ఇంటర్‌ అవకతవకలు : అంతా పథకం ప్రకారమే! | Globarena Done Mistakes In Intermediate Results | Sakshi
Sakshi News home page

ఏకమయ్యారు... ఎగరేసుకుపోయారు!

Published Wed, Apr 24 2019 1:23 AM | Last Updated on Wed, Apr 24 2019 11:43 AM

Globarena Done Mistakes In Intermediate Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ బోర్డులో డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రాజెక్టు టెండర్‌ కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు ఉన్నతాధికారులు తమకు అనుకూలురైన వారికి మేలు జరిగే విధంగా టెండర్‌ విధానాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఒక పని లేదా ప్రాజెక్టు అమలును నేరుగా ప్రైవేటు సంస్థకు అప్పగించకుండా టెండర్లు పిలిచి కాంట్రాక్టు సంస్థను ఖరారు చేస్తారు. టెండర్లు పిలిచిన సమయంలో ఆశావహ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించి తక్కువ ధరలో కోట్‌ చేసే సంస్థకు ప్రాజెక్టు బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకు సంబంధించి నిపుణుల సమక్షంలో దరఖాస్తు పరిశీలన జరుగుతుంది. కానీ ఇంటర్‌ బోర్డు డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్‌ ప్రాజెక్టు అప్పగింత అంతా ఏకపక్షంగా జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు ఉన్నతాధికారులు తమకు అనుకూల సంస్థకు కాంట్రాక్టు దక్కేలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కేవలం అనుకూల సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

టెండర్‌ వేసింది రెండు సంస్థలే!
ఇంటర్‌ అడ్మిషన్లు, ప్రీ ఎగ్జామినేషన్, పోస్ట్‌ ఎగ్జామినేషన్, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్, ఓఎంఆర్‌ షీట్ల స్కానింగ్‌ తదితర పనులకు ఇంటర్మీడియెట్‌ బోర్డు 2017 సెప్టెంబర్‌లో టెండర్లు పిలిచింది. నెల రోజులపాటు బిడ్ల దాఖలుకు అవకాశం కల్పించినప్పటికీ కేవలం రెండు సంస్థలు మాత్రమే టెండర్లు వేశాయి. గడువులోగా కేవలం గ్లోబరీనా టెక్నాలజీస్, మ్యాగ్నటిక్‌ ఇన్ఫోటెక్‌ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఈ క్రమంలో టెండర్లు తెరిచి ఖరారు చేసే పనిలో భాగంగా ఎల్‌1 (లోయెస్ట్‌ వన్‌) కంపెనీగా ఉన్న గ్లోబరీనాను ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త సంస్థ అయినప్పటికీ తక్కువ మొత్తానికి కోట్‌ చేయడంతో ఎంపిక చేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్‌ పేర్కొన్నారు. గ్లోబరీనా సంస్థ సేవలను ఇంటర్‌ బోర్డు మూడేళ్లపాటు వినియోగించుకోనుంది.

అంతా పథకం ప్రకారమే...
డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్‌ ప్రాసెసింగ్, ఓఎంఆర్‌ షీట్ల స్కానింగ్‌కు సంబంధించిన ప్రాజెక్టు అనుకూల సంస్థకు అప్పగించడం అంతా పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు పది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే భారీ ప్రాజెక్టుకు కేవలం రెండు సంస్థలు మాత్రమే టెండర్‌ వేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ టెండర్‌లో పాల్గొన్న రెండు సంస్థలు ఒకే కన్సార్షియంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలో జేఎన్‌టీయూ కాకినాడలో విద్యార్థుల ఆన్సర్‌ స్క్రిప్ట్స్‌ ఆన్‌లైన్‌ ఎవాల్యూషన్‌ కార్యక్రమంలో గ్లోబరీనా, మ్యాగ్న టిక్‌ సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రక్రియలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్‌ స్క్రిప్ట్స్‌ ఆన్‌లైన్‌ ఎవాల్యూషన్‌ చేసినట్లు జేఎన్‌టీయూ కాకినాడ సర్టిఫై చేసింది. తాజాగా ఇంటర్మీడియెట్‌ బోర్డుకు ఈ రెండు సంస్థలు అడపాదడపా సేవలం దిస్తున్నట్లు అధికారులు సైతంచెబుతున్నారు. మ్యా గ్నటిక్‌ సంస్థతో దాదాపు 13 సంవత్సరాలు కలసి పనిచేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్‌ స్వయంగా అంగీకరించారు. టెండర్‌ ప్రక్రియలో తక్కువ కోట్‌ చేయడంతో గ్లోబరీనాకు టెండర్‌ ఖరారు చేశామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ రెండు సంస్థల కు ఉన్న అర్హతల ఆధారంగానే టెండర్‌ నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement