సాక్షి, చెన్నై: తమిళనాట సూపర్ స్టార్ రజనీకాంత్ ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ ప్రకంపనలు సృష్టించటడం ఖాయమని ఆ రాష్ట్ర తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. రజనీ రాజకీయ ప్రవేశంపై కేతిరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. నూతన రాజకీయ ఒరవడికి రజనీకాంత్ కారణం కాగలరన్నారు. జయలలిత మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళాలను సృష్టించిన బీజేపీకి రజనీ రాజకీయ ప్రవేశం గొడ్డలి పెట్టని తెలిపారు. కానీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం రజనీ రాజకీయ పార్టీ విజయావకాశాలు తక్కువగా ఉంటాయని అభిప్రాయపడ్డారు.
రజనీ స్థాపించిన ఆధ్యాత్మిక పార్టీ నినాదంతో ఆధ్యాత్మికతకి , హిందూయిజనికి ఉన్న తేడాను విమర్శకులు గమనించాలన్నారు. జయలలిత పరిపాలనను ఆదర్శంగా తీసుకొని మెరుగైన పాలనను అందించే నాయకుడి కోసం తమిళనాట ప్రజలు కోరుకుంటున్నారని, అలాంటి పాలనను రజనీ అందిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తమిళనాడులో ప్రస్తుతమున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రజనీ అడుగులు వేస్తే తప్పక విజయం సాధిస్తారన్నారు. సినీ ప్రముఖులు రాజకీయాల్లో వచ్చినపుడు.. వారు నటించిన చిత్రాల ప్రభావం ఎంతో కొంత ప్రజాకర్షణకు కారణం అవుతాయన్నారు. ఈ క్రమంలో రజనీ తాజా చిత్రం ‘కాల’ కూడా తన రాజకీయ అరంగేట్రానకి అనుగుణంగా ఉపయోగపడే చిత్రంగా ఉండవచ్చని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment