సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో భారీగా చోటు చేసుకున్న పొరపాట్లకు కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌దే తప్పని స్పష్టమవుతోంది. ఫలితాలపై నెలకొన్న పరిస్థితి ని క్షుణ్నంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈ వ్యవ హారంలో జరిగిన పొరపాట్లను గుర్తించి నివేది కలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఫలితాల్లో తప్పిదాలకు కాంట్రాక్టు సంస్థదే ప్రధాన బాధ్యతగా కమిటీ అభిప్రాయ పడినట్లు సమాచారం. పరీక్ష ఫీజుల చెల్లింపు వెబ్‌సైట్ సరిగ్గా పని చేయకపోవడం మొదలు డేటా ప్రాసెసింగ్, లోపాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు, ఫలి తాల ప్రాసెసింగ్ వరకు గ్లోబరీనా సంస్థ అనేక సాంకేతిక తప్పిదాలకు పాల్పడిందని కమిటీ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అలాగే గ్లోబరీ నాకు కాంట్రాక్టు ఇవ్వడంలోనూ వ్యూహాత్మక తప్పిదం జరిగిందని, నిబంధనలను పట్టించు కోకుండా బోర్డు ఏకపక్షంగా కాంట్రాక్టును కట్టబెట్టినట్లు కమిటీ గుర్తించింది. కాంట్రాక్టు ప్రారంభమైన నాటి నుంచి గ్లోబరీనా పలు సాంకే తిక పొరపాట్లు చేసినా బోర్డు కనీసం పట్టించు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కమిటీ తేల్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదే విధంగా కాంట్రాక్టు కట్టబెట్టడంలో జరిగిన అవకతవకలపైనా ఆరా తీసినట్లు సమాచారం.
సమాచారమంతా నివేదికలోకి...
ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై త్రిసభ్య కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. పరీక్షల నిర్వ హణ, ఫలితాల వెల్లడిలో జరి గిన ప్రక్రియనంతా వడపోసిన కమిటీ... ఇందులో బాధ్యులుగా ఉన్న వారిని కేటగిరీలవారీగా విభజించి వివరాలను సేకరిం చింది. ఇంటర్ బోర్డు అధి కారులు, ఉద్యోగులతోపాటు గ్లోబరీనా ప్రతినిధులు, గతంలో పరీక్షల నిర్వహణలో కీలకపాత్ర పోషించిన వారితోనూ మాట్లాడింది. అలాగే కాంట్రాక్టు సంస్థ, ఇంటర్ బోర్డు అధికారులపై వస్తున్న విమర్శలపైనా సమాచారాన్ని సేకరించి నట్లు తెలిసింది. ఈ వివరాలతోపాటు అధికారు లపై వచ్చిన ఆరోపణలు, మీడియా కథనాలను క్రమ పద్ధతిలో సేకరించి వాటిని విశ్లేషించింది. కమిటీ ఇచ్చే నివేదికతో పాటు బయటివర్గాల నుంచి విశ్వసనీయంగా సేకరించిన వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.
ష్... గప్‌చుప్...
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గందర గోళంలో పడేసిన ఇంటర్ ఫలితాల విషయంలో తప్పొప్పుల నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రస్తుతం తమ విచారణ వివరాలను ఎక్కడా ప్రస్తావించడంలేదు. కనీసం మీడియాతో సైతం మాట్లాడేందుకు నిరాకరిస్తోంది. కమిటీ చైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులు సైతం పరిశీలన తాలూకు అంశాలను బయటకు వెల్లడి కానివ్వడం లేదు. ఇంటర్ ఫలితాల తప్పిదాలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటం... లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో కమిటీ సభ్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నివేదికలోని అంశాలు బయటపడితే పరిస్థితి తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించే వరకు కమిటీ బృందం అత్యంత గోప్యత పాటించాలని నిర్ణయించిన క్రమంలో ఎప్పుడు ప్రభుత్వ దరికి నివేదిక చేరుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
త్రిసభ్య కమిటీపై తీవ్ర ఒత్తిడి?
ఇంటర్ ఫలితాల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై ఒత్తిడి తీవ్రమవుతోంది. మూడు రోజుల్లో పరిస్థితిని పూర్తిగా పరిశీలించి సుదీర్ఘ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించంతో గురువారమే వివరాల సేకరణ పూర్తి చేసింది. అయితే శుక్రవారం సాయంత్రం నాటికి కూడా నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. సాంకేతిక కారణాలతో నివేదిక సమర్పణలో జాప్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో నివేదిక సమర్పణ కోసం కమిటీపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు గ్లోబరీనా సంస్థపై ఆరోపణలకు తోడు... ఆ సంస్థ తప్పిదాలు, ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులతో కొనసాగించిన వ్యవహారాలపై కమిటీ తన నివేదికలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కమిటీపై గ్లోబరీనా సంస్థ కూడా ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫలితాల విషయంలో సంస్థ పొరపాట్లు లేవనే అంశాన్ని బలంగా వినిపించేందుకు కాంట్రాక్టు సంస్థ రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నివేదికలో సంస్థ పరపతికి భంగం కలగకుండా చూడాలని కమిటీని కోరేందుకు గ్లోబరీనా యాజమాన్యం శతవిధాలా ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కమిటీ సభ్యులు నివేదికను అత్యంత గోప్యంగా ప్రభుత్వానికి చేరవేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం.
‘గ్లోబరీనా’దే గోల్‌మాల్!
Published Sat, Apr 27 2019 1:21 AM | Last Updated on Sat, Apr 27 2019 10:58 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment