
సాక్షి, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురానున్న ఆన్‌లైన్ టిక్కెట్ విధానం కంటే ముందు విడుదలవుతున్న సినిమా ద్వారా టికెట్లను అధిక ధరలకు అమ్మి ప్రేక్షకులను దోపిడీ చేయుచున్నారని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు, సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెనిఫిట్ షోలంటూ ఉండవని.. ఒకే ఒక బెనిఫిట్ షో మాత్రమే ఉంటుందని తెలిపారు. కానీ ప్రస్తుతం ఏపీలో చారిటీ పేరుతో ఉదయం 6 గంటలకు, 9 గంటలకు బెనిఫిట్ షోలు వేస్తూ వాటిని రూ.600 అమ్ముతున్నారని చెప్పారు. చాలా రోజులుగా చిన్న నిర్మాతలు, కార్మికులు పడుతున్న కష్టాలను గ్రహించిన ఏపీ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఆన్‌లైన్ టిక్కెట్ విధానం, రోజుకు 4 ఆటల ప్రదర్శన చిత్ర పరిశ్రమ బాగు కొరకు, ప్రజలు సినిమా టిక్కెట్స్ కొనుగోలులో దోపిడీ కాకుండా ఉండటం కోసం ప్రవేశ పెట్టారని తెలిపారు.
డిసెంబర్ 2న విడుదలయ్యే ‘అఖండ’ సినిమాను ప్రత్యేక ప్రదర్శనతో పాటు.. ఉదయం 6 గంటలకు, 9 గంటలకు ప్రదర్శనకు టికెట్స్ స్వచ్ఛంద సంస్థల పేరుతో పోస్టర్స్ ముద్రించి టిక్కెట్స్ కావలసినవారు సంప్రదించవల్సిన నంబర్లని తెలియచేస్తూ వాట్సప్ గ్రూపులలో పెట్టి అమ్మతున్నట్లు ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే చర్యలు తీసుకొని ఆ సినిమా థియేటర్ టికెట్లను రెవెన్యూ, హోం శాఖ ద్వారా బుకింగ్స్‌లో అమ్మేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment