కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
సాక్షి, చెన్నై: తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వర్ధంతి సందర్భంగా తెలుగు భాష పరిరక్షణ వేదిక కన్వీనర్ తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలో 'ఉయ్యాలవాడ'పై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 'నరసింహారెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలని రాష్ట్రపతిని, ప్రధానిని, కేంద్ర మంత్రులను, రాజ్యసభ, లోకసభ సభ్యులను ఢిల్లీలో కలిసి వినతిపత్రం ఇవ్వడమే కాకుండా శాఖల వారిగా చర్చించాను. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి అమరావతిలో ఉయ్యాలవాడ విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరాను. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ యోధుడిగా గుర్తించాలని సంతకాల సేకరణ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నా అభ్యర్థనకు స్పందించింది. 1857 నుంచి స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. కానీ ఉయ్యాలవాడ 1847 లోనే చనిపోయారు. దేశమంతా ఈ గుర్తింపును 1857 కంటే ముందు అమరులైన వారిని జాతీయవీరులుగా గుర్తించాలని వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
త్వరలో ఒక కొత్త చట్టం ద్వారా గుర్తింపు కాలపరిమితిని పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇటీవల ఒక టీవీ ఛానల్ లో ఒక పెద్ద మనిషి ఉయ్యాలవాడ గురించి కొన్ని సంకుచిత వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరించి మాట్లాడే వారు మేధావుల ముసుగులో ఉన్న మూర్ఖులు. బ్రిటిష్ వారే లండన్ మ్యూజియంలో, చెన్నైలోని మ్యూజియాల్లో నరసింహారెడ్డిని వీరుడిగా గుర్తించినట్లు ఆధారాలు ఉన్నాయి. పిచ్చి పిచ్చి మాటలతో తాము మేధావులం అనే భ్రమలో ఉండవద్దంటూ' తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తన ప్రకటనలో హెచ్చరించారు.
'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి భేష్‌గా కనిపిస్తారని, అద్భుతంగా నటిస్తారు. 'సైరా నరసింహారెడ్డి దర్శకుడు సురేందర్ రెడ్డి నాతో మాట్లాడారు. సైరా నరసింహారెడ్డి చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా ఉండేలా నిర్మిస్తున్నట్లు సురేందర్ రెడ్డి చెప్పారు. అందుకు మూవీ యూనిట్‌కు, చిరంజీవికి ధన్యవాదాలు. చిరంజీవిని ఉయ్యాలవాడ పాత్రలో ఎప్పుడెప్పుడు చూడాలనే తహతహలో ఉయ్యాలవాడ అభిమానులు ఉన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే ఓ కలికితు రాయిగా మిగిలిపోయేలా సినిమా ఉంటుందని' కేతిరెడ్డి అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment