
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మునిసిపల్ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించాలని పురపాలకశాఖ నిర్ణయించింది. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు నష్టపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సంకల్పించింది. రాష్ట్రంలో 59 పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 2,110 మునిసిపల్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2 లక్షలమంది విద్యార్థులున్నారు. వీరికి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు చెప్పేందుకు జూమ్ లైసెన్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలని మునిసిపల్ కమిషనర్లకు పురపాలకశాఖ కమిషనర్–డైరెక్టర్ ఎం.ఎం.నాయక్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు.
పదో తరగతి విద్యార్థులకు విజయవంతంగా ఆన్‌లైన్ తరగతులు
రాష్ట్రంలో ఐదు పట్టణ స్థానిక సంస్థల్లో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఆన్‌లైన్ తరగతులు విజయవంతమయ్యాయి. విజయవాడ, తిరుపతి, ఒంగోలు నగరాలు, శ్రీకాళహస్తి, నరసాపురం మునిసిపాలిటీల్లో పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించారు. అనంతరం ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో పదో తరగతి విద్యార్థులకు అమలు చేయడంతో 33 వేలమంది విద్యార్థులు లబ్ధిపొందారు. దీంతో అన్ని మునిసిపల్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు జూమ్ లైసెన్సులు కొనుగోలు చేయమని పురపాలకశాఖ మునిసిపల్ కమిషనర్లను ఆదేశించింది. మొదటి దశలో ఏడాదిపాటు లైసెన్సుల కొనుగోలుకు మునిసిపాలిటీల సాధారణ నిధులు వినియోగిస్తారు.
విద్యార్థుల సంఖ్యను బట్టి అవసరమైనన్ని లైసెన్సులను కొనుగోలు చేస్తారు. ప్రతి పాఠశాల కనీసం 5 జూమ్ లైసెన్సులు, మొబైల్ స్టాండ్, బోర్డులు కొనుగోలు చేస్తుంది. వీటి కొనుగోళ్ల ప్రతిపాదనలను ఈ నెల 28లోగా నివేదించాలని, జూన్ 30 నాటికి కొనుగోలు చేయాలని పురపాలకశాఖ సూచించింది. తరువాత ముందుగా బ్రిడ్జ్ కోర్సులు, అనంతరం సిలబస్‌ను అనుసరించి తరగతులు నిర్వహిస్తారు. ఆన్‌లైన్ తరగతుల నిర్వహణను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, మునిసిపల్ స్థాయిల్లో ప్రత్యేక సెల్‌లు ఏర్పాటు చేసింది. మునిసిపాలిటీ స్థాయి సెల్‌లో మునిసిపల్ మేనేజర్, సీనియర్ ప్రధానోపాధ్యాయుడు, విద్యా సూపర్‌వైజర్లు, వార్డు విద్య–డేటా ప్రాసెసింగ్ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఈ–లెర్నింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర పురపాలకశాఖ కమిషనర్–డైరెక్టర్ ఎం.ఎం.నాయక్ ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment