
సాక్షి, అమరావతి : బిగ్‌బాస్ రియాలిటీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు అందులో ఏముందో తెలుసుకునేందుకు తామూ రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని హైకోర్టు తెలిపింది. ఎలాంటి సెన్సార్‌షిప్ లేకుండా ఈ షో ప్రసారమవుతోందని పిటిషనర్ ఆరోపిస్తున్నందున, ఈ షో పూర్తి వివరాలను తమ ముందుంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేర కు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అశ్లీల, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహిస్తున్న బిగ్‌బాస్ షో ప్రసారాన్ని నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 2019లో, ఇటీవల దాఖలు చేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ఇటీవల నెగెటివ్ ప్రచారం (నిర్వాహకులే ప్రచారం కోసం వివాదం సృష్టించడం) చేసుకోవడం ఎక్కువైందని, ఈ వ్యాజ్యం కూడా అందులో భాగమే అనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించగా.. అలాంటిదేమీ లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి చెప్పారు.
ఎలాంటి సెన్సార్‌షిప్ లేకుండా బిగ్‌బాస్ షో ప్రసారం అవుతోందన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను పరిశీలించాలని కోరారు. ఈ పోటీలో పాల్గొనే మహిళలకు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఈ షోలో ఏముందో తెలుసుకునేందుకు తాము కూడా రెండు మూడు ఎపిసోడ్లు చూస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment