట్రానకి అనుగుణంగా ఉపయోగపడే చిత్రంగా ఉండవచ్చని ఆయన అన్నారు. -
శ్రీరెడ్డి సాహసాన్ని మెచ్చుకోవాలి: కేతిరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : మహిళలపై సినీ రంగంలో, కాల్ సెంటర్లలో, ప్రభుత్వ కార్యాలయాలలో లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ముందుకు వచ్చి చెప్పే మహిళల్ని అవహహేళనగా మాట్లాడే వారికి శ్రీరెడ్డి వివాదం చెంపపెట్టు అన్నారు. మహిళా సంఘాలు, సోషల్ వర్కర్స్, ప్రజలు ప్రజా పోరాటాలు చేసి దగాపడిన మహిళకు అండగా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా కాపాడవలసిన భాధ్యత అటు ప్రజలపై ఇటు ప్రభుత్వాలపై ఉందన్నారు. శ్రీరెడ్డికి జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని, గతంలో సుప్రీం కోర్టు సినిమా పరిశ్రమలో మహిళా మేకప్ ఉమన్స్పై పరిశ్రమ బ్యాన్ వివక్షకు వేతిరేకంగా సినీ రంగంపై ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఇదివరకే సుప్రీంకోర్టుకు సినిమా రంగంలో మహిళా వివక్ష గురించి తెలుసుకనుక, ఈ శ్రీరెడ్డి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తామని.. అందుకు శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయాల ఆధారాలను ఇవ్వాలన్నారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే అన్ని విధాలుగా తాను సహాయం చేస్తానన్నారు. గతంలో సినిమా రంగంలో డ్రగ్స్ వాడకంపై సుప్రీంకోర్టులో తాను కేసు వేశానని, ఎందరో మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకొచ్చి చెప్పేందుకు సంకోచిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు షీ టీంలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. సినీ, కార్పొరేట్, కాల్ సెంటర్లో, ప్రభుత్వ రంగ సంస్థలలో మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు ఒక ప్రత్యేక సెల్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కావాలని, సినిమా రంగంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ పోలీసులు సుమోటోగా స్వీకరించి విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఇలాంటివి ఉన్నాయని, కానీ అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేసినారని దైర్యంగా వచ్చి చెప్పే మహిళలు చాలా అరుదని పేర్కొన్నారు. శ్రీరెడ్డి ముందుకు రావటం ఆమె సాహసానికి నిదర్శనం. సినీ రంగంలో ఉన్న ఈ కాస్టింగ్ కౌచ్ మాఫియాపై ఉక్కు పాదం మోపాలని ఫిల్మ్ ఛాంబర్, ‘మా’ అసోసియేషన్ వారి వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకాలన్నారు. శ్రీరెడ్డి చెప్పినట్లు తప్పు చేసింది ఇండస్ట్రీలో పెద్దవాళ్లు అయినప్పటికి కఠిన చర్యలు చేపట్టాలని కేసీఆర్‌కు, హోం శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డీజీపీ వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. -
తమిళనాట కేసీఆర్ యువసేన
టీ.నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మద్దతు తెలుపుతూ తమిళనాట ‘తమిళనాడు కేసీఆర్ యువసేన’ పేరుతో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు ఏర్పాటుచేశారు. యువసేన ప్రారంభోత్సవం చెన్నై ఓఎంఆర్రోడ్డులోని ఎస్వీవీ కల్యాణ మండపంలో ఆదివారం జరిగింది. యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ చెరుకుపల్లి సతీష్ సభకు అధ్యక్షత వహించారు. ఈ ప్రారంభోత్సవానికి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు శ్రీ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతమున్న క్లిష్ట పరిస్థితులను సరిదిద్దే నాయకుడు లేదని, దేశానికి నాయకత్వ లేమి ఉందని అన్నారు. దక్షిణాది నుంచి ఒక విప్లవ నాయకిగా పేరొందిన జయలలిత మరణం తరువాత కేంద్రం దక్షిణాది రాజకీయ పార్టీలను తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు చేసిందన్నారు. ఈ తరుణంలో ఒక వెలుగు కిరణంలా నేనున్నానని చెప్పడమే కాకుండా తమిళనాడు ప్రజలు పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న 39 పార్లమెంటు స్థానాల్లో 37 స్థానాల్లో ఆమె నాయకత్వంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీకి విజయాన్ని ప్రసాదించారని తెలిపారు. అదే విధంగా తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశం అనుకున్నంతగా అభివృద్ధి సాధించలేదని, బీజేపీ కాంగ్రెస్ వారి పాలనతో జరిగిన అభివృద్ధి శూన్యమని, దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే ఒక గుణాత్మకమైన మార్పు కావాలన్న సంకేతంతో కేంద్రాన్ని ఎదిరించారని, జయలలిత బాటలో కేంద్రంపై నిప్పులు చెరిగారన్నారు. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల కోసం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో కలసి ఒక ఫెడరల్ ఫ్రంట్ (మూడవ ఫ్రంట్) దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్ విజయం సాధించడం ఖాయమని ఈ దేశానికి తెలుగువాడి సత్తాను, దిల్‌ను కేసీఆర్ చాటాలని మేమందరం కోరుకుంటున్నామన్నారు. తెలుగు వారు చెన్నై నగర అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నప్పటికీ, ఇక్కడి ప్రభుత్వాలు తెలుగువారిని దిగువ శ్రేణి వారిగా చూడడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కావున తెలుగువారి సమస్యలన్నింటినీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తీరని డిమాండ్లు తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కేసీఆర్‌ను కోరారు. తొలుతగా కేతిరెడ్డి దీపావిష్కరణ చేసి సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి కె.రామకృష్ణ, శ్రీనివాసులు రెడ్డి, కృష్ణతేజ, భరత్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి, తెలుగువారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
‘ద్రావిడులు ఏకం కావాలి’
సాక్షి, చెన్నై : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఉత్తరాది వారి ఆధిపత్యం నడుస్తోందని, వారికి నచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని ఇంటర్నేషనల్ జేఏసీ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలో భాగంగా ప్రత్యేక హోదాపై రెండు జాతీయ పార్టీలు మాట మార్చాయని అన్నారు. దీనిపై ద్రావిడులందరూ కలసి పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. దానిలో భాగంగా విశాఖపట్టణంలో తలపెట్టిన ‘సాగర తీరాన హోదా ఉద్యమ కెరటం’ సమావేశానికి రావాల్సిందిగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి, స్పీకర్ వైద్యలింగంలను మంగళవారం కేతిరెడ్డి ఆహ్వానించారు. అంతేకాకుండా దక్షిణాది రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. -
చంద్రబాబు, కేసీఆర్‌లు చొరవ తీసుకోవాలి: కేతిరెడ్డి
సాక్షి, చెన్నై: చిత్ర పరిశ్రమ సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి, పరిష్కారం కోసం ఓ కమిటీని నియమించాలని నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ని, ఆంద్రప్రదేశ్ సీఎం చంద్రబాబుని కమిటీ ఏర్పాటుకు లేఖ రాసినట్లు ఓ ప్రకటనలో కేతిరెడ్డి తెలిపారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్, నిర్మాతల మధ్య జరుగుతున్న వివాదం, ప్రస్తుతం సినిమా థియేటర్లను బంద్ చేయటం.. సినీ ప్రేమికులకు ఇబ్బందిగా మరిందన్నారు. కుటుంబ సభ్యులందరికి కేవలం సినిమా అనే వినోదం తప్పితే వేరే వినోదం లేదన్నారు. చిన్న సినిమాను బతికించుటకు మరో ఆటను జతచేస్తూ 5 ఆటలు ప్రదర్శించాలని, అదనపు షోకు ఎలాంటి టాక్స్ లేకుండా ఉండేలా జీవో తేవాలని విజ్ఞప్తి చేశారు. చిన్న సినిమాను, చిన్న నిర్మాతలను బ్రతికించాలని, ఈ డిజిటల్ సర్వీసు ప్రొవైడర్స్ నిర్మాతలే మేము ఇచ్చే కంటెంట్ ద్వారా ప్రకటనలను అందులో చేర్చి కోట్లు సంపాదిస్తున్నారు. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రదర్శన కోసం నిర్మాతల వద్ద నిబంధనలకు విరుద్ధంగా అధిక రుసుం వసూలు చేస్తున్నారు. మా కంటెంట్ ప్రదర్శనకు డబ్బులే తీసుకోకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి. ఒకప్పుడు యూఎఫ్ఓ(u.f.o) అని, క్యూబ్ (qube) అని వేరు వేరు సంస్థలని ఇప్పుడు రెండు సంస్థలు మోనోపాలి కొరకు నిర్మాతలను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వారిని నియంత్రించుటకు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ప్రభుత్వమే థియేటర్లకు వారి ప్రొజెక్టర్లు స్థానంలో ప్రొజెక్టర్లను సరఫరా చేసే ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ల ద్వారా చేయుటకు చేయూత నివ్వాలి. ప్రస్తుతం ఆన్ లైన్లో టికెట్స్ బుక్ చేసుకుంటే రూ.15 అధికంగా తీసుకుంటున్నారు. ప్రభుత్వమే ఓ పోర్టల్‌ను ప్రారంభించి ప్రేక్షకులపై ఆదనపు భారం పడకుండా చూడాలి. అందులో కొంత భాగం నిర్మాతకు ఇవ్వాలని, ఇప్పటికే సినిమా చూడాలంటే ప్రేక్షకుడు నిలువుదోపిడికి గురవుతున్నారు. తినుబండారాలు, తదితర విషయాల్లో దోపిడీ జరుగుతుంది కాబట్టి ఇది వ్యాపారం అనే కంటే ప్రజా సమస్య అని కూడా ఆలోచించి ప్రభుత్వం ఈ మాఫియాపై ఉక్కు పదం మోపి సగటు సినీ ప్రేక్షకులను, పరిశ్రమను కాపాడాలి. అందుకోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని వెంటనే సినిమా, ప్రేక్షకుల దోపిడీకి చరమగీతం పాడాలని కేతిరెడ్డి ఆ లేఖలో కోరారు. -
'నరసింహారెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలి'
