
సాక్షి, కొరుక్కుపేట: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో నటించాలనుకున్న విద్యాబాలన్ తన ప్రయత్నాన్ని విరమించుకోవాలని సినీ దర్శక, నిర్మాత, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బాలీవుడ్‌లో సినిమా, సీరియల్‌గా నిర్మిస్తున్న స్వర్గీయ ఇందిరాగాంధీ జీవిత కథలో విద్యబాలన్ నటించాలనుకోవడం సహించరాని విషయమన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ గొప్ప మహిళానేత పాత్రలో మిమ్మల్ని చూపించడం కష్టమన్నారు.
వెంటనే ఆ ప్రయత్నాన్ని మానుకోవాలన్నారు. లేకపోతే ఇందిరమ్మ అభిమానుల ఆగ్రహానికి గురికాకతప్పదని ఆయన అన్నారు. కళాకారులు ఏ పాత్రైనా పోషించవచ్చన్నారు. కానీ గతంలో వారు నటించిన పాత్రల ప్రభావం ఈ పాత్రపై ఉంటుందని తెలిపారు. ప్రజాగ్రహానికి గురై కోర్టుల చుట్టూ తిరిగే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని హితవు పలికారు.
కనిమొళిపై చర్యలు తీసుకోవాలి..
తిరుమల వేంకటేశ్వరస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కనిమొళిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు తెలుగు యువశక్తి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పేర్కొశారు. వివాదం సృష్టించడం వార్తల్లో నిలవడం ఇది కొత్త రాజకీయ ఎత్తుగడలో భాగమన్నారు. 2006లో నిర్భంధ తమిళ భాష బోధన చట్టాన్ని తీసుకువచ్చి మైనార్టీల హక్కులను హరించారన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కనిమొళి తిరుమల వేంకటేశ్వరస్వామిపై తిరుచ్చిలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. హిందువుల మనోభావాలను పట్టించుకోకుండా ఆమె ఇలా మాట్లాడడం సబబుకాదన్నారు.
వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని వెంకన్న భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కేతిరెడ్డి శనివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వారి కుటుంబంలో స్టాలిన్, స్టాలిన్ భార్య వెంకన్న భక్తులన్నారు. ఇవే వ్యాఖ్యలు ఇతర మతస్థులపై చేసే దమ్ము మీకు ఉందా? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. నాస్తికత్వంపై ప్రసంగంలో వేంకటేశ్వరస్వామిని ఉదాహరణగా చూపడం కోట్లాది వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసారన్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి వెంటనే కనిమొళిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment