రాజకీయాల్లో కొత్త పంథా.. ఆవిష్కరించాం | Kodandaram Interview On Occasion Of TJS Formation Day | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో కొత్త పంథా.. ఆవిష్కరించాం

Published Mon, Apr 29 2019 2:10 AM | Last Updated on Mon, Apr 29 2019 9:16 AM

Kodandaram Interview On Occasion Of TJS Formation Day - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘రాజకీయాల్లో కొత్త పంథాను ఆవిష్కరించాలనే మా ప్రయత్నం విజయవంతం అయిందనే భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా పింఛన్లు, రైతుబంధు పెంపు, నిరుద్యోగ భృతి లాంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చేలా అధికార పార్టీపై ఒత్తిడి తేవడంలో సఫలీకృతమయ్యాం. ఉద్యమ ఆకాంక్షలు, వెలుగుల ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం. ఏడాది కాలంలో రాజకీయంగా ఎంతో నేర్చుకున్నాం. గుణపాఠాల నుంచి వచ్చిన అనుభవాలు మమ్మల్ని మరింత రాటుదేలుస్తున్నాయి. ప్రజలపక్షాన నిలబడేందుకు బలంగా ముందుకెళ్లే తోవ చూపెడుతున్నాయి’అని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆ పార్టీ అధినేత ఎం. కోదండరాం తెలిపారు.

టీజేఎస్‌ ఏర్పాటైన నాలుగు నెలలకే వచ్చిన అసెంబ్లీ ఎన్నికలను దీటుగా ఎదుర్కోలేకపోయామన్నారు. అయితే ఓ రాజకీయ పార్టీగా ఎన్నికల్లో ఎలా పాల్గొనాలో నేర్చుకున్నామని, జూన్‌లో జరిగే ప్లీనరీలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని కొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తామని చెప్పారు. టీజేఎస్‌ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కోదండరాం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. పార్టీ ప్రస్థానంతోపాటు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వ్యవహార శైలి, అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వైఫల్యం, రాజకీయాల్లోకి మధ్యతరగతి, యువత రావాల్సిన ఆవశ్యకత లాంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

కొత్తవారు రాజకీయాల్లో చేరాలి...  
రాజకీయాలు అనగానే భయపడాల్సిన అవసరం లేదు. మధ్యతరగతికి చెందిన వారు, డిగ్రీలు, పీజీలు లేకుండానే సమాజంలో తమ పద్ధతిలో కార్యక్రమాలు చేపడుతున్న వారు రాజకీయాల్లోకి రావాలి. తమకు జరుగుతున్న అన్యాయంపై 125 మంది నిజామాబాద్‌ జిల్లా రైతులు లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్లు వేయడం, మహబూబాబాద్‌ జిల్లాలో ఆదివాసీలు అటవీ హక్కుల చట్టంపై కదలడం దేశ చరిత్రలోనే అపూర్వమైన ఘటనలు. సమస్య ప్రాతిపదికగా కదిలితే ఎన్నికల్లో, రాజకీయాల్లో పైసలు కీలకం కాదని, ప్రత్యామ్నాయ రాజకీయం సాధ్యమని నిరూపించారు.  

అన్యాయాలను ఎలుగెత్తి చూపాం...  
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష చాలా బలీయమైనది. సామాజిక, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా నిలబడ్డ తెలంగాణ సమాజం సాధించుకున్న రాష్ట్రంలో రాజకీయంగా మా వంతు పాలుపంచుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీని ఏర్పాటు చేశాం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా కుంగిపోలేదు. తెలంగాణ సమాజం కోరుకున్న రాష్ట్రాన్ని సాధించాలనే తపనతోనే పార్టీని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా చాలా ప్రజాసమస్యలను ఎజెండాపైకి తీసుకువచ్చాం. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఓ మార్గాన్ని నిర్మించగలిగాం. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చూపగలిగాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వైఫల్యం మాకో గుణపాఠం లాంటిది. భవిష్యత్తులో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలపైనే దృష్టి సారించి ముందుకెళ్తాం.

ఆ పార్టీల స్ఫూర్తితో ముందుకు...
ప్రజల ఆకాంక్షలకు రాజకీయ దృక్పథం ఇవ్వడం మా బాధ్యత. దాన్ని రాజకీయ పార్టీగా నిర్వర్తించడం పెద్ద సవాలే. రాజకీయమంటే డబ్బు వెదజల్లి మళ్లీ డబ్బు దండుకోవడమే అనే స్వభావంలో కూడా మార్పు రావాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నైతిక ఆచరణను ఎంచుకొని నిలబడే వాళ్లు తక్కువగానే కనిపిస్తున్నారు. అయినా టీజేఎస్‌ నైతికత, విలువలతో కూడిన రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ఎలాంటి అండదండలు లేకుండానే పెద్ద రాజకీయ శక్తిగా అవతరించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్‌ పార్టీల స్ఫూర్తితో ముందుకెళ్తాం.

ఆయన మాట ఎప్పటికీ గుర్తుంటుంది...
రాష్ట్రం ఏర్పడ్డాక దాని నిర్మాణం ప్రజాస్వామ్య స్వరూపం సంతరించుకునేలా చేయడం చాలా కష్టం. దాని కోసం సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందని ఆచార్య జయశంకర్‌ చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయన ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో గెలిచాక కూడా బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ముందుకెళ్తోంది. రాష్ట్రంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తోంది. అయితే సంక్షేమ పథకాల అమలే కాకుండా ప్రజాస్వామికంగా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత. దీన్ని మర్చిపోయి వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు. ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ప్రజలకుండాలి. ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా వ్యవహరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది.  

నేడు టీజేఎస్‌ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ జన సమితి (టీజేఎస్‌) ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు అధ్యక్షుడు కోదండరాం పార్టీ జెండాను ఎగురవేస్తారు. కార్యక్రమాల్లో ఆయనతోపాటు ఇతర నేతలు హాజరవుతారని టీజేఎస్‌ అధికార ప్రతినిధి, మీడియా కోఆర్డినేటర్‌ వి.యోగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ విద్య సంక్షోభం, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థుల పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఉత్సవాలను భారీగా నిర్వహించకుండా స్థానికంగా ఎక్కడికక్కడ పార్టీ జెండాలు ఎగురవేయాలని పార్టీకేడర్‌కు ఇదివరకే కోదండరాం విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement