Anantapur School Teacher Suspended as husband taken over the class in Place of Wife - Sakshi
Sakshi News home page

భార్య స్థానంలో విధులకు హాజరై దొరికిపోయిన టీచర్‌

Published Mon, Dec 13 2021 12:06 PM | Last Updated on Mon, Dec 13 2021 3:40 PM

Anantapur Municipal School Teacher Suspended Due Husband in Place of Wife - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అనంతపురం: మేడం రోజూ స్కూల్‌కెళ్లి పాఠాలు చెప్పడం ఇబ్బందనుకున్నారో లేక మరేదైనా కారణమో తెలీదు కాని ఆమె స్థానంలో భర్త హాజరయ్యారు. తనూ ఓ పాఠశాలలో టీచర్‌ అయినప్పటికీ అక్కడ విధులకు డుమ్మా కొట్టి..భార్య ‘విధుల’ను నిర్వర్తించారు. ఈ విషయం ఎంఈఓ తనిఖీలో బయటపడడంతో ఆమెను సస్పెండ్‌ చేయడంతో పాటు అయ్యవారిపైనా చర్యలకు సిఫారసు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

రమేష్‌ కదిరి పట్టణంలోని రాణీనగర్‌ మునిసిపల్‌ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడి (స్కూల్‌ అసిస్టెంట్‌)గా పనిచేస్తున్నారు. ఆయన భార్య ఆర్‌.అరుణాదేవి ఓడీచెరువు మండలం టి.కుంట్లపల్లి హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ). అరుణాదేవి ఈ నెల 7 నుంచి 9 వరకు సెలవుపై వెళ్లారు. పదో తేదీ (శుక్రవారం) విధులకు హాజరుకావాల్సి ఉండేది. 

ఆమె వస్తారనే ఉద్దేశంతో ఆరోజు హెచ్‌ఎం సునీత సెలవు పెట్టారు. కానీ అరుణాదేవి స్థానంలో భర్త రమేష్‌ విధులకు హాజరయ్యారు. ఈ విషయం ఎంఈఓ చెన్నక్రిష్ణ ఆకస్మిక తనిఖీలో బయటపడింది. ఆయన డీఈఓకు నివేదిక పంపడంతో అరుణాదేవిని సస్పెండ్‌ చేస్తూ ఆదివారం ఉత్తర్వులిచ్చారు. ఆమె భర్తపైనా చర్యలు తీసుకోవాలని కదిరి మునిసిపల్‌ కార్యాలయానికి సిఫారసు చేశారు.  

మరో ఇద్దరిపైనా.. 
►ఓడీచెరువు మండలం గోళ్లవారిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ జి.గణేష్‌ ఏకోపాధ్యాయుడిగా ఉన్నారు. ఎలాంటి అనుమతి లేకుండానే గురు, శుక్రవారం పాఠశాలకు డుమ్మా కొట్టారు. దీంతో విద్యార్థులందరూ ఇళ్ల వద్దే ఉండిపోయారు. ఈ విషయంపై గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఎంఈఓ పాఠశాలను తనిఖీ చేయగా .. నిజమేనని తేలింది. దీంతో ఎంఈఓ సిఫారసు మేరకు ఎస్జీటీ గణేష్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ ఉత్తర్వులిచ్చారు. 
►హిందూపురం మండలం కొట్నూరు ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం కె.నర్సిరెడ్డిని కూడా డీఈఓ సస్పెండ్‌ చేశారు. ఆయన విద్యార్థులకు పాఠాలు సక్రమంగా చెప్పడం లేదని ఎంఈఓ గంగప్ప ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement