Globarena Technologies Private Limited
-
‘విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిన ఘనత ఆయనదే’
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ బోర్డు వైఫల్యం, గ్లోబరినా సంస్థ పనితీరు, సార్వత్రిక ఎన్నికల వంటి పలు అంశాల గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ స్పందించారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాక ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ కాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో యూనివర్సీటీలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో పని చేసే ట్యూటర్స్‌తో ఇంటర్ పరీక్ష పేపర్లను దిద్దించారని ఆయన ఆరోపింపచారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం వెనకేసుకేసుకొస్తుందని మండిపడ్డారు. నేటికి కూడా తెలంగాణలో దాదాపు వెయ్యికి పైగా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో ఇంత తీవ్ర సమస్యలు ఉంటే.. రాజు మాత్రం తీర్థయాత్రలకు బయలు దేరారని కేసీఆర్‌ని విమర్శించారు. మంచి చదువుల కోసం విద్యార్థులను గ్రామాల నుంచి పట్టణాలకు పంపితే ఆత్మహత్యలే దిక్కవతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఆర్డీఏ రిపోర్టు ప్రకారం వెనకబడ్డ రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణ చాలా వెనకబడి ఉందని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల గురించి మాట్లాడుతూ.. ఎవరి మద్దతు లేకుండానే ఎన్డీయే అధికారంలోకి వస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. మే 23 తర్వాత కాంగ్రెస్, టీడీపీల అడ్రస్ గల్లంతవుతుందని తెలిపారు. మోదీ హయాంలో ఇండియాలో భారీ మార్పులు వచ్చాయన్నారు. ఉగ్రవాదం, నక్సలిజం తగ్గిపోయాయని.. నిత్యావసర వస్తువుల ధరలు దిగొచ్చాయని పేర్కొన్నారు. వారణాసిలో నామినేషన్ వేసిన వారంతా టీఆర్ఎస్ ఏజెంట్లే అని లక్ష్మణ్ ఆరోపించారు. -
ఇంటర్ బోర్డు వివాదం.. ఈ నెల 15కు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫెయిల్ అయిన 3.28 లక్షల మంది అభ్యర్థులకు సంబంధించిన రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని ఇంటర్మీడియెట్ బోర్టు హైకోర్టుకు తెలిపింది. పూర్తి వివరాలు సమర్పించడానికి మరో వారం రోజుల సమయం కావాలని అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు ఈ సందర్భంగా కోర్టును కోరారు. దాంతో ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు గ్లోబరీనా టెక్నాలజీ సంస్థను కూడా ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. కాగా ఈ నెల 10వ తేదీన ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇంటర్ అవకతవకలపై న్యాయ విచారణ చేయాలి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాపాలన గాడి తప్పిందని, ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయాలని, విద్యార్థుల చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన ‘ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల నివారణ’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జస్టిస్ ఈశ్వరయ్య, విద్యావేత్త చుక్కారామయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వర్రావు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, కాసీంలతో పాటు పలువురు సామాజిక వేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఇంటర్‌బోర్డు, గ్లోబరీనా సంస్థ చేసిన తప్పుల వల్ల 24 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం ఏర్పాటుచేసి–మేధావులు, విద్యావంతులతో పరిష్కార మార్గాలు కనుగొనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కంచ ఐలయ్య మాట్లాడుతూ..ఇంటర్ విద్యను రద్దు చేసి రానున్న విద్యాసంవత్సరం నుంచి 11వ తరగతి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 12వ తరగతి వరకూ హైస్కూల్స్ విద్య ద్వారా గ్రామాల్లోని పేద ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ ప్రపంచాన్ని మార్చే ఒకేఒక్క ఆయుధం విద్య అని అలాంటి విద్యను వ్యాపారంగా చేసి పేద ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు చెలగాటమాడుతు న్నాయని మండిపడ్డారు. నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థల్లో చదివిన ఏ ఒక్కరూ మేధావులు కాలేదని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలను రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్బంధాలకు, విద్యార్థులపట్ల చూపుతున్న వైఖరికి నిరసనగా 48 గంటల్లో నగరంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆచార్య కాసీం మాట్లాడుతూ పాలకుల వల్లే విద్య వ్యాపారంగా మారిందని, తెలంగాణలో వ్యాపార ధోరణిలు పెట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నేతలు విక్రంగౌడ్, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ ప్రమాణం చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరీనా ఐటీ కంపెనీ తనకు తెలియదని కేటీఆర్ చెప్పడం అబద్ధమని తెలిపారు. గ్లోబరీనా కంపెనీ తెలియదని అమ్మవారి మీద ప్రమాణం చేస్తావా అని కేటీఆర్‌కు సవాలు విసిరారు. కేటీఆర్ రేపు ఉదయం 12 గంటలకు పెద్దమ్మ గుడి వద్దకు రావాలని అన్నారు. ఆయన పెద్దమ్మ గుడి దగ్గరకు రాకపోతే గ్లోబరీనా ఐటీ కంపెనీతో ఆయనకు సంబంధం ఉన్న మాట నిజమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు ఐటీ కంపెనీ గురించి తెలియదా అని ప్రశ్నించారు. -
‘ఇంటర్’వివాదానికి కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నెలకొన్న వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ శనివారం తమ నివేదికను సమర్పించింది. కమిటీకి చైర్మన్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్ డొంగరి, బిట్స్ ప్రొఫెసర్ ఏ.వాసన్ బృందం దాదాపు 5రోజుల పాటు సుదీర్ఘ పరిశీలన చేపట్టిన కమిటీ పది పేజీల నివేదికను రూపొందించింది. పరిశీలన ప్రక్రియంతా నాలుగు ప్రధాన అంశాలుగా విభజించింది. కాంట్రాక్టు సంస్థకు అప్పగించిన విధులు, ఉపయోగించిన మానవ వనరులు, తప్పిదాలు జరిగిన ప్రక్రియ–తీసుకున్న చర్యలు, సాంకేతికత అంశాల ఆధారంగా పరిశీలన చేపట్టింది. వీటిని లోతుగా సమీక్షించిన కమిటీ పలు అంశాలను గుర్తిస్తూ నివేదికను రూపొందించింది. దీంతోపాటుగా పొరపాట్ల సవరణ, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అంశాలపైనా లోతైన విశ్లేషణ చేసి ఐదు అంశాలతో కూడిన సూచనలను నివేదికతో జతచేసి ప్రభుత్వానికి అందించింది. కాగా, త్రిసభ్య కమిటీ నివేదికపై ఇంటర్ విద్యా జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, కళింగ కృష్ణకుమార్ హర్షంవ్యక్తం చేశారు. కమిటీ ప్రభుత్వానికి నివేదించిన నివేదికలోని పలు ముఖ్యాంశాలు.. అసౌకర్యం.. ఆగమాగం! ఇంటర్మీడియట్ బోర్డుతో కాంట్రాక్టు సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. డేటా మైగ్రేషన్, మొబైల్ యాప్‌కు అనుసంధానమయ్యేలా విద్యార్థుల ఆన్లైన్ సర్వీసు, అడ్మిషన్ మాడ్యూల్, పరీక్షా కేంద్రాల నిర్వహణ (థియరీ, ప్రాక్టికల్), ప్రీ ఎగ్జామినేషన్ (జంబ్లింగ్, హాల్టిక్కెట్ల జనరేషన్), పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ చేయాలి. కానీ నిర్దేశించిన పనులను కాంట్రాక్టు సంస్థ సకాలంలో పూర్తి చేయలేదు. నిర్దేశిత గడువుదాటి పూర్తిచేసినా అందులోనూ చాలా లోపాలున్నాయి. దీంతో కలిగిన అసౌకర్యమే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. దీనికి కాంట్రాక్టు సంస్థతో పాటు ఇంటర్మీడియట్ బోర్డుదీ బాధ్యతే. బాధ్యతల నిర్వహణలో వైఫల్యం ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశించిన బాధ్యతల్లో కీలక ఘట్టాలను సైతం కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం చేసింది. హాల్‌టికెట్ల జారీ, ఫలితాల విడుదల తదితర కార్యక్రమాలను నిర్దేశించిన తేదీల కంటే ముందుగా మాక్‌టెస్ట్ నిర్వహించాలి. ఓకే అనుకన్న తర్వాతే ఫలితాలు వెల్లడి చేయాలి. కానీ ఇందుకు తగిన ప్రామాణిక నిర్వహణ వ్యవస్థను కాంట్రాక్టు సంస్థ ఎక్కడా వినియోగించలేదు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రాజెక్టులో చోటుచేసుకున్న పొరపాట్లు, తప్పిదాలను గుర్తించి పూర్తిస్థాయి నివేదికను గ్లోబరీనాకు అందించారు. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలలో ఈ తంతు జరిగింది. బోర్డు చేసిన సూచనలను గ్లోబరీనా విస్మరించింది. వీటిని పరిష్కరించకుండానే మళ్లీ ప్రతిపాదనలు పంపగా.. బోర్డు ఆమోదించలేదు. మొత్తంగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశించిన బాధ్యతలను నిర్వహించడంలో గ్లోబరీనా పూర్తిగా విఫలమైంది. ఫలితాల వెల్లడిలో తప్పులు 531 మంది జాగ్రఫీ విద్యార్థుల ప్రాక్టికల్ మార్కులు వారి మెమోల్లో కనిపించలేదు. 496 మంది విద్యార్థుల మెమోల్లో వారి మార్కులకు బదులుగా ఏపీ అని వచ్చింది. కొంతమంది విద్యార్థుల మెమోలో ఏఎఫ్ అని వచ్చింది. 4,288 మంది ఎంఈసీ విద్యార్థులకు మ్యాథమేటిక్స్ సబ్జెక్టులో సింగిల్ డిజిట్ మార్కులు వచ్చాయి. ఓఎంఆర్ షీట్ల బబ్లింగ్‌లో చోటుచేసుకున్న తప్పిదాలతో, కొందరికి సరైన మార్కులు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సాంకేతిక సమస్యల కారణంగానే ఇలాంటి తప్పులు జరిగాయి. విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన మాడ్యూల్‌ను గ్లోబరీనా సంస్థ సకాలంలో అభివృద్ధి చేయలేదు. గతంలో ఈ ప్రక్రియంతా సీజీజీ చూసుకుంది. కానీ తాజాగా ప్రాజెక్టు బాధ్యతలు తీసుకున్న గ్లోబరీనా అన్ని అంశాల్లోనూ దారుణంగా వెనుకబడింది. కనీసం గతేడాది డిసెంబర్ నాటికి కూడా వీటిని పూర్తి చేయలేదు. ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్‌లో అసమానతలు, ఆన్లైన్ ప్రశ్నాపత్రాలు, ప్రాక్టికల్ పరీక్షల మార్కుల స్వీకరణ, హాల్‌టిక్కెట్లలో తప్పిదాలు, పరీక్షా కేంద్రాల్లో సరిపోలని విధానంతో భారీగా తప్పిదాలు జరిగాయి. అతి పెద్ద తప్పిదమేమిటంటే ఫలితాల విడుదలకు ముందే.. వచ్చిన రిజల్ట్స్‌ను మరో సంస్థతో ప్రాసెస్ చేసి ఉండాల్సింది. రెండు రికార్డులు సరిపోలిన తర్వాత స్పష్టత వచ్చినప్పుడు ఫలితాలను విడుదల చేసుంటే బాగుండేది. గతేడాది అదే తరహాలో చేసినా.. ఇప్పుడు ఇలాంటి పరిశీలనలేమీ లేకుండానే ఫలితాలు విడుదల చేశారు. దీంతోనే గందరగోళం తలెత్తింది. తక్షణ సూచనలు సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు కూడా.. పొరపాట్లను తక్షణమే సవరించాలని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సూచించింది. వీటితోపాటు భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా నూటికి నూరుశాతం కచ్చితమైన ఫలితాలు ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సైతం సూచించింది. ఒక విద్యార్థి మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టుల్లో 80% మార్కులు సాధించి.. రెండో సంవత్సరంలో ఫెయిల్ అయినట్లు తేలితే బోర్డు యంత్రాంగం వెంటనే సదరు సబ్జెక్టు జవాబుపత్రాన్ని రీ–వెరిఫికేషన్ చేయాలి. వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు ఇవ్వాలి. ఐవీఆర్ ఆధారిత హెల్ప్‌లైన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి. సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తితే వాటిని సంక్షిప్త సమాచారం, ఈమెయిల్ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. హాల్‌టిక్కెట్ నంబర్‌ను కూడా ఐవీఆర్తో క్యాప్చర్ చేసేలా ఉండాలి. అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్ పంపించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. బోర్డు నిర్దేశించిన ప్రాజెక్టును కాంట్రాక్టు సంస్థతోనే కాకుండా మరో స్వతంత్ర సంస్థతో ప్రాసెసింగ్ చేయించి రెండింటి ఔట్‌కమ్ సరిపోలిన తర్వాతే ఫలితాలు వెల్లడించాలి. త్వరలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అన్ని ప్రక్రియలను మాక్‌టెస్ట్ నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. మాక్‌టెస్ట్‌ల్లో ప్రధాన తప్పిదాలు గుర్తిస్తే సవరించేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో ఏం చేయాలంటే! భవిష్యత్తులో నిర్దేశిత ప్రాజెక్టును చేపట్టే కంపెనీ ఎంపిక పక్కాగా ఉండాలి. పరీక్షల నిర్వహణ, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రంగం లో అనుసరిస్తున్న విధానాలు కవర్ చేస్తూ ఆదర్శవంతమైన సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేయాలి. అడ్మిషన్ల నుంచి ఫలితాల విడుదల వరకు అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు బోర్డులో సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ప్రాజెక్టు తీరును పరిశీలిస్తుండాలి. మాక్టెస్ట్ల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలి. అన్నీ సర్వీసుల మాడ్యూల్స్‌కు సంబంధించిన ఔట్పుట్ అందుబాటులోకి వచ్చే కంటే 4 వారాల ముందే టెస్ట్‌డ్రైవ్ జరపాలి. నిర్వహణాపరమైన అంశాలను సర్వీస్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. సర్వీసు ప్రొవైడర్ అనుసరిస్తున్న పద్దతులన్నింటినీ డాక్యుమెంటేషన్ చేయాలి. అన్ని మాడ్యుల్ సర్వీసులకు సంబంధించి ముందుగా మాక్ టెస్ట్, బీటా టెస్ట్‌లు తప్పనిసరిగా చేయాలి. అలా చేసిన టెస్ట్‌ల తాలూకు ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నప్పుడు ఇంటర్‌బోర్డు ప్రత్యేక కమిటీ, ఈడీపీ బృందం విశ్లేషించి ఫలితాలు ప్రకటించాలి. కనీసం రెండు వారాలకు ముందు ఫీడ్‌బ్యాక్‌ను సర్వీస్ ప్రొవైడర్‌కు అందజేయాలి. సమాచార సమన్వయలోపం లేకుండా చూసుకునేందుకు.. ప్రత్యేకంగా టెక్నికల్ సెల్ ఏర్పాటు చేయాలి. అనుభవం, సరైన పరిజ్ఞానం ఉన్న అధికారులను ఇందులో నియమించాలి. ప్రత్యేక కమిటీల్లో ఉండే వారికి శిక్షణ తరగతులు నిర్వహించి అప్డేట్ చేయాలి. పనితీరు అధ్వానం ప్రాజెక్టులో భాగంగా బోర్డు నిబంధనలకు అనుగుణంగా కావాల్సిన సాంకేతికత, మానవ వనరులను గ్లోబరీనా సంస్థ సమకూర్చింది. ఇంటర్మీడియట్ బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చేపట్టాల్సిన కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలి. కానీ.. ఈ ప్రక్రియలో కాంట్రాక్టు సంస్థ బాగా వెనకబడింది. సరైన వనరులను సమకూర్చితేనే నాణ్యతతో కూడిన ఫలితం వచ్చేది. గ్లోబరీనా సంప్థ పనితీరు అసంతృప్తికరంగా, అధ్వానంగా ఉంది. -
చదువుకుంటే చనిపోవాల్సి వస్తోంది..
హైదరాబాద్(పంజగుట్ట): ఈ నెల 29న ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాలని తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజమే ఈ ధర్నాకు పిలుపునిచ్చిందని భావించి విద్యార్థి సంఘాలు, అన్ని పార్టీల నాయకులు హాజరు కావాలని కోరారు. ఇంటర్ పరీక్షాఫలితాల్లో 61 వేల తప్పిదాలు వచ్చాయని, దీనికి అనుభవంలేని గ్లోబరీనా సంస్థే కారణమని అన్నారు. ‘చదువుకుంటే బాగుపడతారని అనుకుంటాం, కానీ చదువుకుంటే చనిపోతాం’అని ఇప్పుడే తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి జనసమితి అధ్యక్షుడు నిజ్జన రమేశ్ ముదిరాజ్ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ఇంటర్ ఫలితాలు... దోషులు ఎవరు? పరిష్కారం ఏది?’అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్, టీజేఎస్ నేత ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావుతోపాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు. అన్ని సంఘాలను, పార్టీలను ఏకం చేసి ఉద్యమించే బాధ్యతను కోదండరాంకు అప్పగించాలని, ఇంటర్ ఫలితాల అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సమావేశం తీర్మానించింది. కోదండరాం మాట్లాడుతూ గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎంతో బాధ్యతగా పనిచేసిందని, దాన్ని కాదని గ్లోబరీనా అనే ప్రైవేట్ సంస్థకు ఇంటర్ పరీక్షల బాధ్యత అప్పగించినప్పటి నుండీ ఎన్నో సమస్యలు వచ్చాయన్నారు. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలోనూ తీవ్ర గందరగోళం జరిగిందని, అప్పుడే ఇంటర్ బోర్డు మేల్కొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. సంస్థ వెనక ఎవరో ఉన్నారని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో ఆడుకున్నారని, లక్షలాదిమంది పిల్లల ప్రాణాలను పణంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ చేస్తున్న తప్పుల గురించి ముందే తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాళ్లు ఏదైనా తప్పులు జరిగితే తమకు సంబంధంలేదని, వారి సంఘం తరపున తీర్మానం చేసి బోర్డు సెక్రటరీకి ఇచ్చారని, అయినా ప్రభుత్వంలో ఉలుకూపలుకూ లేదని దుయ్యబట్టారు. సమాజానికి పిల్లర్ల వంటి పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఆవేదనగా ఉందన్నారు. గ్లోబరీనాకు పర్చేస్ ఆర్డరే ఉంది.. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ‘గ్లోబరీనా, రాష్ట్ర ప్రభుత్వం ఐక్యంగా పనిచేస్తున్నాయి. కానీ మనమే సంఘాలుగా విడిపోయి నిరసనలు చేస్తున్నాం, ఇప్పటికైనా అందరం ఐక్యమై ఉద్యమించాలి’అని అన్నారు. ‘ఇంత జరుగుతున్నా ఏం జరగలేదు, అన్ని అపోహలు, రాజకీయం చేస్తున్నారని అంటున్నారు, ఏం జరగకపోతే ఇన్ని ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి?, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి’అని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థకు కేవలం పర్చేస్ ఆర్డర్ మాత్రమే ఉందని, అగ్రిమెంట్ లేదని, అగ్రిమెంట్ లేకుండా ఎంతో గోప్యంగా ఉంచాల్సిన విద్యార్థుల మార్కుల జాబితా వ్యవహారాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఎంసెట్ లీకేజీ, నయీం కేసు మాదిరిగా ఈ కేసు కూడా నీరుగారిపోకుండా ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, గ్లోబరీనా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, టీడీఎఫ్ అధ్యక్షుడు డీపీ రెడ్డి, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, నాయకులు బైరి రమేశ్, వెంకట్, భవాని, మమత, సత్యనారాయణ, అరుణ్ కుమార్, వెంకట్ స్వామి, గోపాల్ శర్మ, తదితరులు పాల్గొన్నారు. నియంత పాలన నడుస్తోంది... మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన నడుస్తోంది. క్యాబినెట్ లేదు, ఎవ్వరూలేరు. అన్ని నేనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణం ముఖ్యమంత్రే అని, ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో నిషేధానికి గురైందని, అలాంటి దానికి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీని వెనక ఎవరు ఉన్నారనే విషయంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని అందరూ అంటున్నారు, కాని నిర్ణయాలన్నీ ప్రగతిభవన్ నుండి ముఖ్యమంత్రే చేస్తున్నారు. తెలంగాణలో వ్యవస్థ నడవడంలేదు, కేవలం నేను, నా కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’అని అన్నారు. -
‘గ్లోబరీనా’దే గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో భారీగా చోటు చేసుకున్న పొరపాట్లకు కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌దే తప్పని స్పష్టమవుతోంది. ఫలితాలపై నెలకొన్న పరిస్థితి ని క్షుణ్నంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈ వ్యవ హారంలో జరిగిన పొరపాట్లను గుర్తించి నివేది కలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఫలితాల్లో తప్పిదాలకు కాంట్రాక్టు సంస్థదే ప్రధాన బాధ్యతగా కమిటీ అభిప్రాయ పడినట్లు సమాచారం. పరీక్ష ఫీజుల చెల్లింపు వెబ్సైట్ సరిగ్గా పని చేయకపోవడం మొదలు డేటా ప్రాసెసింగ్, లోపాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు, ఫలి తాల ప్రాసెసింగ్ వరకు గ్లోబరీనా సంస్థ అనేక సాంకేతిక తప్పిదాలకు పాల్పడిందని కమిటీ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అలాగే గ్లోబరీ నాకు కాంట్రాక్టు ఇవ్వడంలోనూ వ్యూహాత్మక తప్పిదం జరిగిందని, నిబంధనలను పట్టించు కోకుండా బోర్డు ఏకపక్షంగా కాంట్రాక్టును కట్టబెట్టినట్లు కమిటీ గుర్తించింది. కాంట్రాక్టు ప్రారంభమైన నాటి నుంచి గ్లోబరీనా పలు సాంకే తిక పొరపాట్లు చేసినా బోర్డు కనీసం పట్టించు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కమిటీ తేల్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదే విధంగా కాంట్రాక్టు కట్టబెట్టడంలో జరిగిన అవకతవకలపైనా ఆరా తీసినట్లు సమాచారం. సమాచారమంతా నివేదికలోకి... ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై త్రిసభ్య కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. పరీక్షల నిర్వ హణ, ఫలితాల వెల్లడిలో జరి గిన ప్రక్రియనంతా వడపోసిన కమిటీ... ఇందులో బాధ్యులుగా ఉన్న వారిని కేటగిరీలవారీగా విభజించి వివరాలను సేకరిం చింది. ఇంటర్ బోర్డు అధి కారులు, ఉద్యోగులతోపాటు గ్లోబరీనా ప్రతినిధులు, గతంలో పరీక్షల నిర్వహణలో కీలకపాత్ర పోషించిన వారితోనూ మాట్లాడింది. అలాగే కాంట్రాక్టు సంస్థ, ఇంటర్ బోర్డు అధికారులపై వస్తున్న విమర్శలపైనా సమాచారాన్ని సేకరించి నట్లు తెలిసింది. ఈ వివరాలతోపాటు అధికారు లపై వచ్చిన ఆరోపణలు, మీడియా కథనాలను క్రమ పద్ధతిలో సేకరించి వాటిని విశ్లేషించింది. కమిటీ ఇచ్చే నివేదికతో పాటు బయటివర్గాల నుంచి విశ్వసనీయంగా సేకరించిన వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ష్... గప్‌చుప్... లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గందర గోళంలో పడేసిన ఇంటర్ ఫలితాల విషయంలో తప్పొప్పుల నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రస్తుతం తమ విచారణ వివరాలను ఎక్కడా ప్రస్తావించడంలేదు. కనీసం మీడియాతో సైతం మాట్లాడేందుకు నిరాకరిస్తోంది. కమిటీ చైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులు సైతం పరిశీలన తాలూకు అంశాలను బయటకు వెల్లడి కానివ్వడం లేదు. ఇంటర్ ఫలితాల తప్పిదాలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటం... లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో కమిటీ సభ్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నివేదికలోని అంశాలు బయటపడితే పరిస్థితి తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించే వరకు కమిటీ బృందం అత్యంత గోప్యత పాటించాలని నిర్ణయించిన క్రమంలో ఎప్పుడు ప్రభుత్వ దరికి నివేదిక చేరుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. త్రిసభ్య కమిటీపై తీవ్ర ఒత్తిడి? ఇంటర్ ఫలితాల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై ఒత్తిడి తీవ్రమవుతోంది. మూడు రోజుల్లో పరిస్థితిని పూర్తిగా పరిశీలించి సుదీర్ఘ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించంతో గురువారమే వివరాల సేకరణ పూర్తి చేసింది. అయితే శుక్రవారం సాయంత్రం నాటికి కూడా నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. సాంకేతిక కారణాలతో నివేదిక సమర్పణలో జాప్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో నివేదిక సమర్పణ కోసం కమిటీపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు గ్లోబరీనా సంస్థపై ఆరోపణలకు తోడు... ఆ సంస్థ తప్పిదాలు, ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులతో కొనసాగించిన వ్యవహారాలపై కమిటీ తన నివేదికలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కమిటీపై గ్లోబరీనా సంస్థ కూడా ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫలితాల విషయంలో సంస్థ పొరపాట్లు లేవనే అంశాన్ని బలంగా వినిపించేందుకు కాంట్రాక్టు సంస్థ రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నివేదికలో సంస్థ పరపతికి భంగం కలగకుండా చూడాలని కమిటీని కోరేందుకు గ్లోబరీనా యాజమాన్యం శతవిధాలా ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కమిటీ సభ్యులు నివేదికను అత్యంత గోప్యంగా ప్రభుత్వానికి చేరవేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. -
కార్పొరేట్ గుప్పెట్లో ఇంటర్ బోర్డు
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ కాలేజీల గుప్పెట్లో చిక్కి ఇంటర్మీడియట్ బోర్డు విలవిల్లాడుతోంది. బోర్డు అడ్డాగా కార్పొరేట్ అవినీతి, అక్రమాల దందా దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయింది. బోర్డులోని కొంతమంది కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై ఆ సంస్థల అక్రమాలకు ప్రోత్సాహం అందిస్తూ వస్తు న్నారు. దీంతో ఆ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా ఈ దందా కొనసాగుతూనే ఉంది. బోర్డు లోని తమ అనుకూల వ్యక్తులతో అడ్డగోలు వ్యవ హారాలు నడుపుతూ చివరకు బోర్డు ప్రతిష్టనే అభాసుపాలు చేసే ప్రయత్నాలకు ఒడిగడుతున్నా రని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్మీ డియట్ బోర్డులో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కార్పొరేట్ పాత్ర పైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఇదే వ్యవహారం రాష్ట్రంలో కార్పొరేట్ జూనియర్ కాలేజీల దందా ఎప్పటినుంచో కొనసాగుతోంది. బోర్డు అధికారుల అలసత్వం, ఆమ్యామ్యాలకు అలవాటు పడడం కారణంగా ఈ సంస్థల ఆగడాలకు అడ్డూఅదుపూ ఉండడంలేదు. పేరుకే నిబంధనలు జారీచేసే అధి కారులు వాటిపై పకడ్బందీ చర్యలు చేపట్టిన దాఖ లాలు పెద్దగా లేవు. అకడమిక్ అంశాల నుంచి మొదలుకొని కాలేజీల అనుమతులు, నిర్వహణ అంశాల వరకు అదే పరిస్థితి. అంతేకాదు రిటైరైన అధికారులను కన్సల్టెంట్లు, ఓఎస్డీ పేరుతో కొన సాగించేలా పావులు కదిపి తమ పనులను చేయిం చుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ఈ కార్పొ రేట్ సంస్థల కాలేజీల్లో అనేక తప్పిదాలు, అక్ర మాలు జరుగుతున్నా బోర్డు అధికారులు పట్టించు కున్న దాఖలాలు లేవన్న ఆరోపణలున్నాయి. ఆశాస్త్రీయ విధానానికి కార్పొరేట్ ఊతం రాష్ట్రంలో అశాస్త్రీయ విద్యావిధానానికి కార్పొరేట్ విద్యాసంస్థలే తెరలేపాయి. అడ్డగోలు విధానాలతో జూనియర్ కాలేజీ విద్యావిధానాన్ని భ్రష్టు పట్టిం చాయి. కొద్దిమంది విద్యార్థుల ర్యాంకులను ఎరచూపి లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కార్పొరేట్ ఒత్తిడితోనే ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణల అమలు జరగడంలేదు. ప్రస్తుతం సీబీఎస్ఈలో 11, 12 తరగతుల విధానం ఉంది. రాష్ట్రంలో మోడల్ స్కూళ్లు, గురుకులాల్లో ఇదే విధానం ఉంది. వాటిల్లో జూనియర్ లెక్చరర్ కేడర్‌తో సమానమైన పీజీటీకి బీఎడ్ తప్పనిసరి. కానీ జూనియర్ కాలేజీల్లో కార్పొరేట్ విద్యాసంస్థల ఒత్తిడితోనే ఈ నిబంధన అమలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కార్పొరేట్ కాలేజీల్లో బోధన నిర్వహించిన 220 రోజులను కూడా సక్రమంగా అమలు చేయడంలేదు. ఎంసెట్, నీట్, జేఈఈ శిక్షణలతోనే సరిపెడుతున్న యాజమాన్యాలు బోర్డు అధికారులను, జిల్లా ఇంటర్ విద్యా అధికారులను మేనేజ్ చేస్తూ విద్యార్థులపై తీవ్రఒత్తిడి పెంచి ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. అయినా వీరిపై బోర్డు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు పక్కా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారుల కమిటీ పలుమార్లు సిఫారసు చేసినా, బోర్డు అధికారులు వీటి అమలును గాలికి వదిలేశారు. లోపాలు అనేకం.. అయినా చర్యల్లేవ్! ఒక చోట కాలేజీ అడ్రస్.. మరో చోట విద్యా సంస్థ.. పేరుకే ఆన్లైన్ ప్రవేశాలు.. అంతా ఇష్టారాజ్యమే. ఒక సొసైటీ పేరుతో కాలేజీలు, మరో పేరుతో నిర్వహణ విద్యార్థులకు రక్షణ ఉండదు. వేసవి సెలవుల్లో తరగతుల నిర్వహణ ఇలాంటి అనేక లోపాలపై బోర్డుకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాలేజీల హాస్టళ్లలో ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కి, కనీస వసతులు కల్పించకపోయినా, వాటిపై అనేక ఫిర్యాదులు వచ్చినా బోర్డు అధికారుల్లో కనీస స్పందన లేదు. గతేడాది 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అధికారుల కమిటీలు తనిఖీలు చేశాయి. బోర్డు.. నిపుణల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసులు చేసింది. వాటి ప్రకారం హాస్టళ్లకు అనుమతులు తప్పనిసరి అని, వాటిల్లో ఉండాల్సిన ప్రమాణాలు, వసతులపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినా బోర్డు వాటిని పక్కాగా అమలు చేసినా దాఖలాలు లేవు. విద్యార్థుల భవిష్యత్తు పేరుతో కార్పొరేట్ సంస్థలు బోర్డుపై ఒత్తిళ్లు తెచ్చి సడలింపులు పొందుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో 500కు పైగా జూనియర్ కాలేజీలు హాస్టళ్లతో నడుస్తుంటే.. అందులో సగం యాజమన్యాలు కూడా బోర్డుకు దరఖాస్తు చేసిన దాఖలాలు లేవు. విద్యార్థుల జీవితాలతో ఆటలు రాష్ట్రంలోని కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయాలు ఫీజులుగా వసూలు చేస్తున్నాయి. పీఆర్వోల వ్యవస్థను పెట్టి ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వాటిల్లో కనీస వసతులు ఉన్నాయా? లేదా? అన్నది కూడా తల్లిదండ్రులు చూసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసమని వాటిల్లో చేర్చుతూ పిల్లలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకుంటున్న యాజమాన్యాలు.. అనుమతులు తీసుకోకుండానే బ్రాంచీలను ఏర్పాటు చేస్తూ, ఒకే క్యాంపస్‌లో రెండేసి కాలేజీలను నడుపుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయి. అయినా ర్యాంకుల ప్రచారహోరులో తల్లిదండ్రులు వాటినే ఆశ్రయిస్తుండటంతో కార్పొరేట్ యాజమాన్యాలు తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నాయి. కార్పొరేట్ వ్యాపారానికే బోర్డు జై ఇంటర్‌బోర్డు కార్పొరేట్ విద్యావ్యాపారానికి అనుకూల సంస్థగా మారిపోయింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రైవేటు కార్పొరేట్ విద్యావ్యాపారం తెలంగాణలోనే జరుగుతోంది. ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల్లో 80 శాతానికిపైగా కార్పొరేట్ కాలేజీల్లోనే ఉన్నారు. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వ లెక్చరర్లతోపాటు కార్పొరేట్ కాలేజీల లెక్చరర్లకు కూడా ఇచ్చారు. ఆయా కాలేజీల నుంచి వచ్చే లెక్చరర్లు నిజంగా వారి కాలేజీల్లో పాఠాలు చెప్పిన వారు కాదు. కాబట్టి వ్యాల్యుయేషన్ పెద్ద ఫార్సుగా మారిపోయింది. కార్పొరేట్ సంస్థలకు బోర్డు సర్వెంట్‌గా మారిపోయింది. కాబట్టి బోర్డును ప్రక్షాళన చేయాలి. లేదా బోర్డు ఎత్తేసి సీబీఎస్ఈ తరహాలో పాఠశాల విద్యలో కలపాలి. – నాగటి నారాయణ, తల్లిదండ్రుల సంఘం కమిటీ పరిశీలన పూర్తి! ఇంటర్మీడియట్ ఫలితాల వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిశీలన దాదాపుగా పూర్తయింది. టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ వాసన్, ప్రొఫెసన్ నిషాంత్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ.. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం, ఫలితాలకు సంబంధమున్న అధికారులు, ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనా ప్రతినిధులతో వేరువేరుగా విచారించింది. మూడురోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వేగవంతంగా పరిశీలన చేసి గురువారం నాటికి పూర్తిచేసినట్లు తెలిసింది. వాస్తవానికి గురువారం రోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. రాత్రి పొద్దుపోయే వరకు కూడా కమిటీ నివేదిక సమర్పించలేదని సమాచారం. శుక్రవారం ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. సాంకేతిక బాధ్యత మరో సంస్థకు ఇంటర్మీడియట్ రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌తో పాటు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి ప్రభుత్వ రంగసంస్థ సీజీజీ లేదా మరో ఇతర సంస్థ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకునే అవకాశం ఉంది. గ్లోబరీనాపై పలు తప్పిదాలు చేయడం, తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో ఇకపై ఆ సంస్థ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా వచ్చే నెల 16 నుంచి జరగాల్సిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష (ఏఎస్ఈ) తేదీల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడం.. వాటికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండడంతో ఏఎస్ఈ తేదీలను ముందుకు జరిపే అవకాశముంది. -
ఇంటర్ ఫలితాలపై సీఎం సీరియస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్‌లో తలెత్తిన లోపాలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. 9.74 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిఉన్న ఫలితాలను ప్రాసెస్ చేసేప్పుడు ఒకటికి రెండు, మూడుసార్లు చెక్ చేసుకోకుండా ఎలా వెల్లడిస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సామర్థ్యంలేని సాఫ్ట్వేర్ సంస్థకు పనులను ఎలా అప్పగించారని మండిపడ్డారని సమాచారం. దీంతోపాటుగా.. ఆయన్ను రీ–వెరిఫికేషన్ కమ్ ఫొటో స్కాన్డ్ కాపీ, రీ–కౌంటింగ్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. తక్కువ కోట్ చేశారన్న సాకుతో నిబంధనలను కూడా సరిగ్గా అమలు చేయకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఆ సంస్థ 2017–18 విద్యాసంవత్సరంలో వార్షిక, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రాసెసింగ్‌ను సరిగా చేసి చూపించనపుడు.. ఆ సంస్థతో ఒప్పందం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అధికారులు చేసే తప్పుల వల్ల ప్రభుత్వం బదనాం అవుతోందని, ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం అయితే సహించేది లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తినపుడు సదరు సంస్థ ఒప్పందం రద్దు చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, పైగా ఆ సంస్థ ప్రవేశాల ప్రాసెసింగ్ సరిగ్గా చేయలేదని ఆ పనులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి అప్పగించిన సమయంలోనే.. ఆ సంస్థతో ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పటినుంచి హాల్‌టికెట్ల జనరేషన్, ఆన్లైన్లో ప్రాక్టికల్ మార్కుల అంశం సరిగాచేయలేని సంస్థను ఎందుకు కొనసాగించారని కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారం పక్కాగా జరిగేందుకు చర్యలు చేపట్టడంతోపాటు అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షల తరువాత సదరు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు ఆ సంస్థ చేసుకున్న ఒప్పందం, దాని ప్రకారమే పని చేసిందా? లేదా? అన్న దానిపైనా విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విద్యార్థులకు తక్కువ మార్కులు వేయడం, పరీక్షలకు హాజరైనా గైర్హాజరైనట్లు చూపడం వంటివి సాఫ్ట్వేర్ సమస్యల కారణంగానే దొర్లినట్లు స్పష్టమైంది. మరోవైపు త్రిసభ్య కమిటీ కూడా ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి పూర్తి స్థాయి నివేదికను ఇవ్వనుంది. ఆ తర్వాత సదరు సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ సెలవుపై వెళ్లనున్నట్లు తెలిసింది. సందేహాలుంటే డీఐఈవోలను సంప్రదించండి ఆర్వీ, ఆర్సీలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇంటర్ బోర్డు సూచన ఇంటర్ ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్(ఆర్వీ), రీకౌంటింగ్(ఆర్సీ) కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు bie.telangana.gov.in వెబ్సైట్ లేదా టీఎస్ఆన్లైన్ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రీవాల్యుయేషన్‌కు రూ.600, రీకౌంటింగ్‌కు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపింది. మరింత సమాచారం కోసం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. డీఐఈవో హైదరాబాద్–9848781805, డీఐఈవో రంగారెడ్డి– 9848018284, డీఐఈవో మేడ్చల్– 9133338584 లోనూ సంప్రదించవచ్చంది -
ఇంటర్ అవకతవకలు : అంతా పథకం ప్రకారమే!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రాజెక్టు టెండర్ కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు ఉన్నతాధికారులు తమకు అనుకూలురైన వారికి మేలు జరిగే విధంగా టెండర్ విధానాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఒక పని లేదా ప్రాజెక్టు అమలును నేరుగా ప్రైవేటు సంస్థకు అప్పగించకుండా టెండర్లు పిలిచి కాంట్రాక్టు సంస్థను ఖరారు చేస్తారు. టెండర్లు పిలిచిన సమయంలో ఆశావహ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించి తక్కువ ధరలో కోట్ చేసే సంస్థకు ప్రాజెక్టు బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకు సంబంధించి నిపుణుల సమక్షంలో దరఖాస్తు పరిశీలన జరుగుతుంది. కానీ ఇంటర్ బోర్డు డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు అప్పగింత అంతా ఏకపక్షంగా జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు ఉన్నతాధికారులు తమకు అనుకూల సంస్థకు కాంట్రాక్టు దక్కేలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కేవలం అనుకూల సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ వేసింది రెండు సంస్థలే! ఇంటర్ అడ్మిషన్లు, ప్రీ ఎగ్జామినేషన్, పోస్ట్ ఎగ్జామినేషన్, రిజల్ట్స్ ప్రాసెసింగ్, ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ తదితర పనులకు ఇంటర్మీడియెట్ బోర్డు 2017 సెప్టెంబర్‌లో టెండర్లు పిలిచింది. నెల రోజులపాటు బిడ్ల దాఖలుకు అవకాశం కల్పించినప్పటికీ కేవలం రెండు సంస్థలు మాత్రమే టెండర్లు వేశాయి. గడువులోగా కేవలం గ్లోబరీనా టెక్నాలజీస్, మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఈ క్రమంలో టెండర్లు తెరిచి ఖరారు చేసే పనిలో భాగంగా ఎల్1 (లోయెస్ట్ వన్) కంపెనీగా ఉన్న గ్లోబరీనాను ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త సంస్థ అయినప్పటికీ తక్కువ మొత్తానికి కోట్ చేయడంతో ఎంపిక చేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. గ్లోబరీనా సంస్థ సేవలను ఇంటర్ బోర్డు మూడేళ్లపాటు వినియోగించుకోనుంది. అంతా పథకం ప్రకారమే... డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్, ఓఎంఆర్ షీట్ల స్కానింగ్‌కు సంబంధించిన ప్రాజెక్టు అనుకూల సంస్థకు అప్పగించడం అంతా పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు పది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే భారీ ప్రాజెక్టుకు కేవలం రెండు సంస్థలు మాత్రమే టెండర్ వేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ టెండర్లో పాల్గొన్న రెండు సంస్థలు ఒకే కన్సార్షియంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలో జేఎన్టీయూ కాకినాడలో విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆన్లైన్ ఎవాల్యూషన్ కార్యక్రమంలో గ్లోబరీనా, మ్యాగ్న టిక్ సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రక్రియలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆన్లైన్ ఎవాల్యూషన్ చేసినట్లు జేఎన్టీయూ కాకినాడ సర్టిఫై చేసింది. తాజాగా ఇంటర్మీడియెట్ బోర్డుకు ఈ రెండు సంస్థలు అడపాదడపా సేవలం దిస్తున్నట్లు అధికారులు సైతంచెబుతున్నారు. మ్యా గ్నటిక్ సంస్థతో దాదాపు 13 సంవత్సరాలు కలసి పనిచేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ స్వయంగా అంగీకరించారు. టెండర్ ప్రక్రియలో తక్కువ కోట్ చేయడంతో గ్లోబరీనాకు టెండర్ ఖరారు చేశామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ రెండు సంస్థల కు ఉన్న అర్హతల ఆధారంగానే టెండర్ నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. -
‘గంటలు గంటలు సమీక్షలు చేసే సీఎం ఎక్కడా..?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలు, ఇంటర్ బోర్డు అవకతవకలపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఇంటర్ ఫలితాల గందరగోళంపై మంగళవారం ఆయన సీఎస్‌ను కలిశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. పరీక్షల్లో తప్పామనే మనోవేదనతో 16 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మధ్య గొడవ అని మంత్రి, మాస్ హిస్టీరియాతో ఫలితాల్లో గందరగోళం నెలకొందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. గంటలు గంటలు సమీక్షలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను వదిలేసి గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్ ఫలితాల బాధ్యత ఎలా అప్పగించారని ప్రశ్నించారు. వీటన్నిటిపై న్యాయ విచారణ జరగాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం.. ఫలితాలు తారుమారైన పిల్లల తల్లిదండ్రులు నిరసన తెలుపుతుంటే నిర్బంధిస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం చేశారు. పోలీస్ జులుంతో బీజేపీ కార్యకర్తలను చితకబాదారని ఆరోపించారు. ఇప్పటికే ఎంఎసెట్ మూడుసార్లు నిర్వహించారని, గ్రూప్ 2 వాయిదా వేశారని విమర్శలు గుప్పించారు. విద్యావ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థులు తొందరపాటు చర్యలకు దిగొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ వారికి అండగా ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం మెడలు వంచుతామని అన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యం, గ్లోబరీనా సంస్థ అవకతవకలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతామని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు దిష్టి బొమ్మలు దగ్దం చేస్తామని చెప్పారు. -
బయటపడుతున్న గ్లోబరీనా మోసాలు!
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళానికి కారణమైన గ్లోబరీనా సంస్థ మోసాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం.. నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేసింది. ఇక గ్లోబరినా ప్రైవేట్ లిమిటెడ్ ఐటి సొల్యూషన్స్ పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2017లో కాకినాడ జేఎన్టీయూలో ఈ సంస్థ మోసాలు బయటపడ్డాయి. కాకినాడ జేఎన్టీయూలో ఈ లెర్నింగ్. ఈ కంటెంట్ టెండర్లలో గ్లోబరీనా మోసాలకు పాల్పడిందని కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రూ.36 కోట్ల ఒప్పందంతో టెండర్ దక్కించుకున్న సంస్థ రూ.26 కోట్ల అవినీతికి పాల్పడిందని జేన్టీయూ కాకినాడ రిజస్టరే స్వయంగా వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ సంస్థ మోసాలపై గతంలో సీపీఐ నారాయణ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. -
ఇది గ్లోబరీనా వైఫల్యమే
సాక్షి, హైదరాబాద్: డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్ (డీపీఆర్పీ)లో తీవ్రమైన అవకతవకల కారణంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో గందరగోళంలో గ్లోబరీనా సంస్థదే ప్రధాన పాత్ర. ప్రాజెక్టు అమలు బాధ్యతలు తీసుకున్న మొదటిరోజు నుంచీ ప్రతిపనిలోనూ ఈ సంస్థ తీవ్రమైన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. దీని కారణంగానే నేడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడింది. డీపీఆర్పీ ప్రాజెక్టులో భాగంగా గ్లోబరీనా సంస్థ పలుదశల్లో సాంకేతిక సేవలను ఇంటర్మీడియట్ బోర్డుకు అందించాలి. దీనికి అవసరమైన సమాచారాన్ని బోర్డు నుంచి సేకరించి.. కంప్యూటరీకరించడం, విశ్లేషించడం తదితర పనులు సమయానుగుణంగా చేయాలి. కానీ.. ఈ విషయంలో కనీసస్థాయిలో కూడా అనుభవంలేని గ్లోబరీనా సంస్థ టెండరు దక్కించుకున్నప్పటినుంచీ.. బోర్డుతో సమన్వయం చేసుకోవడంలో దారుణంగా విఫలమైంది. దీంతో ప్రాజెక్టు ఆసాంతం తీవ్ర గందరగోళంగా తయారైంది. మొదట్లోనే చేతులెత్తేసినా..! డీపీఆర్పీ ప్రాజెక్టు టెండర్ దక్కించుకున్న గ్లోబరీనా సంస్థ.. ఇంటర్ విద్యార్థుల అడ్మిషన్లు మొదలు పరీక్షాఫలితాలు ఇచ్చే వరకు నిర్దేíసిత కార్యక్రమాలన్నీ చాలా జాగ్రత్తగా చేపట్టాలి. 2018–19 విద్యాసంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టిన కొత్తలోనే గ్లోబరీనా గందరగోళానికి గురై చేతులెత్తేసింది. మొదట ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి డేటా ప్రాసెస్ చేసింది. వారం రోజుల్లో దాదాపు 70వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడంతో ఆయా విద్యార్థుల వివరాలన్నీ కంప్యూటరీకరించింది. కానీ.. ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో ప్రాసెస్ చేసిన విద్యార్థుల డేటా మొత్తం కరప్ట్ అయ్యింది. ఆ తర్వాత మాన్యువల్ పద్ధతిలో కాలేజీల వారీగా వివరాలను ఆన్లైన్ చేయడంతో అడ్మిషన్ల ప్రక్రియలో తీవ్రజాప్యం నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఇంటర్‌బోర్డు హడావిడిగా సీజీజీ (సెంటర్‌ఫర్ గుడ్ గవర్నెన్స్)ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. డేటా ప్రాసెసింగ్‌లో అనుభవమున్న సీజీజీ.. ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేసింది. ఈ ప్రక్రియ ఆలస్యమవడంతో 2018–19 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ల ప్రక్రియ జాప్యం కారణంగా.. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు చుక్కలు కనిపించాయి. అయితే.. సీజీజీ మొత్తం వివాదాన్ని క్లియర్ చేసిన ఇచ్చిన తర్వాత స్వల్ప మార్పులు, చేర్పులు చేసే పనిమాత్రమే గ్లోబరీనాకు మిగిలింది. అయితే ఈ దశలోనూ ఆ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో.. మళ్లీ డేటా కరప్షన్ కారణంగా విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులు డేటాలో మారిపోయాయి. దీంతో పరీక్షల సమయంలో.. విద్యార్థులకు ఎంచుకున్న సబ్జెక్టులు కాకుండా ఇతర సబ్జెక్టులున్న ఓఎంఆర్ షీట్లు జారీ అయ్యాయి. ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు చొరవతీసుకుని.. సమీపంలోని పరీక్షా కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోని ఎగ్జామ్ సెంటర్ల నుంచి ఆయా సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు తెచ్చి సర్దుబాటు చేయడంతో విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్ష ఫీజుల స్వీకరణలోనూ ఆగమాగం ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్ష ఫీజుల చెల్లింపు విషయంలోనూ భారీగా తప్పిదాలు జరిగాయి. ఫీజు స్వీకరణ తేదీని ప్రకటించిన నాటినుంచే చెల్లింపుల వెబ్సైట్ తెరుచుకోవాలి. కానీ వెబ్సైట్లో సాంకేతిక సమస్యల కారణంగా.. నెలరోజులపాటు ఫీజు చెల్లింపు తేదీని పొడిగించాల్సిన దుస్థితికి గ్లోబరీనా వైఫల్యమే కారణం. క్షేత్రస్థాయిలో విద్యార్థులు కాలేజీలకు ఫీజులు చెల్లించగా.. వాటిని ఆన్లైన్లో జనరేట్ చేసి చలాన్లు చెల్లిస్తారు. ఫీజు ప్రాసెసింగ్‌లో భాగంగా ఈ సమాచారాన్ని ఫీజు చెల్లించిన, చెల్లించని విద్యార్థులను వేరు చేసి చూపేలా సాంకేతిక సహకారాన్ని గ్లోబరీనా అందించాలి. కానీ అందులోనూ దారుణ సాంకేతిక వైఫల్యం తలెత్తింది. ఈ సమస్యలను సరిదిద్దడంలో గ్లోబరీనా లోపాలు సుస్పష్టం కావడంతో పలుమార్లు ఫీజు గడువును పొడిగించాల్సి వచ్చింది. చివరగా ఫలితాల ప్రాసెసింగ్‌లోనూ భారీగా అవకతవకలు జరిగాయి. దీంతో మెరిట్ విద్యార్థులకు తక్కువ మార్కులు రావడం, కొందరు ఫెయిల్ అవడంతో రాష్ట్రవ్యాప్తంగా గందరగోళం నెలకొంది. డీపీఆర్పీ ప్రాజెక్టును చేపట్టిన గ్లోబరీనా అడుగడుగునా నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి తప్పిదాలు చేయడమే విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఉద్యోగుల ఫిర్యాదు పైనా స్పందన కరువు డీపీఆర్పీ ప్రాజెక్టు అమల్లో.. కాంట్రాక్టు తీసుకున్న సంస్థ వ్యవహారశైలిపై మొదటినుంచీ ఇంటర్‌బోర్డు ఉద్యోగులు అసంతృప్తికరంగానే ఉన్నారు. కాంట్రాక్టు సంస్థకు సరైన అనుభవం లేకపోవడంతో బోర్డు తరపున చేయాల్సిన పనులను ఒకటికి రెండుసార్లు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఉద్యోగులకు చికాకు తెప్పింది. ఈ క్రమంలో కాంట్రాక్టు సంస్థ వ్యవహారశైలి, తప్పిదాలపై బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో భాగంగా చేయాల్సిన పనులు కాంట్రాక్టు సంస్థ సక్రమంగా చేయలేదని ఊహించిన కొందరు ఉద్యోగులు.. గతేడాది డిసెంబర్ చివరి వారంలో లిఖితపూర్వక ఫిర్యాదును ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి సమర్పించారు. ఈ ఫిర్యాదుతో గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో కొంతైనా మార్పు వస్తుందని ఆ ఉద్యోగులు భావించారు. కానీ కాంట్రాక్టు సంస్థకు బోర్డు నుంచి ఎలాంటి సూచన, హెచ్చరిక అందకపోవడంతో.. డీపీఆర్పీ ప్రాజెక్టు మరింత అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగులు సమర్పించిన ఫిర్యాదుతోనైనా స్పందించుంటే.. లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదని బోర్డు సిబ్బందొకరు వాపోయారు. పొరపాట్లు జరిగాయి.. సవరిస్తున్నాం ఇంటర్మీడియట్ ఫలితాల్లో పొరపాట్లు జరిగిన మాట వాస్తవమే. వాటిని సవరించే చర్యలు చేపట్టాం. జన్నారం మండలానికి చెందిన నవ్య జవాబు పత్రం వాల్యుయేషన్ ప్రక్రి యలో ఎగ్జామినర్, సూపర్వైజర్ తప్పిదాలున్నట్లు గుర్తించాం. విద్యార్థినికి వాస్తవ మార్కులు ఇచ్చాం. దీనిపై ఎగ్జామినర్, సూపర్వైజర్ల వివరణ కోరాం. తప్పులు చేసిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ ప్రక్రియ పద్ధతి ప్రకారమే జరుగుతుంది. తేదీ పొడిగింపు అంశాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. – అశోక్, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి -
విద్యార్థుల భవిష్యత్తుపై ప్రైవేటు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో భారీస్థాయిలో అవకతవకలకు.. లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమాగమయ్యేందుకు ఓ ప్రైవేటు సంస్థ నిర్వాకమే కారణమైంది. ఇంటర్మీడియట్ బోర్డు వ్యవహారాల్లో ఓ ప్రైవేటు సంస్థ చక్రం తిప్పడం కారణంగానే ఈ సమస్యలు ఉత్పన్నమై నట్లు స్పష్టమైంది. కనీస అర్హతలు లేకుండానే ఇంటర్మీడియట్ డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్ (డీపీఆర్పీ) బాధ్యతలను చేజిక్కించుకున్న సంస్థ.. అసలు ప్రక్రియనంతా అడ్డదిడ్డంగా చేపట్టడంతోనే పరిస్థితి తారుమారైంది. ఫలితంగా ఇటీవల వెల్లడైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీగా పొరపాట్లు చోటుచేసుకోవడంతో వేలాది విద్యార్థులు ఆందోళనకు గురికాగా.. తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఫలితాల్లో పొరపాట్లు ఎలా జరిగాయి? విద్యార్థులు పరీక్షకు హాజరైనా ఫలితాల్లో గైర్హాజరైనట్లు ఎలా రికార్డయింది? టాపర్లు, మెరిట్ రికార్డున్న విద్యార్థులు ఒక సబ్జెక్టులో.. అదీ అత్యంత తక్కువ మార్కులతో ఎలా ఫెయిలయ్యారు? అనే అంతుచిక్కని ప్రశ్నలకు బోర్డు నుంచి జవాబు రావడంలేదు. చేసిన ఘనకార్యా న్ని కప్పిపుచ్చుకునేందుకు.. అవసరమైతే రీ–కౌం టింగ్, రీ–వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొమ్మని బోర్డు సలహా ఇవ్వడం ఆగ్రహానికి కారణమవుతోంది. ప్రైవేటు సంస్థ పాత్ర ఏంటి? ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పిదాలపై జరుగుతున్న చర్చలతో.. ఓ ప్రైవేటు సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. ఇంటర్మీడియట్ అడ్మిషన్లు మొదలు, ఫలితాల వెల్లడివరకు అవసరమైన సాంకేతిక సహకారమంతా.. మొన్నటివరకు ప్రభుత్వ రంగ సంస్థ – సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్‌గవర్నెన్స్) అందించేది. 2018–19 విద్యా సంవత్సరం నుంచి మాత్రం ఈ బాధ్యతల్ని అన్ని అర్హతలున్న ప్రైవేటు సంస్థకు ఇవ్వాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం టెండర్ల ప్రక్రియకు తెరలేపింది. టెండర్లు పిలిచిన యంత్రాంగం.. తక్కువకు కోట్ (ఎల్1) చేసిన గ్లోబరీనాకు టెండర్లు ఖరారు చేసింది. దీంతో అడ్మిషన్ల నుంచి ఫలితాలు విడుదల చేసే వరకు జరిగే డేటా ప్రాసెసింగ్, ఫీజు ప్రాసెసింగ్, ఫలితాల ప్రాసెసింగ్ గ్లోబరీనా చేతుల్లోకి వెళ్లింది. తాజాగా విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలి తాల్లో పెద్దఎత్తున తప్పిదాలు జరగడంతో.. అసలు తప్పిదం ఎక్కడ జరిగిందనే దానిపై జరిగిన చర్చలో.. ఈ గ్లోబరీనా సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. అర్హత లేకున్నా అక్రమంగా: గ్లోబరీనా సంస్థకు టెండరు కట్టబెట్టడం, డీపీఆర్పీ ప్రాజెక్టు అప్పగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు దక్కాలంటే ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలకు సంస్థ అర్హతలు సరిపోవాలి. కానీ గ్లోబరీనాకు పలు కేటగిరీల్లో అర్హత లేకున్నా అక్రమంగా డీపీఆర్పీ అధికారాలు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 3లక్షల మంది విద్యార్థులున్న ప్రభుత్వ బోర్డు లేదా యూనివర్సిటీకి వరుసగా 5ఏళ్ల పాటు సాంకేతిక ఆధారిత పరీక్షల ప్రక్రియలో సహకారం అందించి ఉండాలి. దేశవ్యాప్తంగా ఐదు ప్రభుత్వ బోర్డులు లేదా యూనివర్సిటీలకు సాంకేతిక ఆధారిత పరీక్షలకు కచ్చితంగా పనిచేసి ఉండాలి. అందులో తప్పకుండా ఇంటర్మీడియట్ బోర్డు తప్పకుండా ఉండాలి. కానీ గ్లోబరీనాకు ఈ రెండు అర్హతలు లేనట్లు తెలుస్తోంది. టెండరు పత్రంలో సమర్పించిన వివరాల ప్రకారం.. 2.5లక్షల మంది విద్యార్థులున్న కాకినాడ జేఎన్టీయూతో గ్లోబరీనా మరో రెండు సంస్థలతో కలిసి పనిచేసినట్లు పత్రాన్ని సమర్పించింది. అదేవిధంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుతో 2017 సంవత్సరంలో 18,341 మంది విద్యార్థులు రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ ప్రక్రియలో సహకారం అందించినట్లు పత్రాన్ని సమర్పించింది. వాస్తవ నిబంధనలకు గ్లోబరీనా అర్హతలు సరిపోలకున్నా టెండర్ ఖరారు చేయడంపై అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. అనుభవం లేకపోవడంతో ఆగమాగం డీపీఆర్పీ ప్రాజెక్టు దక్కించుకున్న గ్లోబరీనాకు అర్హతలు లేకపోవడానికి తోడు సరైన అనుభవం లేకపోవడంతో ఇంటర్మీడియట్ ఫలితాల్లో భారీ తప్పిదాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. డీపీఆర్పీ ప్రాజెక్టు దక్కించుకోవాలంటే అంతకు ముందు ఇంటర్మీడియట్ డాటా ప్రాసెసింగ్, రిజల్ట్ ప్రాసెసింగ్‌లో భాగస్వామ్యమై ఉంటే.. అనుభవం వచ్చేది. కానీ గ్లోబరీనాకు ఈ వ్యవహారంలో కనీస అనుభవం కూడా లేదని స్పష్టమైంది. 2018–19 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ సమయంలో ఓఎంఆర్ షీట్లలో పొరపాట్లు జరగడం, అంతకుముందు అడ్మిషన్ల సమయంలో డేటా ప్రాసెసింగ్ గందరగోళంగా సాగడం.. విద్యార్థులు ఎంచుకున్న సబ్జెక్టులు కాకుండా ఇతర పరీక్షలు ఆన్లైన్లో అప్డేట్ కావడం వంటి తప్పిదాలు చోటుచేసుకోవడం కారణంగానే.. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు తప్పుల తడకగా వచ్చినట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా? ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సం స్థకు 10లక్షల మంది వి ద్యార్థుల భవిష్యత్తును ఎలా అప్పగించారు? నిబంధనలను అనుగుణంగా అర్హతల్లేని ప్రైవేటు సంస్థకు అప్పనంగా టెండర్‌ను కట్టబెట్టడంలో ఆంతర్యమేంటనేది బోర్డు స్పష్టం చేయాలి. ఉన్నతాధికారులు చేసిన తప్పిదాలకు కిందిస్థాయి ఉద్యోగులకు బలిచేయాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రయత్నిస్తోంది. రహస్య ఒప్పందం ప్రకారమే గ్లోబరీనాకు టెండర్ దక్కిందనేది సుస్పష్టం. – పి.మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ -
ఈ ‘ప్రశ్నల’కు ఏదీ ‘జవాబు?’
సాక్షి, కాకినాడ : ఉన్న ఊళ్లో రూపాయికి దొరికే సరుకునే పొరుగూరు వెళ్లి అయిదుకో, పదికో కొనేవాడిని ఎవరైనా ఏమంటారు? ‘తెలివితక్కువ దద్దమ్మ’ అనో, ‘డబ్బు విలువ తెలియని దుబారా మనిషి’ అనో అంటారు. మరి, రూ.7.4 కోట్లతో అయ్యే ప్రక్రియకే రూ.43.2 కోట్లు వెచ్చించనున్న జేఎన్టీయూ కాకినాడకూ అవే మాటలు వర్తిస్తాయి. అయితే తక్కువ మొత్తంతో అయ్యే ప్రశ్నపత్రాల రూపకల్పన, జవాబుపత్రాల మూల్యాంకనల కోసం అయిదు రెట్లు అదనంగా ఖర్చు పెట్టడం వెనుక ఉన్నది కేవలం తింగరి తనమో, దుబారా తత్వమో కాదని, వర్సిటీ పెద్ద తలకాయ బంధువుకు చెందిన సంస్థకు మేలు కూర్చాలన్న దురాలోచనే ఇందుకు కారణమని ఆరోపణ వినిపిస్తోంది. అంతే కాక.. గతంలో వర్సిటీ పర్యవేక్షణలోనే జరిగిన ఆ ప్రక్రియను ఇప్పుడు ఒప్పందం పేరుతో ప్రైవేట్ సంస్థకు అప్పగించడం అంటే.. లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తును వారి చేతుల్లో పెట్టడమేనని విద్యారంగ నిపుణులు అంటున్నారు. జేఎన్టీయూకే పరిధిలోని దాదాపు 270 కళాశాలల్లో సుమారు నాలుగు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి ఏడాదికి రెండు సెమిస్టర్ల చొప్పున పరీక్షలు జరుగుతుంటాయి. వాటికి అవసరమైన ప్రశ్న పత్రాల రూపకల్పన, జవాబు పత్రాల మూల్యాంకనం (వాల్యుయేషన్) ఇంత వరకు వర్సిటీ పర్యవేక్షణలోనే జరిగేది. దీని నిమిత్తం నాలుగేళ్లకు రూ.7.4 కోట్లను వర్సిటీ వెచ్చించేది. ఇప్పుడు ఈ ప్రక్రియను గ్లోబరెనా టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్ (జీటీపీఎల్)కు కట్టబెడుతూ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం వర్సిటీ పరిధిలో జరిగే పరీక్షల్లో ప్రశ్న పత్రాల తయారీ, జవాబు పత్రాల మూల్యాంకన బాధ్యతల్ని నాలుగేళ్ల పాటు జీటీపీఎల్, దానికి అనుబంధంగా పని చేసే మరో రెండు సంస్థలూ చేపడతాయి. దీని నిమిత్తం వర్సిటీ జీటీపీఎల్కు రూ.43.2 కోట్లు చెల్లిస్తుంది. అంతేకాదు..ఆ సంస్థ కేవలం ప్రశ్నపత్రాలను రూపొందించడం, జవాబు పత్రాల మూల్యాంకనం మాత్రమే చూస్తుంది. అందుకు అవసరమైన సాధన సంపత్తిని, మూల్యాంకన ప్రక్రియకు అవసరమైన వసతిని కూడా వర్సిటీయే సమకూర్చాల్సి ఉంటుంది. డిసెంబర్లో కొన్న స్టాంపు పేపర్‌పై నవంబర్లోనే ఒప్పందం.. వర్సిటీ తరఫున రిజిస్ట్రార్ జీవీఆర్ ప్రసాదరాజు, సంస్థ తరఫున జీటీపీఎల్ సీఈఓ వీఎస్ఎన్ రాజు, సాక్షులుగా వర్సిటీ డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ సీహెచ్ సాయిబాబా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సీహెచ్ సత్యనారాయణ, సంస్థ తరఫున విజయ్ ఎన్.రావు, బీఎస్వీఎస్ రామచందర్ సంతకాలు చేసిన ఒప్పందాన్ని 2013 నవంబర్‌లో రిజిస్టర్ చేసినట్టు చెపుతున్నారు. వర్సిటీ నిర్వహణలో కేవలం రూ.7.4 కోట్లు మాత్రమే ఖర్చయిన ప్రక్రియకు సంబంధించి.. అంతకు అయిదు రెట్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక వర్సిటీలో అత్యున్నత బాధ్యతలు నిర్వర్తిస్తున్న వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణ వినిపిస్తోంది. ఆ వ్యక్తి సోదరుడు జీటీపీఎల్‌లో భాగస్వామి అని, అస్మదీయుని లబ్ధికే ఇలా వర్సిటీ పర్యవేక్షణలో తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రక్రియను అతి ఎక్కువకు నిర్వర్తించేలా నష్టదాయక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని వర్సిటీ వర్గాలే అంటున్నాయి. ఈ ఒప్పందం వల్ల మునుముందు తమకు జీతాలు ఇవ్వడానికి వర్సిటీకి కష్టతరం కావచ్చని కొందరు ప్రొఫెసర్లు సాక్షితో అన్నారు. అంతేకాక .. వర్సిటీతో పాటు విద్యార్థుల జాతకం మొత్తాన్ని ప్రైవేట్‌పరం చేసే ఈ విధానాన్ని రాష్ట్రంలో మిగిలిన అన్ని వర్సిటీలూ వ్యతిరేకించాయంటున్నారు. కాగా జీటీపీఎల్ ఈ పాటికే మొదటి సెమిస్టర్ ఫలితాలు ఇచ్చేయాల్సి ఉండగా ఇంతవరకూ ఇవ్వలేక పోయిందని, చివరికి మే నెలాఖరుకు ఇస్తారన్న భరోసా కూడా లేదని అంటున్నారు. కాగా వర్సిటీ, జీటీపీఎల్ల మధ్య ఒప్పందం 2013 నవంబర్‌లో కుదిరినట్టు ఉండగా అందుకోసం ఉపయోగించిన స్టాంపు పేపర్‌ను డిసెంబర్లో కొనుగోలు చేసినట్టు రికార్డయింది. మరి, డిసెంబర్లో కొన్న పత్రంపై నవంబర్లోనే ఒప్పందం ఎలా సాధ్యం, అసలు ఏమి ఆశించి విద్యార్థుల భవిష్యత్తును ప్రైవేట్ సంస్థ చేతుల్లో పెట్టారు అన్న ప్రశ్నలకు వర్సిటీ పెద్దలే జవాబు చెప్పాలి.