తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి
సాక్షి, హైదరాబాద్ : మహిళలపై సినీ రంగంలో, కాల్ సెంటర్లలో, ప్రభుత్వ కార్యాలయాలలో లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయని సినీ నిర్మాత, దర్శకుడు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని ముందుకు వచ్చి చెప్పే మహిళల్ని అవహహేళనగా మాట్లాడే వారికి శ్రీరెడ్డి వివాదం చెంపపెట్టు అన్నారు. మహిళా సంఘాలు, సోషల్ వర్కర్స్, ప్రజలు ప్రజా పోరాటాలు చేసి దగాపడిన మహిళకు అండగా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా కాపాడవలసిన భాధ్యత అటు ప్రజలపై ఇటు ప్రభుత్వాలపై ఉందన్నారు. శ్రీరెడ్డికి జరిగిన అన్యాయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని, గతంలో సుప్రీం కోర్టు సినిమా పరిశ్రమలో మహిళా మేకప్ ఉమన్స్‌పై పరిశ్రమ బ్యాన్ వివక్షకు వేతిరేకంగా సినీ రంగంపై ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు.
ఇదివరకే సుప్రీంకోర్టుకు సినిమా రంగంలో మహిళా వివక్ష గురించి తెలుసుకనుక, ఈ శ్రీరెడ్డి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్తామని.. అందుకు శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయాల ఆధారాలను ఇవ్వాలన్నారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తే అన్ని విధాలుగా తాను సహాయం చేస్తానన్నారు. గతంలో సినిమా రంగంలో డ్రగ్స్ వాడకంపై సుప్రీంకోర్టులో తాను కేసు వేశానని, ఎందరో మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని బయటకొచ్చి చెప్పేందుకు సంకోచిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈవ్ టీజింగ్‌ను అరికట్టేందుకు షీ టీంలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. సినీ, కార్పొరేట్, కాల్ సెంటర్లో, ప్రభుత్వ రంగ సంస్థలలో మహిళలపై జరిగే వేధింపులను అరికట్టేందుకు ఒక ప్రత్యేక సెల్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని కోరారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కావాలని, సినిమా రంగంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ పోలీసులు సుమోటోగా స్వీకరించి విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఇలాంటివి ఉన్నాయని, కానీ అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేసినారని దైర్యంగా వచ్చి చెప్పే మహిళలు చాలా అరుదని పేర్కొన్నారు. శ్రీరెడ్డి ముందుకు రావటం ఆమె సాహసానికి నిదర్శనం. సినీ రంగంలో ఉన్న ఈ కాస్టింగ్ కౌచ్ మాఫియాపై ఉక్కు పాదం మోపాలని ఫిల్మ్ ఛాంబర్, ‘మా’ అసోసియేషన్ వారి వల్ల ఈ సమస్యకు పరిష్కారం దొరకాలన్నారు. శ్రీరెడ్డి చెప్పినట్లు తప్పు చేసింది ఇండస్ట్రీలో పెద్దవాళ్లు అయినప్పటికి కఠిన చర్యలు చేపట్టాలని కేసీఆర్‌కు, హోం శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ డీజీపీ వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని సినీ నిర్మాత, దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment