సాక్షి, అమరావతి: బిగ్‌బాస్ వంటి చెత్త రియాలిటీ షోల వల్ల యువత పెడదారి పడుతోందని ఏపీ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి షోలతో సమాజంలో ప్రమాదకర పోకడలు పెరిగిపోతున్నాయంది. ఇలాంటి వాటిని ఎవరూ అడ్డుకోవడం లేదని, సమాజం ఎటుపోతోందో అర్థం కావడం లేదని అభిప్రాయపడింది. బిగ్‌బాస్ షోను నిలిపేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై వచ్చేనెల 2న విచారణ జరుపుతామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎటువంటి సెన్సార్‌షిప్ లేకుండా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్ వంటి కార్యక్రమాలు యువతను తప్పుదోవపట్టిస్తున్నాయని, ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలంటూ తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి 2019లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. (క్లిక్: పట్టణాల్లో ఫిర్యాదులపై ప్రత్యేక వ్యవస్థ!)
జగదీశ్వర్‌రెడ్డి తరఫు న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి శుక్రవారం జస్టిస్ అమానుల్లా నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘మంచి వ్యాజ్యం దాఖలు చేశారు. బిగ్‌బాస్ లాంటి చెత్త షోల వల్ల యువత జీవితాలు నాశనం అవుతున్నాయి. యువత పెడదోవ పడుతోంది. ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో అసభ్యత, అశ్లీలతను పెంచేస్తున్నాయి. అనర్థాలకు దారితీసే ఈ కార్యక్రమాల వల్ల సమాజం పాడవుతుందన్న విషయాన్ని అందరూ గుర్తెరగాలి’ అని వ్యాఖ్యానించింది. (క్లిక్: బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో సంచలన తీర్పు)
Comments
Please login to add a commentAdd a comment