
’జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి’
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై పలు అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంలో ప్రజల అనుమానాల్ని నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు చేయాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఒక లేఖ రాశారు. గత సెప్టెంబర్ 21న జ్వరం, డీ హైడ్రెషన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆ తర్వాత జబ్బు బారిన పడటం.. ఆమె కోలుకుంటున్నదని ప్రకటించడం, డిసెంబర్ 4న హఠాత్తుగా ఆమెకు గుండెపోటు వచ్చిందని చెప్పడం చూస్తుంటే ఆశ్చర్యంతోపాటు పలు అనుమానాలు కలుగుతున్నాయని ఆయన మీడియాకు విడుదల చేసిన తన లేఖలో పేర్కొన్నారు.
కోలుకొని ఆరోగ్యంగా ఉన్న జయలలితకు హఠాత్తుగా గుండెపోటు ఎందుకు వచ్చిందన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆస్పత్రిలో ఉండగా చూసేందుకు వచ్చిన కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్‌ను జయలలిత ఉన్న గదిలోకి అనుమతించకుండా శశికళను మాత్రమే అనుమతించడం పలు అనుమానాలకు తావిస్తున్నదని, గతంలో జయలలిత తనపై విషప్రయోగం జరిపారనే ఆరోపణలతో శశికళతోపాటు 13మందిని పార్టీ నుంచి బహిష్కరించారని, ఈ నేపథ్యంలో జయలలిత మరణం అనుమానాస్పదంగా కనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు.