హైదరాబాద్(పంజగుట్ట): ఈ నెల 29న ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాలని తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజమే ఈ ధర్నాకు పిలుపునిచ్చిందని భావించి విద్యార్థి సంఘాలు, అన్ని పార్టీల నాయకులు హాజరు కావాలని కోరారు. ఇంటర్ పరీక్షాఫలితాల్లో 61 వేల తప్పిదాలు వచ్చాయని, దీనికి అనుభవంలేని గ్లోబరీనా సంస్థే కారణమని అన్నారు. ‘చదువుకుంటే బాగుపడతారని అనుకుంటాం, కానీ చదువుకుంటే చనిపోతాం’అని ఇప్పుడే తెలిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి జనసమితి అధ్యక్షుడు నిజ్జన రమేశ్ ముదిరాజ్ అధ్యక్షతన శుక్రవారం ఇక్కడి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘ఇంటర్ ఫలితాలు... దోషులు ఎవరు? పరిష్కారం ఏది?’అనే అంశంపై జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్, టీజేఎస్ నేత ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్‌రావుతోపాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు హాజరయ్యారు.
అన్ని సంఘాలను, పార్టీలను ఏకం చేసి ఉద్యమించే బాధ్యతను కోదండరాంకు అప్పగించాలని, ఇంటర్ ఫలితాల అంశంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని సమావేశం తీర్మానించింది. కోదండరాం మాట్లాడుతూ గతంలో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎంతో బాధ్యతగా పనిచేసిందని, దాన్ని కాదని గ్లోబరీనా అనే ప్రైవేట్ సంస్థకు ఇంటర్ పరీక్షల బాధ్యత అప్పగించినప్పటి నుండీ ఎన్నో సమస్యలు వచ్చాయన్నారు. పరీక్ష ఫీజు చెల్లించే సమయంలోనూ తీవ్ర గందరగోళం జరిగిందని, అప్పుడే ఇంటర్ బోర్డు మేల్కొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. సంస్థ వెనక ఎవరో ఉన్నారని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం పిల్లల జీవితాలతో ఆడుకున్నారని, లక్షలాదిమంది పిల్లల ప్రాణాలను పణంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్లోబరీనా సంస్థ చేస్తున్న తప్పుల గురించి ముందే తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాళ్లు ఏదైనా తప్పులు జరిగితే తమకు సంబంధంలేదని, వారి సంఘం తరపున తీర్మానం చేసి బోర్డు సెక్రటరీకి ఇచ్చారని, అయినా ప్రభుత్వంలో ఉలుకూపలుకూ లేదని దుయ్యబట్టారు. సమాజానికి పిల్లర్ల వంటి పిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఆవేదనగా ఉందన్నారు.
గ్లోబరీనాకు పర్చేస్ ఆర్డరే ఉంది..
ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ ‘గ్లోబరీనా, రాష్ట్ర ప్రభుత్వం ఐక్యంగా పనిచేస్తున్నాయి. కానీ మనమే సంఘాలుగా విడిపోయి నిరసనలు చేస్తున్నాం, ఇప్పటికైనా అందరం ఐక్యమై ఉద్యమించాలి’అని అన్నారు. ‘ఇంత జరుగుతున్నా ఏం జరగలేదు, అన్ని అపోహలు, రాజకీయం చేస్తున్నారని అంటున్నారు, ఏం జరగకపోతే ఇన్ని ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయి?, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి’అని ప్రశ్నించారు. గ్లోబరీనా సంస్థకు కేవలం పర్చేస్ ఆర్డర్ మాత్రమే ఉందని, అగ్రిమెంట్ లేదని, అగ్రిమెంట్ లేకుండా ఎంతో గోప్యంగా ఉంచాల్సిన విద్యార్థుల మార్కుల జాబితా వ్యవహారాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. ఎంసెట్ లీకేజీ, నయీం కేసు మాదిరిగా ఈ కేసు కూడా నీరుగారిపోకుండా ఐక్యంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, గ్లోబరీనా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, టీడీఎఫ్ అధ్యక్షుడు డీపీ రెడ్డి, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డి, నాయకులు బైరి రమేశ్, వెంకట్, భవాని, మమత, సత్యనారాయణ, అరుణ్ కుమార్, వెంకట్ స్వామి, గోపాల్ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
నియంత పాలన నడుస్తోంది...
మాజీ ఎంపీ వివేక్ మాట్లాడుతూ తెలంగాణలో నియంత పాలన నడుస్తోంది. క్యాబినెట్ లేదు, ఎవ్వరూలేరు. అన్ని నేనే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణం ముఖ్యమంత్రే అని, ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనా సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో నిషేధానికి గురైందని, అలాంటి దానికి కాంట్రాక్ట్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దీని వెనక ఎవరు ఉన్నారనే విషయంపై సిట్టింగ్ జడ్జిచే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ‘మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని అందరూ అంటున్నారు, కాని నిర్ణయాలన్నీ ప్రగతిభవన్ నుండి ముఖ్యమంత్రే చేస్తున్నారు. తెలంగాణలో వ్యవస్థ నడవడంలేదు, కేవలం నేను, నా కుటుంబం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment