సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో భారీస్థాయిలో అవకతవకలకు.. లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమాగమయ్యేందుకు ఓ ప్రైవేటు సంస్థ నిర్వాకమే కారణమైంది. ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారాల్లో ఓ ప్రైవేటు సంస్థ చక్రం తిప్పడం కారణంగానే ఈ సమస్యలు ఉత్పన్నమై నట్లు స్పష్టమైంది. కనీస అర్హతలు లేకుండానే ఇంటర్మీడియట్ డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్ (డీపీఆర్పీ) బాధ్యతలను చేజిక్కించుకున్న సంస్థ.. అసలు ప్రక్రియనంతా అడ్డదిడ్డంగా చేపట్టడంతోనే పరిస్థితి తారుమారైంది. ఫలితంగా ఇటీవల వెల్లడైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీగా పొరపాట్లు చోటుచేసుకోవడంతో వేలాది విద్యార్థులు ఆందోళనకు గురికాగా.. తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఫలితాల్లో పొరపాట్లు ఎలా జరిగాయి? విద్యార్థులు పరీక్షకు హాజరైనా ఫలితాల్లో గైర్హాజరైనట్లు ఎలా రికార్డయింది? టాపర్లు, మెరిట్ రికార్డున్న విద్యార్థులు ఒక సబ్జెక్టులో.. అదీ అత్యంత తక్కువ మార్కులతో ఎలా ఫెయిలయ్యారు? అనే అంతుచిక్కని ప్రశ్నలకు బోర్డు నుంచి జవాబు రావడంలేదు. చేసిన ఘనకార్యా న్ని కప్పిపుచ్చుకునేందుకు.. అవసరమైతే రీ–కౌం టింగ్, రీ–వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొమ్మని బోర్డు సలహా ఇవ్వడం ఆగ్రహానికి కారణమవుతోంది.
ప్రైవేటు సంస్థ పాత్ర ఏంటి?
ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పిదాలపై జరుగుతున్న చర్చలతో.. ఓ ప్రైవేటు సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. ఇంటర్మీడియట్ అడ్మిషన్లు మొదలు, ఫలితాల వెల్లడివరకు అవసరమైన సాంకేతిక సహకారమంతా.. మొన్నటివరకు ప్రభుత్వ రంగ సంస్థ – సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్‌గవర్నెన్స్) అందించేది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి మాత్రం ఈ బాధ్యతల్ని అన్ని అర్హతలున్న ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియకు తెరలేపింది. టెండర్లు పిలిచిన యంత్రాంగం.. తక్కువకు కోట్ (ఎల్1) చేసిన గ్లోబరీనాకు టెండర్లు ఖరారు చేసింది. దీంతో అడ్మిషన్ల నుంచి ఫలితాలు విడుదల చేసే వరకు జరిగే డేటా ప్రాసెసింగ్, ఫీజు ప్రాసెసింగ్, ఫలితాల ప్రాసెసింగ్ గ్లోబరీనా చేతుల్లోకి వెళ్లింది. తాజాగా విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలి తాల్లో పెద్దఎత్తున తప్పిదాలు జరగడంతో.. అసలు తప్పిదం ఎక్కడ జరిగిందనే దానిపై జరిగిన చర్చలో.. ఈ గ్లోబరీనా సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది.
అర్హత లేకున్నా అక్రమంగా: గ్లోబరీనా సంస్థకు టెండరు కట్టబెట్టడం, డీపీఆర్పీ ప్రాజెక్టు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు దక్కాలంటే ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు సంస్థ అర్హతలు సరిపోవాలి. కానీ గ్లోబరీనాకు పలు కేటగిరీల్లో అర్హత లేకున్నా అక్రమంగా డీపీఆర్పీ అధికారాలు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 3లక్షల మంది విద్యార్థులున్న ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీకి వరుసగా 5ఏళ్ల పాటు సాంకేతిక ఆధారిత పరీక్షల ప్రక్రియలో సహకారం అందించి ఉండాలి. దేశవ్యాప్తంగా ఐదు ప్రభుత్వ బోర్డులు లేదా యూనివర్సిటీలకు సాంకేతిక ఆధారిత పరీక్షలకు కచ్చితంగా పనిచేసి ఉండాలి. అందులో తప్పకుండా ఇంటర్మీడియట్ బోర్డు తప్పకుండా ఉండాలి. కానీ గ్లోబరీనాకు ఈ రెండు అర్హతలు లేనట్లు తెలుస్తోంది. టెండరు పత్రంలో సమర్పించిన వివరాల ప్రకారం.. 2.5లక్షల మంది విద్యార్థులున్న కాకినాడ జేఎన్‌టీయూతో గ్లోబరీనా మరో రెండు సంస్థలతో కలిసి పనిచేసినట్లు పత్రాన్ని సమర్పించింది. అదేవిధంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుతో 2017 సంవత్సరంలో 18,341 మంది విద్యార్థులు రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ ప్రక్రియలో సహకారం అందించినట్లు పత్రాన్ని సమర్పించింది. వాస్తవ నిబంధనలకు గ్లోబరీనా అర్హతలు సరిపోలకున్నా టెండర్ ఖరారు చేయడంపై అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది.
అనుభవం లేకపోవడంతో ఆగమాగం
డీపీఆర్పీ ప్రాజెక్టు దక్కించుకున్న గ్లోబరీనాకు అర్హతలు లేకపోవడానికి తోడు సరైన అనుభవం లేకపోవడంతో ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీ తప్పిదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. డీపీఆర్పీ ప్రాజెక్టు దక్కించుకోవాలంటే అంతకు ముందు ఇంటర్మీడియట్ డాటా ప్రాసెసింగ్, రిజల్ట్ ప్రాసెసింగ్‌లో భాగస్వామ్యమై ఉంటే.. అనుభవం వచ్చేది. కానీ గ్లోబరీనాకు ఈ వ్యవహారంలో కనీస అనుభవం కూడా లేదని స్పష్టమైంది. 2018–19 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమయంలో ఓఎంఆర్ షీట్లలో పొరపాట్లు జరగడం, అంతకుముందు అడ్మిషన్ల సమయంలో డేటా ప్రాసెసింగ్ గందరగోళంగా సాగడం.. విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులు కాకుండా ఇతర పరీక్షలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ కావడం వంటి తప్పిదాలు చోటుచేసుకోవడం కారణంగానే.. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు తప్పుల తడకగా వచ్చినట్లు స్పష్టమవుతోంది.
విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా?
ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సం స్థకు 10లక్షల మంది వి ద్యార్థుల భవిష్యత్తును ఎలా అప్పగించారు? నిబంధనలను అనుగుణంగా అర్హతల్లేని ప్రైవేటు సంస్థకు అప్పనంగా టెండర్‌ను కట్టబెట్టడంలో ఆంతర్యమేంటనేది బోర్డు స్పష్టం చేయాలి. ఉన్నతాధికారులు చేసిన తప్పిదాలకు కిందిస్థాయి ఉద్యోగులకు బలిచేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నిస్తోంది. రహస్య ఒప్పందం ప్రకారమే గ్లోబరీనాకు టెండర్ దక్కిందనేది సుస్పష్టం. – పి.మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్
విద్యార్థుల భవిష్యత్తుపై ప్రైవేటు
Published Mon, Apr 22 2019 1:12 AM | Last Updated on Mon, Apr 22 2019 1:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment