కార్పొరేట్‌ గుప్పెట్లో ఇంటర్‌ బోర్డు | Telangana Inter Board In Corporate Hands | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ గుప్పెట్లో ఇంటర్‌ బోర్డు

Published Fri, Apr 26 2019 1:29 AM | Last Updated on Fri, Apr 26 2019 5:42 AM

Telangana Inter Board In Corporate Hands - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కార్పొరేట్‌ కాలేజీల గుప్పెట్లో చిక్కి ఇంటర్మీడియట్‌ బోర్డు విలవిల్లాడుతోంది. బోర్డు అడ్డాగా కార్పొరేట్‌ అవినీతి, అక్రమాల దందా దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయింది. బోర్డులోని కొంతమంది కార్పొరేట్‌ సంస్థలతో కుమ్మక్కై ఆ సంస్థల అక్రమాలకు ప్రోత్సాహం అందిస్తూ వస్తు న్నారు. దీంతో ఆ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. తెలంగాణ ఏర్పాటు తరువాత కూడా ఈ దందా కొనసాగుతూనే ఉంది. బోర్డు లోని తమ అనుకూల వ్యక్తులతో అడ్డగోలు వ్యవ హారాలు నడుపుతూ చివరకు బోర్డు ప్రతిష్టనే అభాసుపాలు చేసే ప్రయత్నాలకు ఒడిగడుతున్నా రని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్మీ డియట్‌ బోర్డులో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో కార్పొరేట్‌ పాత్ర పైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నో ఏళ్లుగా ఇదే వ్యవహారం
రాష్ట్రంలో కార్పొరేట్‌ జూనియర్‌ కాలేజీల దందా ఎప్పటినుంచో కొనసాగుతోంది. బోర్డు అధికారుల అలసత్వం, ఆమ్యామ్యాలకు అలవాటు పడడం కారణంగా ఈ సంస్థల ఆగడాలకు అడ్డూఅదుపూ ఉండడంలేదు. పేరుకే నిబంధనలు జారీచేసే అధి కారులు వాటిపై పకడ్బందీ చర్యలు చేపట్టిన దాఖ లాలు పెద్దగా లేవు. అకడమిక్‌ అంశాల నుంచి మొదలుకొని కాలేజీల అనుమతులు, నిర్వహణ అంశాల వరకు అదే పరిస్థితి. అంతేకాదు రిటైరైన అధికారులను కన్సల్టెంట్లు, ఓఎస్‌డీ పేరుతో కొన సాగించేలా పావులు కదిపి తమ పనులను చేయిం చుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. ఈ కార్పొ రేట్‌ సంస్థల కాలేజీల్లో అనేక తప్పిదాలు, అక్ర మాలు జరుగుతున్నా బోర్డు అధికారులు పట్టించు కున్న దాఖలాలు లేవన్న ఆరోపణలున్నాయి.

ఆశాస్త్రీయ విధానానికి కార్పొరేట్‌ ఊతం
రాష్ట్రంలో అశాస్త్రీయ విద్యావిధానానికి కార్పొరేట్‌ విద్యాసంస్థలే తెరలేపాయి. అడ్డగోలు విధానాలతో జూనియర్‌ కాలేజీ విద్యావిధానాన్ని భ్రష్టు పట్టిం చాయి. కొద్దిమంది విద్యార్థుల ర్యాంకులను ఎరచూపి లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీకి గురిచేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కార్పొరేట్‌ ఒత్తిడితోనే ఇంటర్మీడియట్‌ విద్యలో సంస్కరణల అమలు జరగడంలేదు. ప్రస్తుతం సీబీఎస్‌ఈలో 11, 12 తరగతుల విధానం ఉంది. రాష్ట్రంలో మోడల్‌ స్కూళ్లు, గురుకులాల్లో ఇదే విధానం ఉంది. వాటిల్లో జూనియర్‌ లెక్చరర్‌ కేడర్‌తో సమానమైన పీజీటీకి బీఎడ్‌ తప్పనిసరి. కానీ జూనియర్‌ కాలేజీల్లో కార్పొరేట్‌ విద్యాసంస్థల ఒత్తిడితోనే ఈ నిబంధన అమలు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు కార్పొరేట్‌ కాలేజీల్లో బోధన నిర్వహించిన 220 రోజులను కూడా సక్రమంగా అమలు చేయడంలేదు. ఎంసెట్, నీట్, జేఈఈ శిక్షణలతోనే సరిపెడుతున్న యాజమాన్యాలు బోర్డు అధికారులను, జిల్లా ఇంటర్‌ విద్యా అధికారులను మేనేజ్‌ చేస్తూ విద్యార్థులపై తీవ్రఒత్తిడి పెంచి ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. అయినా వీరిపై బోర్డు చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు పక్కా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారుల కమిటీ పలుమార్లు సిఫారసు చేసినా, బోర్డు అధికారులు వీటి అమలును గాలికి వదిలేశారు.

లోపాలు అనేకం.. అయినా చర్యల్లేవ్‌!
ఒక చోట కాలేజీ అడ్రస్‌.. మరో చోట విద్యా సంస్థ.. పేరుకే ఆన్‌లైన్‌ ప్రవేశాలు.. అంతా ఇష్టారాజ్యమే. ఒక సొసైటీ పేరుతో కాలేజీలు, మరో పేరుతో నిర్వహణ విద్యార్థులకు రక్షణ ఉండదు. వేసవి సెలవుల్లో తరగతుల నిర్వహణ ఇలాంటి అనేక లోపాలపై బోర్డుకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. కాలేజీల హాస్టళ్లలో ఇరుకు గదుల్లో విద్యార్థులను కుక్కి, కనీస వసతులు కల్పించకపోయినా, వాటిపై అనేక ఫిర్యాదులు వచ్చినా బోర్డు అధికారుల్లో కనీస స్పందన లేదు. గతేడాది 20 మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అనేక ఆరోపణలు వచ్చాయి. అధికారుల కమిటీలు తనిఖీలు చేశాయి. బోర్డు.. నిపుణల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసులు చేసింది. వాటి ప్రకారం హాస్టళ్లకు అనుమతులు తప్పనిసరి అని, వాటిల్లో ఉండాల్సిన ప్రమాణాలు, వసతులపై ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినా బోర్డు వాటిని పక్కాగా అమలు చేసినా దాఖలాలు లేవు. విద్యార్థుల భవిష్యత్తు పేరుతో కార్పొరేట్‌ సంస్థలు బోర్డుపై ఒత్తిళ్లు తెచ్చి సడలింపులు పొందుతూ తమ పబ్బం గడుపుకుంటున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో 500కు పైగా జూనియర్‌ కాలేజీలు హాస్టళ్లతో నడుస్తుంటే.. అందులో సగం యాజమన్యాలు కూడా బోర్డుకు దరఖాస్తు చేసిన దాఖలాలు లేవు.

విద్యార్థుల జీవితాలతో ఆటలు
రాష్ట్రంలోని కార్పొరేట్‌ కాలేజీలు విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్నాయి. ప్రభుత్వాన్ని మోసం చేస్తూ తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయాలు ఫీజులుగా వసూలు చేస్తున్నాయి. పీఆర్‌వోల వ్యవస్థను పెట్టి ఆకర్షణీయమైన ప్రకటనలతో విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. వాటిల్లో కనీస వసతులు ఉన్నాయా? లేదా? అన్నది కూడా తల్లిదండ్రులు చూసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసమని వాటిల్లో చేర్చుతూ పిల్లలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. తల్లిదండ్రుల ఆశలను ఆసరాగా చేసుకుంటున్న యాజమాన్యాలు.. అనుమతులు తీసుకోకుండానే బ్రాంచీలను ఏర్పాటు చేస్తూ, ఒకే క్యాంపస్‌లో రెండేసి కాలేజీలను నడుపుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాయి. అయినా ర్యాంకుల ప్రచారహోరులో తల్లిదండ్రులు వాటినే ఆశ్రయిస్తుండటంతో కార్పొరేట్‌ యాజమాన్యాలు తమ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నాయి.

కార్పొరేట్‌ వ్యాపారానికే బోర్డు జై
ఇంటర్‌బోర్డు కార్పొరేట్‌ విద్యావ్యాపారానికి అనుకూల సంస్థగా మారిపోయింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రైవేటు కార్పొరేట్‌ విద్యావ్యాపారం తెలంగాణలోనే జరుగుతోంది. ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థుల్లో 80 శాతానికిపైగా కార్పొరేట్‌ కాలేజీల్లోనే ఉన్నారు. ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రభుత్వ లెక్చరర్లతోపాటు కార్పొరేట్‌ కాలేజీల లెక్చరర్లకు కూడా ఇచ్చారు. ఆయా కాలేజీల నుంచి వచ్చే లెక్చరర్లు నిజంగా వారి కాలేజీల్లో పాఠాలు చెప్పిన వారు కాదు. కాబట్టి వ్యాల్యుయేషన్‌ పెద్ద ఫార్సుగా మారిపోయింది. కార్పొరేట్‌ సంస్థలకు బోర్డు సర్వెంట్‌గా మారిపోయింది. కాబట్టి బోర్డును ప్రక్షాళన చేయాలి. లేదా బోర్డు ఎత్తేసి సీబీఎస్‌ఈ తరహాలో పాఠశాల విద్యలో కలపాలి. – నాగటి నారాయణ, తల్లిదండ్రుల సంఘం

కమిటీ పరిశీలన పూర్తి!
ఇంటర్మీడియట్‌ ఫలితాల వివాదంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ పరిశీలన దాదాపుగా పూర్తయింది. టీఎస్‌టీఎస్‌ ఎండీ వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్‌ వాసన్, ప్రొఫెసన్‌ నిషాంత్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ.. ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయం, ఫలితాలకు సంబంధమున్న అధికారులు, ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనా ప్రతినిధులతో వేరువేరుగా విచారించింది. మూడురోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వేగవంతంగా పరిశీలన చేసి గురువారం నాటికి పూర్తిచేసినట్లు తెలిసింది. వాస్తవానికి గురువారం రోజు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. రాత్రి పొద్దుపోయే వరకు కూడా కమిటీ నివేదిక సమర్పించలేదని సమాచారం. శుక్రవారం ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.

సాంకేతిక బాధ్యత మరో సంస్థకు
ఇంటర్మీడియట్‌ రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌తో పాటు అడ్వాన్స్‌ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి ప్రభుత్వ రంగసంస్థ సీజీజీ లేదా మరో ఇతర సంస్థ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకునే అవకాశం ఉంది. గ్లోబరీనాపై పలు తప్పిదాలు చేయడం, తీవ్రస్థాయిలో ఆరోపణలు రావడంతో ఇకపై ఆ సంస్థ సేవలను నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా వచ్చే నెల 16 నుంచి జరగాల్సిన అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్ష (ఏఎస్‌ఈ) తేదీల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్‌ దరఖాస్తులు పెద్ద సంఖ్యలో రావడం.. వాటికి ఎక్కువ సమయం తీసుకునే అవకాశం ఉండడంతో ఏఎస్‌ఈ తేదీలను ముందుకు జరిపే అవకాశముంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement