చెన్నై: దేశంలో జాతీయ విపత్కర పరిస్థితి ఏర్పడిన సందర్భంలో ప్రజారోగ్యం పట్ల శ్రద్ధవహించాల్సిన కేంద్రం కరోనా నియంత్రణను రాష్ట్రాలకు అప్పగించడం ఎంతవరకు సరైనదని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్ది ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 'స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ మన దేశంలో విద్య, వైద్య రంగాలలో ఇప్పటికీ పరిస్థితులు మెరుగుపడలేదు. ప్రస్తుత ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్న ప్రభుత్వాలుగాని, ప్రజారోగ్యం, విద్య పట్ల శ్రద్ధ వహించి ఉంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడి ఉండేవి కావు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి మరణాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది. పౌరులు కూడా అప్రమత్తంగా ఉంటూ, కోవిడ్ నిబంధనలను పాటించి ప్రభుత్వానికి అండగా ఉండాలి. కరోనా తీవ్రతను బట్టి అవసరమైతే లాక్‌డౌన్‌ను విధించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. సినీ పరిశ్రమలోని అగ్రనటులందరు కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఆ దిశగా టీవీ మాధ్యమాలు, ప్రింట్, యూట్యూబ్‌లలో ప్రకటనలు ఇస్తూ ప్రజలకు భరోసా కల్పించి తమ వంతు బాధ్యతను నిర్వహించాలి. ఇటువంటి పరిస్థితుల్లో సినీ రంగానికి చెందిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతుసాయంగా నిలవాలని' కేతిరెడ్డి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment