పేపర్‌ లీక్‌లు ఉండొద్దు | Inter board focus on proactive measures | Sakshi
Sakshi News home page

పేపర్‌ లీక్‌లు ఉండొద్దు

Published Mon, Feb 19 2024 4:09 AM | Last Updated on Mon, Feb 19 2024 2:55 PM

Inter board focus on proactive measures - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 28 నుంచి ఇంటర్మిడియెట్‌ థియరీ పరీక్షలు మొదలుకానున్నాయి. 9 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరవుతున్నారు. వచ్చే నెల 18న ప్రారంభంకానున్న పదవ తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది హాజరుకానున్నారు. ఈ రెండు పరీక్షలను ప్రభుత్వం కీలకంగా భావిస్తోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే పలు దఫాలుగా పరీక్షల నిర్వహణపై సమీక్షలు చేశారు.

ముఖ్యమంత్రి కూడా పరీక్షల తీరుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. గతం కన్నా భిన్నంగా పరీక్షల నిర్వహణ ఉండాలని చెప్పారు. ఎక్కడా పేపర్‌ లీక్‌లు ఉండొద్దని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికారుల్లో టెన్షన్‌ కన్పిస్తోంది. ప్రతీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు.

ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలుకొని, వాటిని చేరవేయడం, పరీక్షల తర్వాత సమాధాన పత్రాలను మూల్యాంకన కేంద్రాలకు తరలించడం, మూల్యాంకన నిర్వహించడం, ఫలితాల క్రోడీకరణ, వెల్లడి వరకూ సిబ్బందిని మరింత అప్రమత్తం చేశారు. గతంలో ఫిర్యాదులు లేని వారినే విధుల్లోకి తీసుకునేందుకు ప్రాధాన్యమి చ్చినట్టు అధికారులు చెబుతున్నారు.  

ఆ భయం తొలగేనా? 
కొన్నేళ్లుగా ఇంటర్, టెన్త్‌ పరీక్షల నిర్వహణ అధికారులకు సవాల్‌గా మారుతోంది. హాల్‌టికెట్లు మొదలుకొని, ఫలితాల వరకూ ఏదో ఒక పొరపాటు జరుగుతూనే ఉంది. ప్రశ్నపత్రాల్లో తప్పులు సర్వసాధారణం అవుతున్నాయి. మూల్యాంకన, ఫలితాల వెల్లడిలో జరిగిన కొన్ని పొరపాట్ల కారణంగా 2019లో ఇంటర్‌ బోర్డ్‌ వ్యవహారం వివాదాస్పదమైంది. ఆ సమయంలో 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా ఇంటర్‌ బోర్డ్‌ పెద్దగా దిద్దుబాటు చర్యలు చేపట్టలేదనే విమర్శలున్నాయి.

ఆ తర్వాత కూడా ఎక్కడో ఒకచోట ప్రశ్నపత్రాల్లో తప్పులు రావడం సమస్యలు తె చ్చిపెట్టింది. ఈసారి ఇలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా బోర్డ్‌ ముందే అప్రమత్తమైంది. నిపుణులతో ప్రశ్నపత్రాలను రూపొందించారు. గతంలో ఎలాంటి వివాదాలు లేని వారినే ఎంపిక చేసుకున్నారు. అధికారులు ముందే ఈ వివరాలను తెప్పించుకుని మరీ పరిశీలించారు.

టెన్త్‌ పరీక్షలు గత ఏడాది వివాదాలకు దారి తీశాయి. పేపర్‌ లీకేజీ రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. సమస్యాత్మక కేంద్రాల్లో ఈసారి ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్టు, ప్రైవేటు స్కూళ్లతో సంబంధాలున్న ఉపాధ్యాయులను విధులకు దూరంగా ఉంచుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. 

హాల్‌టికెట్ల ఆలస్యంపై దృష్టి : టెన్త్, ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్ల ఆలస్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావించింది. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించనుంది. ఫీజులు చెల్లించని విద్యార్థులపై ప్రైవేటు స్కూల్, కాలేజీలు పరీక్షల సమయంలో తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నాయి.

డౌన్‌లోడ్‌ చేసుకునే హాల్‌టికెట్లపై కాలేజీ ప్రిన్సిపల్, స్కూల్‌ హెచ్‌ఎం సంతకాలు అవసరమన్న ఆందోళన కల్గిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముందుగానే హాల్‌టికెట్ల పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు.  

పరీక్షలు సక్రమంగా నిర్వహించాలి
టెన్త్, ఇంటర్‌ పరీక్షల విషయంలోతప్పిదాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలుతీసుకోవాలి. పరీక్షల సమయంలో విద్యార్థులను ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు వేధించకుండా చూడాలి. పేపర్‌ లీకేజి వంటి ఘటనలు జరగకుండా చూడాలి.  –చింతకాయల ఝాన్సీ (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) 

ప్రైవేటుకు కొమ్ముకాయొద్దు
ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సహక రిస్తున్నట్టు గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూడాలి. పరీక్షలు సజావుగా, ఎలాంటి ఆందోళనలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. –టి నాగరాజు (ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement