
రాష్ట్రేతర తెలుగువారి సమస్యలు కూడా..
తిరుపతి: తెలుగు భాషా పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రాష్ట్రేతర తెలుగువారి సమస్యలను పరిష్కరించేందుకు సైతం చర్యలు తీసుకోవాలని తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపకుడు, తెలుగు పరిరక్షణ వేదిక కన్వినర్ కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన కేతిరెడ్డి.. ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలను అభినందించారు. అలాగే.. తమిళనాడులోని నిర్బంధ తమిళ చట్టాన్ని సవరించేలా చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. తెలుగు భాష సంరక్షణకు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు చొరవతీసుకోవాలని కోరారు.
మాతృభాషలో విద్యాభ్యాసం అన్ని రాష్ట్రాల్లోనూ సమస్యగా ఉన్నందున దీనిపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి కోరారు. కర్నాటకలోని నీటి సమస్యలపై జరుగుతున్న ఆందోళనకు తమిళులకు మద్దతుగా చెన్నైలోని తెలుగువారు శుక్రవారం ఆదోళన చేపడుతున్నట్లు కేతిరెడ్డి వెల్లడించారు.