సాక్షి, చెన్నై: తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా తెలుగు భాష పరిరక్షణ వేదిక కన్వీనర్ తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో 'ఉయ్యాలవాడ'పై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'నరసింహారెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలని రాష్ట్రపతిని, ప్రధానిని, కేంద్ర మంత్రులను, రాజ్యసభ, లోకసభ సభ్యులను ఢిల్లీలో కలిసి వినతిపత్రం ఇవ్వడమే కాకుండా శాఖల వారిగా చర్చించాను. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి అమరావతిలో ఉయ్యాలవాడ విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ యోధుడిగా గుర్తించాలని సంతకాల సేకరణ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నా అభ్యర్థనకు స్పందించింది. 1857 నుంచి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. కానీ ఉయ్యాలవాడ 1847 లోనే చనిపోయారు. దేశమంతా ఈ గుర్తింపును 1857 కంటే ముందు అమరులైన వారిని జాతీయవీరులుగా గుర్తించాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. త్వరలో ఒక కొత్త చట్టం ద్వారా గుర్తింపు కాలపరిమితిని పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇటీవల ఒక టీవీ ఛానల్ లో ఒక పెద్ద మనిషి ఉయ్యాలవాడ గురించి కొన్ని సంకుచిత వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించి మాట్లాడే వారు మేధావుల ముసుగులో ఉన్న మూర్ఖులు. బ్రిటిష్ వారే లండన్ మ్యూజియంలో, చెన్నైలోని మ్యూజియాల్లో నరసింహారెడ్డిని వీరుడిగా గుర్తించినట్లు ఆధారాలు ఉన్నాయి. పిచ్చి పిచ్చి మాటలతో తాము మేధావులం అనే భ్రమలో ఉండవద్దంటూ' తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన ప్రకటనలో హెచ్చరించారు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి భేష్‌గా కనిపిస్తారని, అద్భుతంగా నటిస్తారు. 'సైరా నరసింహారెడ్డి దర్శకుడు సురేందర్ రెడ్డి నాతో మాట్లాడారు. సైరా నరసింహారెడ్డి చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా ఉండేలా నిర్మిస్తున్నట్లు సురేందర్ రెడ్డి చెప్పారు. అందుకు మూవీ యూనిట్‌కు, చిరంజీవికి ధన్యవాదాలు. చిరంజీవిని ఉయ్యాలవాడ పాత్రలో ఎప్పుడెప్పుడు చూడాలనే తహతహలో ఉయ్యాలవాడ అభిమానులు ఉన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఓ కలికితు రాయిగా మిగిలిపోయేలా సినిమా ఉంటుందని' కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు. -
విద్యాబాలన్ ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలి
సాక్షి, కొరుక్కుపేట: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుకున్న విద్యాబాలన్ తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని సినీ దర్శక, నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాలీవుడ్లో సినిమా, సీరియల్‌గా నిర్మిస్తున్న స్వర్గీయ ఇందిరాగాంధీ జీవిత కథలో విద్యబాలన్ నటించాలనుకోవడం సహించరాని విషయమన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ గొప్ప మహిళానేత పాత్రలో మిమ్మల్ని చూపించడం కష్టమన్నారు. వెంటనే ఆ ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. లేకపోతే ఇందిరమ్మ అభిమానుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఆయన అన్నారు. కళాకారులు ఏ పాత్రైనా పోషించవచ్చన్నారు. కానీ గతంలో వారు నటించిన పాత్రల ప్రభావం ఈ పాత్రపై ఉంటుందని తెలిపారు. ప్రజాగ్రహానికి గురై కోర్టుల చుట్టూ తిరిగే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని హితవు పలికారు. కనిమొళిపై చర్యలు తీసుకోవాలి.. తిరుమల వేంకటేశ్వరస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కనిమొళిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు తెలుగు యువశక్తి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొశారు. వివాదం సృష్టించడం వార్తల్లో నిలవడం ఇది కొత్త రాజకీయ ఎత్తుగడలో భాగమన్నారు. 2006లో నిర్భంధ తమిళ భాష బోధన చట్టాన్ని తీసుకువచ్చి మైనార్టీల హక్కులను హరించారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కనిమొళి తిరుమల వేంకటేశ్వరస్వామిపై తిరుచ్చిలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా ఆమె ఇలా మాట్లాడడం సబబుకాదన్నారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెంకన్న భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేతిరెడ్డి శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో స్టాలిన్, స్టాలిన్ భార్య వెంకన్న భక్తులన్నారు. ఇవే వ్యాఖ్యలు ఇతర మతస్థులపై చేసే దమ్ము మీకు ఉందా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. నాస్తికత్వంపై ప్రసంగంలో వేంకటేశ్వరస్వామిని ఉదాహరణగా చూపడం కోట్లాది వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసారన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి వెంటనే కనిమొళిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.