స్వాతంత్య్రానికి సైరా | sye raa narasimha reddy movie full details | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్రానికి సైరా

Published Thu, Aug 15 2019 2:37 AM | Last Updated on Thu, Sep 19 2019 8:25 PM

sye raa narasimha reddy movie full details - Sakshi

చిరంజీవి, అమితాబ్‌, విజయ్‌ సేతుపతి

నేడు స్వాతంత్య్ర దినోత్సవం. మనం ఆనందిస్తున్న ఈ ఫ్రీడమ్‌ను మనకు అందించడం కోసం ఎందరో పోరాడారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వాళ్లలో తొలి తరం యోధుల్లో తెలుగు వీరుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ ఒకరు. ఇప్పుడు ఆయన జీవితం ఆధారంగా ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రం తెరకెక్కుతుంది. చిరంజీవి లీడ్‌ రోల్‌లో ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. సుమారు 250 కోట్ల బడ్జెట్‌తో కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌ చరణ్‌ నిర్మించారు. దాదాపు 225 రోజుల పాటు చిత్రీకరణ జరిపారు. ఈ పీరియాడికల్‌ చిత్రాన్ని తెర మీదకు తీసుకురావడానికి చిత్రబృందం పడిన శ్రమ, మేకింగ్‌ ఆఫ్‌ ‘సైరా’ గురించి కొన్ని విశేషాలు మీకోసం.

మేకింగ్‌ ఆఫ్‌ ‘సైరా’
రాజ్య వ్యవస్థలను, రాజులను ఆంగ్లేయులు తమ ఆధీనంలోకి తీసుకొని తమ అదుపులో ఉన్న ప్రాంతాలకు ‘పాలెగాళ్ల’ను ఏర్పాటు చేసేవాళ్లు. అలాంటి ఓ పాలెగాడు నరసింహారెడ్డి. ఆంగ్లేయులపై ఎలా ఎదురుతిరిగాడు? ఈ ఉద్యమంలో ఎవరెవరిని తనతో కలుపుకుంటూ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాడు అనేది చిత్రకథ అని సమాచారం. ఈ చిత్రంలో అనుష్క ఝాన్సీ రాణిగా కనిపిస్తారు. సినిమా అనుష్క వాయిస్‌ ఓవర్‌తోనే మొదలవుతుందని తెలిసింది. చిరంజీవి గురువు పాత్రలో అమితాబ్‌ నటించారు. రాజ నర్తకి పాత్రలో తమన్నా, నరసింహారెడ్డి భార్య సిద్ధమ్మగా నయనతార నటించారు. నరసింహారెడ్డికి మద్దతుగా తమిళనాడు నుంచి వచ్చే దళ నాయకుడిగా విజయ్‌ సేతుపతి కనిపిస్తారు.

ఎవరి పాత్రేంటి?
చిరంజీవి – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
నయనతార – సిద్ధమ్మ
అమితాబ్‌ బచ్చన్‌ – గోసాయి వెంకన్న
జగపతి బాబు – వీరారెడ్డి
‘కిచ్చ’ సుదీప్‌ – అవుకు రాజు
విజయ్‌ సేతుపతి – రాజా పాండీ
తమన్నా – లక్షి
అనుష్క – ఝాన్సీ లక్ష్మీభాయ్‌


సైరా బృందం
రచన : పరుచూరి బ్రదర్స్‌
దర్శకుడు : సురేందర్‌ రెడ్డి
నిర్మాత : రామ్‌చరణ్‌
ప్రొడక్షన్‌ డిజైనర్‌ : రాజీవన్‌
కెమెరా మేన్‌ : రత్నవేలు
యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ : గ్రెగ్‌ పోవెల్, రామ్‌ లక్ష్మణ్, లీ వైట్కర్‌
కాస్ట్యూమ్‌ డిజైనర్‌ : అంజూ మోడీ,
సుష్మితా కొణిదెల, ఉత్తరా మీనన్‌
వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌వైజర్‌ : కమల్‌ కణ్ణన్‌
సంగీతం : అమిత్‌ త్రివేది

రాజస్తాన్‌ స్పెషల్‌ కత్తి
యాక్షన్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా 150కు పైగా వివిధ రకాలైన కత్తులను తయారు చేయించారట. ప్రధానంగా చిరంజీవి రెండు కత్తులు వాడారని సమాచారం. ఒక కత్తిని ప్రత్యేకంగా రాజస్థాన్‌ నుంచి తెప్పించారట. ఇక్కడ డిజైన్‌ చేసి, రాజస్తాన్‌ పంపించి, ఆ కత్తిని తయారు చేయించారు. మరో కత్తిని హైదరాబాద్‌లోనే తయారు చేయించారు. ఇంకా మిగతా కత్తులను ఇక్కడ డిజైన్‌ చేసి, చెన్నైలో తయారు చేయించారు.

రెండు భారీ యుద్ధాలు!
‘సైరా’ సినిమాలో రెండు భారీ యుద్ధాలు ఉంటాయని తెలిసింది. ఈ యుద్ధ సన్నివేశాల్లో ఒకటి జార్జియా దేశంలో, మరొకటి హైదరాబాద్‌లోని కోకాపేట్‌ సెట్లో షూట్‌ చేశారు. జార్జియాలో నెల రోజుల పాటు ఈ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించగా, కోకాపేట్‌లో దాదాపు 35 రోజులుపైగా నైట్‌ షూట్‌ చేశారట. సినిమాలో వచ్చే ఈ మేజర్‌ వార్‌ సీన్స్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయని తెలిసింది. ఇంకా ఇవి కాకుండా పోరాట దృశ్యాలు మరిన్ని ఉంటాయి. వాటిలో నీటి లోపల తీసిన అండర్‌ వాటర్‌ ఎపిసోడ్‌ ఓ హైలైట్‌ అని తెలిసింది. ఈ ఎపిసోడ్‌ను ముంబైలో వారం రోజులు షూట్‌ చేశారు.

పదిహేను సెట్లు
‘సైరా’ చారిత్రాత్మక చిత్రం. స్క్రీన్‌ మీద ఆ కాలాన్ని ప్రతిబింబించాలంటే సెట్లు కచ్చితంగా నిర్మించాల్సిందే. ‘సైరా’ చిత్రాన్ని ఎక్కువ శాతం సెట్లోనే షూట్‌ చేశారు. దాని కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో రెండు సెట్లు, ఆర్‌ఎఫ్‌సీలో రెండు సెట్లు, కోకాపేటలో మూడు సెట్లు (టెంపుల్‌ సెట్, ప్యాలెస్‌ సెట్‌తో పాటు మరోటి), ఇంకా హైదరాబాద్‌లోనే రెండు సెట్లు, పాండిచెరీలో ఒకటి, మైసూర్, తమిళనాడులో హోగెనకల్‌లో ఒకటి, కేరళలో ఒకటి, రెండు సెట్లను రూపొందించారు. ఇలా 15కు పైగా భారీ సెట్లను ఈ సినిమా కోసం రూపొందించారు ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజీవన్‌ ఆధ్వర్యంలో అద్భుతమైన సెట్లు తయారు చేశారు.

నయనతార

గెరిల్లా ఫైట్‌
నరసింహారెడ్డి ఆంగ్లేయులతో తలపడిన విధానాల్లో గెరిల్లా ఒక పద్ధతి. శత్రువుల్లో కలిసిపోయి అనూహ్యంగా దాడి చేయడం ఈ యుద్ధ విద్య విశేషం. సినిమాలో ఓ పాటలో ఈ గెరిల్లా పోరాటాన్ని చూపించనున్నారట చిత్రబృందం. పాట బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఆ ఫైట్‌లో  చిత్రకథానాయకుడు చిరంజీవితో పాటు దాదాపు 500మంది పాల్గొన్నారు.


కాస్ట్యూమ్స్‌
ఇందులో చిరంజీవి సుమారు 50 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారని సమాచారం. చిరంజీవి కాస్ట్యూమ్స్‌ను ఆయన కుమార్తె సుష్మితా కొణిదెల డిజైన్‌ చేశారు. తమన్నా నర్తకి పాత్రలో కనిపించనున్నారు. ఆమె కూడా ఓ 25 కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారట. నయనతారకి 20 డ్రస్‌ చేంజ్‌లు ఉంటాయని తెలిసింది. సినిమాలో ఎక్కువ కాస్ట్యూమ్స్‌ ఈ మూడు పాత్రలకే ఉంటాయి. అంజూ మోడీ, ఉత్తరా మీనన్‌లు కూడా కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేశారు.

తమన్నా

‘‘సైరా’లో నా పాత్ర రెండు నిమిషాలు కూడా ఉండదు. కానీ మేకింగ్‌ వీడియోలో నా విజువల్స్‌ కూడా వేశారు చరణ్‌ (రామ్‌ చరణ్‌) అన్న. అది చాలా స్వీట్‌ అనిపించింది. అన్న స్టైలే అది. ఇలాంటి చిన్న చిన్న విషయాలతో మా అందర్నీ హ్యాపీగా ఉంచుతాడు. ఇది రక్షాబంధన్‌కి అడ్వాన్స్‌గా ఇచ్చిన గిఫ్ట్‌ అనుకుంటున్నాను’’ అని తన ఆనందాన్ని షేర్‌ చేసుకున్నారు నిహారిక. ఇందులో నిహారిక కాసేపు కనిపిస్తారు.


 నిహారిక

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement